2018 Movie: 10 రోజుల్లో రూ.100 కోట్లు.. ఇప్పుడు తెలుగులోనూ వస్తోంది!

2018 Movie: మలయాళ చిత్రం 2018ని తెలుగుతో పాటు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Published : 17 May 2023 17:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల కాలంలో ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను కాస్త ఆలస్యమైనా అనువదించి ఇతర భాషల్లో విడుదల చేస్తున్న ట్రెండ్‌ ఊపందుకుంది. ఆ కోవలోనే వచ్చిన ‘కాంతార’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకోగా, తాజాగా ‘ది కేరళ స్టోరీ’ తెలుగులో అనువాదమై మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పుడు ‘2018’ సినిమా వంతు వచ్చింది. మే 5న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రాణించడమే కాదు, అతి తక్కువ సమయంలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. ఇప్పుడు ‘2018’ మూవీని తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. గురువారం ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేయనుంది.

జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్‌, అసిఫ్‌ ఆలీ, లాల్‌ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. నాటి ఘోర విపత్తు ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తమని తాము రక్షించుకుంటూనే ఎదుటివారికి ఎలా సాయం చేశారు? అనే కథాంశాన్ని తీసుకుని భావోద్వేగ భరితంగా ఆంథోని ఈ మూవీని తెరకెక్కించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. కేవలం రూ.15 కోట్లతో తెరకెక్కించిన ‘2018’ కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకూ మలయాళంలో ‘లూసిఫర్’, ‘కురుప్’ తదితర చిత్రాలు మాత్రమే రూ.100 కోట్లు వసూలు చేశాయి. ఇప్పుడు ఇతర భాషల్లో ఈ సినిమా విడుదలైన విజయం సాధిస్తే, రూ.200 కోట్ల మైలురాయిని సులభంగా దాటేస్తుందని సినీ ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని