Updated : 12 May 2022 10:21 IST

Sarkaru Vaari Paata Review: రివ్యూ: సర్కారువారి పాట

Sarkaru Vaari Paata review; చిత్రం: సర్కారువారి పాట; నటీనటులు: మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌, వెన్నెల కిషోర్‌, సముద్రఖని, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, నదియ, అజయ్‌, బ్రహ్మాజీ తదితరులు; సంగీతం: తమన్‌; సినిమాటోగ్రఫీ: ఆర్‌.మది; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌; నిర్మాత: నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట; రచన, దర్శకత్వం: పరశురామ్‌; విడుదల తేదీ: 12-05-2022

టు మాస్‌తో పాటు, ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు(Mahesh babu) ఎప్పుడూ ముందుంటారు. రెండున్నరేళ్ల కిందట ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంతో అలరించిన మహేశ్‌బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌ నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata). పోస్టర్లు, ప్రచార చిత్రాలు ‘పోకిరి’ నాటి మహేశ్‌ను గుర్తు తెస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేశ్‌ ఇందులో ఎలా నటించారు?కథా నేపథ్యం ఏంటి?(Sarkaru Vaari Paata review) ‘సూపర్‌స్టార్‌’ అభిమానుల అంచాలను పరశురామ్‌ అందుకున్నాడా?

క‌థేంటంటే: అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మ‌హేశ్‌ (మ‌హేశ్‌బాబు)(Mahesh babu). త‌న ద‌గ్గ‌ర అప్పు తీసుకున్న‌వాళ్లు ఎంత‌టివాళ్లైనా స‌రే వాళ్ల నుంచి వ‌డ్డీతో స‌హా వ‌సూలు చేయ‌నిదే వ‌దిలిపెట్ట‌డు. అమెరికాలోనే చ‌దువు కోసమ‌ని వెళ్లిన క‌ళావ‌తి (కీర్తిసురేష్‌)(Keerthy suresh) మ‌ద్యానికీ,  జూదానికి బానిసై మ‌హేశ్‌ ద‌గ్గ‌ర అబ‌ద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవ్వ‌రికీ సుల‌భంగా అప్పు ఇవ్వ‌ని మ‌హేశ్‌ తొలి చూపులోనే క‌ళావ‌తిపై మ‌న‌సుప‌డి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు.  కొన్ని రోజుల్లోనే కళావ‌తి అస‌లు రూపం మ‌హేశ్‌కి తెలిసిపోతుంది. దాంతో త‌న అప్పు త‌న‌కి తిరిగిచ్చేయ‌మ‌ని అడుగుతాడు. ఆమె తీర్చ‌న‌ని చెప్పేస‌రికి విశాఖ‌ప‌ట్నంలో ఉన్న క‌ళావ‌తి తండ్రి రాజేంద్ర‌నాథ్ (సముద్ర‌ఖ‌ని) ద‌గ్గ‌రికి బ‌య‌ల్దేర‌తాడు. ప‌ది వేల డాల‌ర్ల అప్పు వ‌సూలు చేయ‌డం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మ‌హేశ్‌, ఇక్క‌డికొచ్చాకా రాజేంద్ర‌నాథ్ త‌న‌కి ప‌ది వేల కోట్లు ఇవ్వాల్సి ఉంద‌ని చెబుతాడు. ఆ ప‌దివేల కోట్ల క‌థేమిటి? అంత డ‌బ్బుని వ‌సూలు చేసుకున్నాడా? (Sarkaru Vaari Paata review)ఇంత‌కీ మ‌హేశ్‌ గ‌తం ఏమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: స‌మ‌కాలీన స‌మ‌స్య‌ని స్పృశిస్తూ సాగే క‌థ ఇది. బ్యాంకు రుణాలు, చెల్లింపుల విష‌యంలో మ‌ధ్య త‌ర‌గతివాడికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి?ఆ వ్య‌వ‌స్థ‌పై పెద్దోళ్ల ప్ర‌భావం ఎలా ఉంటుంద‌నే అంశాన్ని ఈ క‌థ‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. (Sarkaru Vaari Paata review) కానీ, దాన్ని క‌థ‌తో ముడిపెట్టిన విధాన‌మే అంత‌గా అత‌క‌లేదు. మ‌హేశ్‌ గ‌తాన్ని ఆవిష్క‌రిస్తూ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత క‌థ అమెరికాకి మారుతుంది. అక్క‌డ అప్పులిచ్చే ఫైనాన్షియ‌ర్‌గా మ‌హేశ్‌, చ‌దువుకునే అమ్మాయిగా కళావతి పాత్ర‌లు ప‌రిచ‌యం అవుతాయి. వాళ్లిద్ద‌రికీ, వెన్నెల కిషోర్‌కీ మ‌ధ్య స‌న్నివేశాలతో సినిమా హాస్య‌భ‌రితంగా సాగుతుంది. పాట‌లు కూడా అల‌రిస్తాయి. పాట‌లు, ఫైట్లు, హాస్యంతో.. ప్ర‌థ‌మార్ధం స‌ర‌దా సర‌దాగా సాగిపోతుంది. కళావతిగా కీర్తిసురేష్ త‌న అందంతో క‌ట్టిప‌డేసి, మ‌హేశ్‌కి త‌గ్గ జోడీ అనిపించింది. అప్పు వసూలు చేయ‌డం కోసం మ‌హేశ్‌ ఇండియాకి బ‌య‌ల్దేర‌డం దగ్గరి నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ప‌ది వేల డాల‌ర్లు వ‌సూలు చేయ‌డం కోసం హీరో ఇండియాకి రావ‌డ‌మా అనే సందేహం రావొచ్చు కానీ, ఆ పాత్రని డిజైన్ చేసిన విధాన‌మే అలా ఉంటుంద‌ని స‌రిపెట్టుకోవాలి. సినిమాలో అలా చాలా స‌న్నివేశాలు లాజిక్ లేకుండానే సాగుతాయి.(Sarkaru Vaari Paata review) వాణిజ్య ప్ర‌ధాన‌మైన సినిమాలు లాజిక్ ఆలోచించ‌కుండా చూడాల్సిందే. కథ‌గా చూస్తే ప‌ల‌చ‌టి అంశ‌మే. మ‌హేశ్‌ శైలి మాస్ అంశాల్నే ఎక్కువ‌గా జోడించి మ‌ధ్య‌లో తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పారు ద‌ర్శ‌కుడు. 

రాజేంద్ర‌నాథ్ నేపథ్యాన్ని ఆవిష్క‌రించ‌గానే ఈ క‌థ ఎక్క‌డ ఎలా ముగుస్తుందో ఊహ‌కు అందుతుంది. క‌థ‌నం ప‌రంగా ఇందులో ఎలాంటి మేజిక్ క‌నిపించ‌దు. ద్వితీయార్ధం దాదాపుగా ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతుంది. మ‌హేశ్‌, కళావతిల మ‌ధ్య స‌న్నివేశాలు ప్ర‌థ‌మార్ధంలో వినోదం పంచినా, ద్వితీయార్ధంలో మాత్రం అవి ఏమాత్రం రుచించ‌వు. ఇ.ఎమ్‌.ఐల గురించి, బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ మ‌నుగడ సాధిస్తున్న వైనం గురించి ద్వితీయార్ధంలో చెప్పిన విష‌యాలు మాత్రమే ఆస‌క్తిగా అనిపిస్తాయి.(Sarkaru Vaari Paata review) అభిమానుల‌కి న‌చ్చే అంశాలు మాత్రం సినిమాలో పుష్క‌లం. క‌ళావ‌తి, మ మ  మ‌హేషా పాటలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.

ఎవ‌రెలా చేశారంటే: మ‌హేశ్‌బాబు(Mahesh babu) త‌న టైమింగ్‌తో అల‌రిస్తారు. ఆయ‌న పాత్ర‌, అందులో స్టైల్‌, కామెడీ, ఫైట్ల‌తో మెప్పిస్తారు. కీర్తిసురేష్(keerthy suresh)  ఆక‌తాయి అమ్మాయిగా  క‌నిపిస్తూ త‌న న‌ట‌న‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించింది. అందంగా క‌నిపిస్తూ పాట‌ల‌తోనూ అల‌రించింది. ద్వితీయార్ధంలోనే ఆమె పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు. స‌ముద్ర‌ఖ‌ని ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపిస్తారు. (Sarkaru Vaari Paata review) చాలా బ‌ల‌వంతుడిగా ప‌రిచ‌య‌మ‌య్యే ఆ పాత్ర చివ‌ర్లో తేలిపోయినట్లు అనిపించింది. వెన్నెల కిషోర్, సుబ్బ‌రాజు, న‌దియా, త‌నికెళ్ల భ‌ర‌ణి  త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతిక విభాగాల్లో మ‌ది కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. త‌మ‌న్ పాట‌లు, నేప‌థ్య సంగీతానికి ప‌ర్వాలేద‌నిపించే స్థాయి. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ త‌న ర‌చ‌న‌లో బ‌లం కంటే కూడా మ‌హేశ్‌లోని స్టార్ బ‌లాన్నే ఎక్కువ‌గా న‌మ్ముకుని సినిమా తీసిన‌ట్టు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బ‌లాలు

+ ప్ర‌థమార్ధంలో వినోదం

+ మ‌హేశ్‌.. కీర్తి అభిన‌యం, కెమిస్ట్రీ

+ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ నేప‌థ్యం

బ‌ల‌హీన‌త‌లు

- క‌థ‌నం

- లాజిక్‌కి అంద‌ని స‌న్నివేశాలు

చివ‌రిగా: అభిమానుల‌కి రివ‌ర్స్‌లేని ఆట... ‘స‌ర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని