2018 Movie: 2024 ఆస్కార్‌కు మనదేశం నుంచి 2018

ఈ ఏడాది ‘నాటు నాటు’ పాట చేసిన ఆస్కార్‌ హంగామా మరవకముందే వచ్చే ఏడాది సందడి మొదలైంది. 2024కు మనదేశం నుంచి అధికారిక ఎంట్రీని మలయాళ చిత్రం ‘2018’ దక్కించుకుంది.

Updated : 28 Sep 2023 14:08 IST

ఏడాది ‘నాటు నాటు’ పాట చేసిన ఆస్కార్‌ హంగామా మరవకముందే వచ్చే ఏడాది సందడి మొదలైంది. 2024కు మనదేశం నుంచి అధికారిక ఎంట్రీని మలయాళ చిత్రం ‘2018’ దక్కించుకుంది. ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది. ‘ది కేరళ స్టోరీ’, ‘గదర్‌ 2’, ‘బలగం’, ‘దసరా’ ‘విరూపాక్ష’, ‘సార్‌’ తదితర 22 చిత్రాలు పోటీపడగా జ్యూరీ ‘2018’ని ఎంపిక చేసింది.  ఈ విషయాన్ని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు, సెలెక్షన్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ గిరీశ్‌ కాసరవల్లి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...‘2024లో జరిగే ఆస్కార్‌ వేడుకల్లో 16మంది జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా భారతదేశం నుంచి ‘2018’ను ఎంపిక చేశారు. వారం రోజుల పాటు జ్యూరీ సభ్యులందరం కలిసి 22 సినిమాలను చూశాము. చాలా మంచి సినిమాలు ఉన్నందున అన్ని అంశాలలో ప్రతి చిత్రాన్ని విశ్లేషించి ఒక సినిమాను మాత్రమే ఎంపిక చేశాం. అలా చేయడం చాలా కష్టమైన నిర్ణయం’ అని అన్నారు.

వరదల కథ... కన్నీటి వ్యథ

‘2018’..ఎవ్రీ వన్‌ ఈజ్‌ ఏ హీరో...కేరళలో 2018లో సంభవించిన వరదల సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన మలయాళ చిత్రం. ప్రాణాలను పణంగా పెట్టి గొప్ప వ్యక్తులుగా మారిన సాధారణ వ్యక్తుల జీవితమే ఈ సినిమా. జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది మేలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో నిర్మాత బన్నీ వాస్‌ విడుదల చేశారు.  వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాధికారులతో పాటు ప్రజలు కూడా ఎలా స్పందించారో, తోటి ప్రజలను ఎలా కాపాడుకున్నారో అన్న కథనం ఈ చిత్రంలో కీలకం. టోవినో థామస్‌, అపర్ణ బాలమురళి, కుంచాకో బోబాన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మలయాళంతో పాటు ఇతర భాషల సినీ ప్రేక్షకులతోనూ కన్నీళ్లు పెట్టించింది. ఇలా ఎన్నో హావభావాల్ని పలికించిన ఈ సినిమా ఆస్కార్‌-2024 బరిలో దిగింది.

ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్‌ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న అనూప్‌, మత్య్సకారుల కుటుంబం నుంచి వచ్చి ఓ పెద్ద మోడల్‌ కావాలని కలలు కన్న మరో వ్యక్తి, పర్యాటకులకి తలలో నాలుకలా ఉంటూ కుటుంబాన్ని పోషిసున్న ఓ టాక్సీ డ్రైవర్‌, కన్న కూతురుకి ప్రేమను పంచని లారీ డ్రైవర్‌, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి, ప్రేమించిన భార్యకు దూరంగా ఉంటూ బాధపడే ఓ భర్త, వికలాంగుడైన కన్న కొడుకును కాపాడుకునేందు తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు...ఇలా ఎంతో మంది జీవితాలను విచ్ఛిన్నం చేసినా, ఒకరికొకరు తోడుగా నిలిచి...చివరికి ప్రాణాలు కోల్పోయిన అనూప్‌ చేసిన సాహసాలను ఎంతో గొప్పగా తెరపై కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. ప్రతి ఒక్కరి పాత్ర ప్రేక్షకుడి మనసుకి దగ్గరయ్యేలా చిత్రీకరించారు. ఆ భావోద్వేగాల సంద్రంలో ప్రతీ సినీ అభిమాని మునిగిపోయేలా మలిచాడు చిత్ర దర్శకుడు.


డబుల్‌ ధమాకా...

తాజాగా ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన సెప్టిమియస్‌ అవార్డుల వేడుకల్లో ‘2018’ చిత్రంలోని తన నటనకిగానూ బెస్ట్‌ ఏషియన్‌ యాక్టర్‌ ట్రోఫిని అందుకున్నారు కథానాయకుడు టోవినో థామస్‌. మా చిత్రబృందానికి ఇది డబుల్‌ సెలబ్రెషన్స్‌ చేసుకునే సమయం ఇది అంటూ...‘మా సినిమా ఆస్కార్‌ అవార్డుకు అధికారికంగా ఎంపికైందన్న వార్తను చూసి చాలా ఆనందపడ్డాను. ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాము. దానికి ఫలితం దక్కింది. ఈ సినిమాకు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. నాకు ఈ ట్రోఫి రావడం, ఇదే సమయంలో మా సినిమా ఆస్కార్‌కు ఎంపికవడం నా ఆనందాన్ని రెట్టింపు చేశాయి’ అంటూ స్పందించారు  టోవినో. 96వ అకాడమీ అవార్డ్స్‌ వచ్చే ఏడాది మార్చి 10న లాస్‌ ఏంజెలిస్‌లో జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని