malavika nair: అప్పటి నుంచీ అన్నీ మంచి శకునములే

మాళవిక నాయర్‌... ఏ పాత్ర అప్పజెప్పినా అందులో ఇట్టే ఒదిగిపోయే కథానాయిక. తనదైన నటనతో పాత్రలకి సహజత్వం తీసుకొస్తుంటారు.

Published : 01 May 2023 20:28 IST

మాళవిక నాయర్‌... ఏ పాత్ర అప్పజెప్పినా అందులో ఇట్టే ఒదిగిపోయే కథానాయిక. తనదైన నటనతో పాత్రలకి సహజత్వం తీసుకొస్తుంటారు. అందుకే ఆమె పాత్రలు అలా గుర్తుండిపోతుంటాయి. ఇటీవల ఆమె ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలో నటించారు. సంతోశ్‌ శోభన్‌ కథానాయకుడిగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. స్వప్న సినిమా పతాకంపై ప్రియాంక దత్‌ నిర్మించారు. చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మాళవిక నాయర్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో
ముచ్చటించారు.

మీ వ్యక్తిగత కెరీర్‌ పరంగా ‘అన్నీ మంచి శకునములే’ అని మీకు అనిపించిన ఓ సందర్భం?

తొలి తెలుగు సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం?’ చేస్తున్నప్పుడే అనిపించింది. ఆ సినిమా విలువేమిటో నాకు తర్వాత ఇంకా బాగా తెలిసింది. ఆ సినిమా నుంచే నాకు నాగ్‌ అశ్విన్‌, స్వప్న, ప్రియాంక పరిచయం అయ్యారు. వాళ్లు నాకు మార్గదర్శకులుగా నిలిచారు.

ఈ సినిమా పేరు విన్నప్పుడు మీకు ఏం అనిపించింది?

మలయాళంకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ పేరు. అక్కడ శగుణం అని పలుకుతారు. దర్శకురాలు నందినిరెడ్డి  ఈ పేరు చెప్పినప్పుడే నాకు అర్థం అయ్యింది. తన పేర్లు అన్నీ ఇలా ఆశావాహ ద్పక్పథంతో ఉంటాయి. ఈ కథని నాకు తను రెండేళ్ల కిందటే చెప్పారు. ఆ తర్వాత కొన్ని కొన్ని మార్పులతో అద్భుతమైన కథగా మారింది.

ఈ సినిమా చేయడానికి ప్రేరేపించిన ప్రధాన అంశాలేమిటి?

నందినితో మళ్లీ పనిచేయడం ఒకటైతే, వైజయంతి సంస్థలో కలిసి ప్రయాణం చేసే అవకాశం మరో కారణం. వీటితో పాటు కొత్తదనంతో కూడిన ఈ కథ. ఏ సినిమా అయినా ఓ నటిగా వైవిధ్యం ఉండాలని కోరుకుంటా. ప్రతి సినిమా ఒకేలా ఉంటే బోర్‌ కొడుతుంది. అందరూ చేస్తున్నారు కదా, ఇక నేను చేసేది ఏముంటుందనే భావన కలుగుతుంది.

ఈ సినిమా ప్రయాణం ఎలా సాగింది?

కెరీర్‌లో భాగంగా కుటుంబానికి దూరంగా నాదైన ప్రపంచంలో గడుపుతున్నా. ఈ సినిమా చిత్రీకరణలో మాత్రం కుటుంబంతో కలిసి గడపుతున్న అనుభూతే కలిగింది. కునూర్‌ హిల్‌స్టేషన్‌కి వెళ్లి దాదాపు నెల రోజులు అక్కడే గడిపాం. రాజేంద్రప్రసాద్‌, గౌతమి, నరేశ్‌, వాసుకి తదితర సీనియర్‌ నటులతో కలిసి సమయం గడపడం ఓ గొప్ప అనుభూతిని పంచింది. గౌతమి మేడమ్‌ మా అందరికీ స్వయంగా అన్నం వడ్డించారు. సినిమా గురించే కాకుండా, చాలా అంశాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ ప్రయాణం చాలా తృప్తినిచ్చింది.

నటిగా ప్రతి సినిమాతోనూ ప్రభావం చూపిస్తుంటారు. మరి సినిమా ఫలితాలు మీపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంటాయి?

కొన్ని విషయాలు మన చేతుల్లో వుండవు. కథలు ఎంపిక చేసుకోవడం, పాత్రలకి తగ్గట్టుగా నటించడంలాంటి విషయాలు నా నియంత్రణలోనే ఉంటాయి. కానీ ఫలితాలు అన్నిసార్లూ  మనకు అనుకూలంగా రాకపోవచ్చు. దాన్ని వ్యక్తిగతంగా మాత్రం తీసుకోను. చుట్టూ వాతావరణంలో అయితే మార్పు కనిపిస్తూ ఉంటుంది. విజయాలు వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడతారు, పరాజయాలు ఎదురైనప్పుడు మరోలా మాట్లాడతారు. ఎదుటివాళ్లు ఎలా ఉన్నా మనమేంటనేది మన అంతరాత్మకి తెలుసు కదా.

మీ పాత్ర ఎలా ఉంటుంది?

ఇప్పటివరకూ నేను సున్నితత్వంతో కూడిన పాత్రలే చేశా. ఇది మాత్రం వాటికి భిన్నంగా ఉంటుంది. అన్నీ తన చేతుల్లోనే ఉండాలనుకునే నవతరం అమ్మాయిగా కనిపిస్తా. తన ధైర్యాన్ని, కోపాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తుంటుంది.

నటిగా మీ లక్ష్యాలేమిటి?

ఒక యాక్షన్‌ సినిమా చేయాలని ఉంది. అలాంటి పాత్ర నాకు ఇష్టం. ప్రస్తుతం ‘డెవిల్‌’ సినిమాలో ఓ ఆసక్తికరమైన పాత్ర చేస్తున్నా. అందులో యాక్షన్‌ ప్రధానమైన పాత్రే.


నిజ జీవితంలో అలాంటి పోలికలు ఎవరిలోనైనా కనిపించాయా?

‘ఎవడే సుబ్రమణ్యం?’ సినిమాలో నేను పోషించిన ఆనంది పాత్ర ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రియాంక దత్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులోని పాత్రలో మాత్రం మరో నిర్మాత స్వప్నదత్‌ కనిపించారు (నవ్వుతూ). స్వప్న ప్రతీ విషయంలోనూ వ్యవస్థీకృతంగా, లీడర్‌గా కనిపిస్తుంటారు. ఈ పాత్రని పోషించేటప్పుడు నందినిరెడ్డి చాలా సలహాలు ఇచ్చారు. దర్శకురాలిగా తన విజన్‌ని అర్థం చేసుకుని నటించా. నా పాత్ర ఇందులో హాస్యం కూడా పంచుతుంది. సంతోష్‌శోభన్‌, నేను స్నేహితుల్లా కలిసిమెలసి పనిచేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని