Sarkaru Vaari Paata: ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి.. పరశురామ్‌ ప్రత్యేకత అదే: మహేశ్‌బాబు

చాలాకాలం తర్వాత మహేశ్‌బాబు సరికొత్త లుక్‌లో, యాక్షన్‌ నేపథ్యంలో నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. పరశురామ్‌ దర్శకుడు.

Published : 10 May 2022 23:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలాకాలం తర్వాత మహేశ్‌బాబు సరికొత్త లుక్‌లో, యాక్షన్‌ నేపథ్యంలో నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. పరశురామ్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైనర్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా మహేశ్‌ విలేకరులతో మాట్లాడారు. పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సంగతులివీ..

* ఈ సినిమాలో మీరింత కొత్తగా కనిపించడానికి కారణం? 

ఈ సినిమాకు సంబంధించిన అన్ని అంశాల్లో దర్శకుడు పరశురామ్‌కే క్రెడిట్‌ దక్కుతుంది. కథానాయకుడి పాత్రే కాదు కథను ఎంతో అద్భుతంగా రూపొందించారాయన. ఇందులో నా బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ కొత్తగా ఉంటుంది. వీటిని చూసి నాకు ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి. ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ పూర్తయిన సమయానికి నా జుట్టు పొడవుగా లేదు. కానీ, అప్పుడున్న జుట్టుతోనే మెడపై టాటూ వేసి ‘సర్కారు వారి’ లుక్‌ ఇలా ఉంటుందని చూపించారు. దాన్ని చూడగానే వావ్‌ అనిపించింది. అది పూర్తయిన కొంతకాలానికి లుక్‌పై శ్రద్ధ తీసుకున్నా.

* ఈ సినిమాను ‘పోకిరి’తో పోలుస్తున్నారెందుకు?

‘సర్కారు వారి పాట’లోని హీరో క్యారెక్టర్ ‘పోకిరి’ మీటర్‌లోనే ఉంటుంది. అందుకే చాలామందికి అలా అనిపిస్తుంది. మాస్‌ చిత్రం ‘పోకిరి’ని చూస్తుంటే ఇప్పటికీ ఎంతో హుషారొస్తుంది. అలాంటి పాత్ర ఇన్నాళ్లకు లభించడం ఆనందంగా ఉంది.

* ‘మేజర్’ ట్రైలర్ విడుదల వేడుకలో నాలుగేళ్లుగా ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టర్ అని అన్నారు కదా!

నేను ఎంపిక చేసుకున్న కథలు, నా అనుభవంతోనే ఆ మాట చెప్పా. నాలుగేళ్లుగా నా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. నా గత చిత్రాల్లానే ‘సర్కారు..’ మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది.

* మీరు చాలా మంది దర్శకులతో పని చేశారు. పరశురామ్‌ ప్రత్యేకత ఏంటి?

పరాశురామ్‌ రచనా విధానం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అదే ఆయన ప్రత్యేకత. ఎప్పుడూ ఎంతో పాజిటివ్‌గా ఉంటారు. ఆయన తెరకెక్కించిన ‘గీత గోవిందం’ నాకు ఇష్టమైన సినిమాల్లో ఒకటి.

* ఈ కథ యూఎస్‌ నేపథ్యంలో సాగుతుందా?

ప్రధమార్థం యూఎస్, ద్వితీయార్థం విశాఖపట్నం నేపథ్యంలో సాగుతుంది.

* ‘మ మ మహేషా’ పాటను విశ్రాంతి తీసుకోకుండా పూర్తి చేశారట?

అలాంటిదేం లేదు. ముందుగా వేరే పాట పెట్టాలని భావించాం కానీ సందర్భానికి తగ్గట్టు ఉండదని దాన్ని తీసేశాం. తర్వాత, చిత్ర బృందమంతా చర్చించుకుని మాస్‌ సాంగ్‌ అయితే చాలా బావుంటుందనే నిర్ణయానికొచ్చాం. అలా తమన్‌ ‘మ మ మహేషా..’ ట్యూన్‌ వినిపించాడు. వినగానే జోష్‌ వచ్చేసింది. చిత్రీకరణ కోసం పది రోజుల్లో భారీ సెట్‌ రూపొందించాం. ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది.

* సినిమా ఓసారి వాయిదా పడింది. ఈ విరామంలో మార్పులు ఏమైనా చేశారా?

ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రారంభంలో ఏం అనుకున్నామో దాన్నే మీ ముందుకు తీసుకొస్తున్నాం.

* ఈ చిత్రంలో సందేశం ఏమైనా ఉంటుందా?

‘గత మూడు సినిమాల్లో మెసేజ్ బాగా రుద్దారు. అలాంటివేం లేకుండా మహేశ్‌ బాబుని చూడటం చాలా బావుంది’ అని ‘సర్కారు వారి’ ట్రైలర్‌కు ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. ఇందులో సందేశం ఉండదు.

* సంగీత దర్శకుడు తమన్ గురించి ?

తమన్ మ్యూజికల్ సెన్సేషన్. ‘కళావతి’ పాట నా కెరీర్ లోనే ది బెస్ట్‌గా నిలిచింది. ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని మేం అనుకోలేదు. తమన్ ఒక్కడే ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ప్రతి పెళ్లిలో ఇదే పాట వినిపిస్తుందని చెప్పాడు. తను అనుకున్నదే నిజమైంది. పాటలే కాదు నేపథ్య సంగీతం అదరగొట్టాడు.

* మీ తదుపరి సినిమా విషయంలో పాన్ ఇండియా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?

‘సర్కారు వారి’ విషయంలో నా దృష్టంతా తెలుగు వెర్షన్‌పైనే ఉంది. ముందు నుంచీ తెలుగులోనే తీద్దామని ఫిక్స్‌ అయ్యాం. తెలుగు సినిమానే బాలీవుడ్‌కీ చేరాలని కోరుకుంటున్నా. తదుపరి ప్రాజెక్టు విషయానికొస్తే.. నేనూ రాజమౌళి కలిస్తే పాన్‌ ఇండియా కాకుండా ఎలా ఉంటుంది.

* చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడం ఎలా అనిపిస్తోంది ?

సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. మా కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు తగ్గట్టు శ్రమిస్తాం. ఆయన రాసిన డైలాగ్ నేను చెప్తుంటే ఆ కిక్కే వేరు. మీలానే నేనూ ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా.

* మీ పిల్లలు నట వారసులుగా వస్తారా?

నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. సితార తనకు నచ్చింది చేస్తుంటుంది. గౌతమ్‌కు చదువు అంటే ఆసక్తి. వారి ఇష్టాలను నేను గౌరవిస్తా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని