
Ntr-Mahesh Babu: కృష్ణుడిగా మహేశ్‌బాబు బాగుంటారు: తారక్
ఇంటర్నెట్ డెస్క్: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తోన్న కార్యక్రమం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. గత కొన్ని రోజులుగా విజయవంతంగా ప్రసారమైన తొలి సీజన్ ఆదివారంతో ముగిసింది. ఆఖరి ఎపిసోడ్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు పాల్గొని సందడి చేశారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి బుల్లితెరపై కనిపించడం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తారక్ సంధించిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇస్తూ.. మహేశ్ మొత్తం రూ.25లక్షలు గెలుచుకున్నారు. అలాగే.. ప్రశ్నల మధ్యలో మహేశ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఓ ప్రశ్నలో సంగీత వాయిద్యాల ప్రస్తావన రావడంతో.. తాను చిన్నతనంలో వీణ బాగా వాయించేవాడినని, ప్రస్తుతం బిజీ షెడ్యూల్ కారణంగా వీణ వాయించే సమయం ఉండట్లేదని మహేశ్ తెలిపారు. ‘ఒక్కడు’ సినిమా పాటలు చాలా ఇష్టమని.. వాటిని వింటూ ఎంజాయ్ చేస్తానని చెప్పారు. మహాభారతంలోని పాత్రల్లో ఏ పాత్ర అంటే ఇష్టం..? ఒకవేళ సినిమాగా తెరకెక్కిస్తే ఏ పాత్రలో నటిస్తారని ఎన్టీఆర్ ప్రశ్నించగా.. మహాభారతంలో అన్ని పాత్రలు చాలా కీలకమని, ఎంచుకోవడం కష్టమని మహేశ్ సమాధానం ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ స్పందిస్తూ.. శ్రీ కృష్ణుడి అవతారంలో మహేశ్‌బాబు బాగుంటారని అన్నారు.
క్రికెట్ చూడటానికి ఇష్టపడతానని, చిన్నతనంలో బాగా ఆడేవాడినని మహేశ్ తెలిపారు. ఇప్పుడు ఆడే వీలు లేకుండా పోయిందన్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ కలుగుజేసుకొని.. ‘త్వరలో మీరు దర్శకుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నారు కదా.. సెట్‌లో ఆయన మీతో ఆటలు ఆడిస్తారు. మనలోని ఉత్తమ నటనను వెలికితీసే వరకూ వదిలిపెట్టరు. అయితే, వచ్చిన ఔట్‌పుట్ చూస్తే.. మన కష్టానికి ప్రతిఫలం లభించిందన్న సంతృప్తి కలుగుతుంది’అని ఎన్టీఆర్ చెప్పారు.
కుటుంబం గురించి మహేశ్ మాట్లాడుతూ ‘‘తండ్రిగా పిల్లలతో ప్రతిక్షణాన్ని బాగా ఆస్వాదిస్తాను. కుటుంబంతో కలిసి ఏడాదిలో కనీసం మూడు విదేశీ యాత్రలకు వెళ్తుంటాను. ఈ విహారయాత్రలు మాలో బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి’’అని చెప్పారు.
ఇక తను ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా గురించి మహేశ్.. ప్రస్తావిస్తూ ఈ సినిమా పోకిరిలా ఉంటుందని, ఇందులో తనది చాలా ఎనర్జిటిక్.. ఎంటర్‌టైనింగ్ పాత్ర అని తెలిపారు. ఈ ఎపిసోడ్‌తో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ సీజన్ 1 ముగిసింది.
► Read latest Cinema News and Telugu News