RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఒక్కొక్కరూ ఒక్కో ఆయుధం

ఆర్‌ఆర్‌ఆర్‌లో వారి పాత్రలేమిటంటే

Updated : 25 Mar 2022 12:55 IST

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయ్‌’’.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో హీరోల పాత్రల గురించి అజయ్‌దేవ్‌గణ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఇది. ఇప్పుడిదే డైలాగ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది. ఎందుకంటే వివిధ భాషలు, ప్రాంతాలు, దేశాలకు చెందిన నటీనటులందరూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే మహాసంగ్రామంలో ఒక్కో ఆయుధంగా మారారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకోవడంలో ఆయా నటులు కీలకపాత్రలు పోషించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటే కేవలం రామ్‌చరణ్‌-తారక్‌-రాజమౌళి మాత్రమే కాకుండా.. ఇంకా ఎంతోమంది నటీనటులు ఉన్నారు. ఇంతకీ ఎవరా తారలు?

అజయ్‌ దేవగణ్‌.. ఆయనే ఒక పోరాటం..!

బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ ఈ సినిమాతోనే తెలుగువారికి చేరువవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నారు. ‘‘నేనంటేనే ఓ పోరాటం’’ అంటూ తన చుట్టూ ఉన్న ప్రజల కోసం భార్యాబిడ్డల్ని వదిలి యుద్ధభూమిలోకి అడుగుపెట్టిన పోరాటయోధుడిగా అజయ్‌ దేవ్‌గణ్‌ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర కొంతసమయమే ఉన్నప్పటికీ.. ఆ రోల్‌ ప్రేక్షకుల్లో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తుందని ఇప్పటికే చిత్రబృందం ఎన్నోసార్లు ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో అజయ్‌ దేవ్‌గణ్‌ రోల్‌ ప్రేక్షకుల కంటనీరు తెప్పిచేలా ఉంది. ఇంతటి పవర్‌ఫుల్‌ స్టోరీలో భాగమైనందుకు ఆనందించిన అజయ్‌.. ఈ సినిమా కోసం వర్క్‌ చేసినందుకు పారితోషికం కూడా తీసుకోలేదని టాక్‌.

శ్రియ.. ఆయనలో ఆమె సగం..!

‘ఛత్రపతి’ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోనే శ్రియ నటించారు. ఇందులో ఆమె అజయ్‌దేవ్‌గణ్‌ సతీమణిగా సరోజిని పాత్రలో కనిపించనున్నారు. బరువైన గుండెతో కుటుంబాన్ని వదిలి.. భర్త అడుగుజాడల్లో పోరాట మైదానంలోకి అడుగుపెట్టిన స్త్రీగా ఆమె కనిపించనున్నారు. శ్రియ పాత్ర ఎంతో భావోద్వేగాలతో రూపుదిద్దుకుంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె పండించిన హావభావాలు ప్రేక్షకుల హృదయాల్ని ద్రవింపచేసేలా ఉంటాయని ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది.

రాజీవ్‌ కనకాల..!

రాజమౌళి-రాజీవ్‌ కనకాల మధ్య మంచి స్నేహబంధం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన.. ‘స్టూడెంట్‌ నం:1’, ‘సై’, ‘విక్రమార్కుడు’ చిత్రాల్లో రాజీవ్‌ కీ రోల్స్ చేశారు. చాలాకాలం బ్రేక్‌ తర్వాత రాజీవ్‌ ఈ సినిమాతో మరలా రాజమౌళి మూవీలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు.  బెబ్బులిగా పేరు తెచ్చుకున్న భీమ్‌ పాత్ర (ఎన్టీఆర్‌) గొప్పతనం గురించి బ్రిటీష్‌ వాళ్లకు రాజీవ్‌ వివరించే సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని తెలుస్తోంది.

సముద్రఖని..! 

పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోన్న ఈసినిమాలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగమైన సంగతి తెలిసిందే. అలా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన వారిలో కోలీవుడ్‌ నటుడు సముద్రఖని ఒకరు. ఇందులో ఆయన పోలీస్‌ కానిస్టేబుల్‌ రోల్‌లో రామ్‌చరణ్‌కు అత్యంత సన్నిహితుడిగా కనిపించనున్నారు. బ్రిటీష్‌ వారిపై యుద్ధం చేయడానికి రామ్‌చరణ్‌ సిద్ధమవుతుండగా.. ‘‘చాలా ప్రమాదం ప్రాణాలు పోతాయ్‌ రా’’ అంటూ ఆయన భావోద్వేగంతో చెప్పే సంభాషణలు మెప్పిస్తాయి.

వాళ్లే కాదు.. వీళ్లూ..!

* ఈ సినిమాలో తారక్‌కు లవ్‌ లేడీగా కనిపించనున్నారు విదేశీ భామ ఒలీవియా మోరీస్‌. కొన్ని సన్నివేశాల్లోనే స్క్రీన్‌పై తళుక్కున మెరిసి.. అందర్నీ అలరిస్తారు.

*ఈ చిత్రంలో నాయకులకు దీటుగా ప్రతినాయకురాలి పాత్ర ఉంటుంది. ఎంతో క్రూరత్వంతో కూడుకున్న ఈ పాత్రలో ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ నటించారు. లేడీ స్కాట్‌గా ఆమె తన విలనిజాన్ని తెలుగువారికి పరిచయం చేయనున్నారు.

*టాలీవుడ్‌ నటుడు రాహుల్ రామకృష్ణ సైతం ఈసినిమాలో కీలకపాత్ర పోషించారు. ఇందులో ఆయన తారక్‌ వెంట ఉండే వ్యక్తిగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని