Family man: భారతీయ జేమ్స్‌బాండ్‌

ఇది ఓటీటీల యుగం. వెబ్‌ సిరీస్‌ల హవా నడుస్తున్న కాలం. భారత్‌లో వాటికి ఊపు తెచ్చిన ఘనత మాత్రం కచ్చితంగా ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌దే. అమెజాన్‌ ప్రైమ్‌లో 2019, సెప్టెంబర్‌ 20న విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో సీజన్‌తో మరోసారి అలరించడానికి వస్తోందీ సూపర్‌ సిరీస్‌.

Published : 25 May 2021 17:46 IST

ఇది ఓటీటీల యుగం. వెబ్‌ సిరీస్‌ల హవా నడుస్తున్న కాలం. భారత్‌లో వాటికి ఊపు తెచ్చిన ఘనత మాత్రం కచ్చితంగా ‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌దే. అమెజాన్‌ ప్రైమ్‌లో 2019, సెప్టెంబర్‌ 20న విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో సీజన్‌తో మరోసారి అలరించడానికి వస్తోందీ సూపర్‌ సిరీస్‌. ఈ వెబ్‌ సిరీస్‌ రూపుదిద్దుకున్న తీరుతో పాటు మరిన్ని ఆసక్తికర అంశాలను ఓ సారి పరిశీలిద్దాం..

దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించిందెవరో  కాదు.. మన తెలుగింటి బిడ్డలైన రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే. ఇక్కడి నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన ఈ దర్శక ద్వయం ‘షోర్‌ ఇన్‌ ది సిటీ’, ‘గో గోవా గాన్‌’, ‘స్త్రీ’ లాంటి హిట్ సినిమాలు అందించారు. తెలుగులో ‘డీ ఫర్‌ దోపిడి’, ‘సినిమా బండి’ చిత్రాలను నిర్మించారు. అయితే వీరికి కొత్తరకం స్పై థ్రిల్లర్‌ తీయాలన్న కోరిక చాలా రోజులుగా ఉండేది. సిద్దార్థ్‌ మల్హోత్రతో, ‘జెంటిల్‌మ్యాన్‌’ సినిమాతో ఆ ప్రయత్నం చేశారు. కానీ, అది అనుకున్నంత విజయం సాధించలేదు. ఇలాంటి కథలను సినిమాలా కాకుండా వెబ్ సిరీస్‌గా మలిస్తేనే బాగుంటుందన్న ఆలోచన తట్టింది. అందులోంచే పురుడు పోసుకున్నదే ఈ వెబ్ సిరీస్‌.  కథను స్వేచ్ఛగా, నిక్కచ్చిగా చెప్పేందుకు దీని ద్వారా అయితేనే అవకాశం ఉంటుందని భావించారు. అలా 2018లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ చిత్రీకరణ మొదలుపెట్టారు. కేరళ, ముంబయి, కశ్మీర్‌, బెలూచిస్తాన్‌.. ఇలా అనేక ప్రదేశాల్లో షూటింగ్‌ జరుపుకొంది. తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదలై, భారతీయులను ఆకట్టుకున్న ఓ మంచి వెబ్‌ సిరీస్‌గా నిలిచింది.

దేశీ జేమ్స్‌బాండ్‌..

ఉగ్రవాదులు, విలన్లతో పోరాడే జేమ్స్‌బాండ్‌ లాంటి స్పై థ్రిల్లర్స్‌నే చూసిన భారతీయులకు ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’  దేశీ స్టైల్‌లో సరికొత్త స్పైని పరిచయం చేసింది. ఇందులో గూఢచారిగా పనిచేసే శ్రీకాంత్‌ కేవలం తుపాకులతో బుల్లెట్ల వర్షం మాత్రమే కురిపించడు. ఓ పక్కన ఉగ్రదాడుల నుంచి దేశాన్ని కాపాడుతూనే, కుటుంబాన్ని చూసుకొనే సగటు మధ్య తరగతి వ్యక్తిగా కనిపిస్తాడు. ముంబయిలో ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. చాలీచాలని జీతం, ఇంకా పూర్తికాని హోమ్‌లోన్‌, భార్యతో మనస్పర్ధలు, పిల్లల భవిష్యత్తు.. ఇలా మధ్య తరగతి కష్టాలతో సతమతమయ్యే సాధారణ ప్రభుత్వ ఉద్యోగి శ్రీకాంత్‌. ఇంట్లోవాళ్లకు సమయాన్ని కేటాయించలేడు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం, ఉద్యోగం.. ఈ రెండిటినీ సమన్యాయం చేస్తూ ఎలా నెట్టుకొచ్చాడనేది ఆసక్తికరంగా మలిచారు.

పత్రికల్లో వచ్చే కథనాలే ఆధారం...

ఈ వెబ్‌సిరీస్‌కు కథనాన్ని రాసేందుకు విస్తృతమైన అధ్యయనం చేశారు. వందల సంఖ్యలో అధికారులను, వారి కుటుంబాలను కలిసి సమాచారాన్ని సేకరించారు. సీబీఐ, డిటెక్టివ్స్‌, ఇంటెలిజెన్స్ అధికారులను కలిసి అనేక కేసులు అధ్యయనం చేశారు. అలాగే రోజూవారి జీవితంలో ఎదురయ్యే ఘటనలు, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సన్నివేశాలను కథకు అనుగుణంగా అల్లుకున్నారు.

మనోజ్‌ మాత్రమే మైండ్‌లో ఉన్నాడు!

ఎన్నో విభిన్నపాత్రలను పోషించిన మనోజ్‌ బాజ్‌పాయ్‌ తప్ప మరో వ్యక్తి శ్రీకాంత్‌ తివారీ పాత్రకు సరిపోరని ముందే అనుకున్నారు. కథను రాసేటప్పుడు కూడా మనోజ్‌ బాజ్‌పాయ్‌ నటన, హావాభావాలను వ్యక్తపరిచే తీరుని దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రాసుకున్నారని చెబుతారు. మొత్తం పది ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్‌లో ప్రియమణి తమిళనాడుకు చెందిన మహిళగా, ఇంటి బాధ్యతను తానొక్కతే నిర్వర్తించే భార్యగా నటించింది. మనోజ్‌ బాజ్‌పాయ్‌ కామెడీ టైమింగ్‌ ఇందులో నవ్వులు పూయిస్తుంది.

విభిన్న ప్రాంతాల ప్రతిభ..

ఈ వెబ్‌ సిరీస్‌కోసం దేశ నలుమూలల్లోని నటీనటులను తీసుకున్నారు. కశ్మీర్‌, కేరళ, తమిళనాడు.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నటుల్ని ఎంచుకున్నారు. ఇందులో ఉగ్రవాదిగా నటించిన మూస పాత్రధారి నీరజ్ మాధవ్‌ కేరళ నటుడు. మలయాళీ కాలేజీ యువకుడిగా నటించాడు. అలాగే తమిళనాడు నుంచి ప్రియమణి, కశ్మీర్‌ నుంచి ఓ నటుడిని తీసుకున్నారు. తెలుగు నటుడు సందీప్‌ కిషన్‌ ఓ చిన్న పాత్రలో మెరుస్తాడు. ఇలా భిన్న భాషలు, సంస్కృతిని ప్రతిబింబిస్తూ తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ఇదే కావడం విశేషం.

ఇందులో చాలా అంశాలను చర్చలోకి తీసుకొచ్చారు. యువత ఉగ్రవాదంలోకి మళ్లుతున్న తీరు, సమాజ అసమానతలు, జాతీయవాదం, బీఫ్‌, మత ఘర్షణలు, కశ్మీర్‌ కల్లోల పరిస్థితులు..ఇలా ఎన్నింటినో అంతర్లీనంగా చర్చించారు. అయినా ఎక్కడా వివాదాలు చెలరేగకుండా కథను రాసుకోవడంలో వారి ప్రతిభ తెలుస్తుంది. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ విషయంలో వస్తున్న వివాదాలపైన కూడా రాజ్‌, డీకే స్పందించారు. కేవలం కొన్ని సన్నివేశాలు చూసి, ఒక అంచనాకు రాకూడదని చెబుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్‌ సూపర్‌ హిట్‌ అవడంతో దీనికి రెండో సీజన్‌ కూడా తెరకెక్కించారు. జూన్‌ 4న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతోంది. ఇందులో టాలీవుడ్‌ నటి సమంత డీగ్లామర్‌ పాత్రలో నటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని