SVP: మీరందించిన విజయం ముందు రెండేళ్ల కష్టం కనిపించట్లేదు: మహేశ్‌బాబు

మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ ఇటీవల విడుదలై, హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం కర్నూలులోని ‘ఎస్టీబీసీ’ కళాశాల మైదానంలో ‘మ మ మాస్‌’ పేరుతో విజయోత్సవ వేడుక నిర్వహించింది.

Published : 16 May 2022 21:34 IST

కర్నూలు: మహేశ్‌బాబు(Mahesh babu) హీరోగా పరశురామ్ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’(Sarkaru vaari paata) చిత్రం ఇటీవల విడుదలై, హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, కొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం కర్నూలులోని ‘ఎస్‌.టి.బి.సి’ కళాశాల మైదానంలో ‘మ మ మాస్‌’ పేరుతో విజయోత్సవ వేడుక నిర్వహించింది. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొని సందడి చేశారు.

వేడుకనుద్దేశించి మహేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక్కడు’ సినిమా చిత్రీకరణ సమయంలో కర్నూలు వచ్చా. మళ్లీ ఇప్పుడిలా రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్ర విజయోత్సవ వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నామని నిర్మాతలు చెప్పగానే హ్యాపీగా ఫీలయ్యా. ఈ వేడుకకు ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు. ఫంక్షన్‌ అంటూ జరిగితే రాయలసీమలోనే జరగాలి అన్నంతగా ఉంది ఇక్కడి వాతావరణం. మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా చూడగానే మా అబ్బాయి నాకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, హగ్‌ చేసుకున్నాడు. ‘అన్నింటికంటే నువ్వు ఈ సినిమాలోనే బాగా చేశావు నాన్న’ అని మా అమ్మాయి మెచ్చుకుంది. ‘పోకిరి, దూకుడు కంటే ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది’ అని నాన్న అన్నారు. ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడు పరశురామ్‌కే చెందుతుంది. కొవిడ్‌/లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మీరందించిన విజయం ముందు అవన్నీ ఇప్పుడు కనిపించట్లేదు. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నిషియన్లు, నిర్మాతలకు ధన్యవాదాలు. కీర్తిసురేశ్‌, సముద్రఖని వల్ల సినిమాకు కొత్తదనం వచ్చింది. తమన్‌ అందించిన ‘కళావతి’ పాట ఆంథెమ్‌లా మారింది’’ అని మహేశ్‌బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పరశురామ్‌, తమన్‌, అనంత శ్రీరామ్‌తోపాటు ఆంధ్రా, సీడెడ్‌, నైజాంకు చెందిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని