Malvika Nair: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’.. పదేళ్ల ప్రయాణాన్ని చూపిస్తుంది: మాళవిక

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా ఈ నెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆ సినిమా హీరోయిన్‌ మాళవికా నాయర్‌(Malvika Nair) మీడియాతో ముచ్చటించారు.

Published : 14 Mar 2023 11:25 IST

నాగశౌర్య (Naga Shaurya), మాళవికా నాయర్‌ (Malvika Nair) జంటగా నటించిన సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’(Phalana Abbayi Phalana Ammayi). శ్రీనివాస్‌ అవసరాల (Srinivas Avasarala) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలో సందడి చేయనుంది.  నాగశౌర్య, శ్రీనివాస్‌ అవసరాల కాంబోలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. వాళ్ల అంచనాలకు తగినట్లే సినిమా ఉండనుందని హీరోయిన్‌ మాళవికా నాయర్‌(Malvika Nair interview) అన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కథ ఎలా ఉండనుంది?

మాళవిక: సాధారణ ప్రేమ కథా చిత్రాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉండనుంది. ఇందులో 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే ప్రయాణాన్ని చూపించారు. అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి.  ఇక నేను పోషించిన అనుపమ పాత్ర నాకెంతో నచ్చింది. నటిగా నన్ను నేను నిరూపించుకునే పాత్ర ఇది. నాగ శౌర్య పోషించిన సంజయ్‌ పాత్ర నా వ్యక్తిగత జీవితానికి కాస్త దగ్గరగా ఉంటుంది.

ఈ సినిమా ప్రయోగాత్మక చిత్రం అనుకోవచ్చా?

మాళవిక: ప్రయోగాత్మక సినిమానే. మంచి భావోద్వేగాలు ఉన్నాయి. చూస్తున్నంతసేపు ఓ మంచి అనుభూతి కలుగుతుంది. ఏం చేసినా ప్రేక్షకుల వినోదం కోసమే కదా.. ఈ సినిమాలో సహజమైన సన్నివేశాలు, సంభాషణలు ఉంటాయి. అవి స్వచ్ఛమైన వినోదాన్ని పంచుతాయి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకుడు బాబీ నా కళ్లు బాగున్నాయని చెప్పడం చాలా ఆనందాన్నిచ్చింది. గతంలో కూడా  కొందరు దర్శకులు ఈ మాట చెప్పారు.  మా అమ్మ కళ్లు కూడా ఇలానే ఉంటాయి. అవే నాకు వచ్చాయి.

ఈ సినిమా పరంగా నటిగా మీరు సంతృప్తిగా ఉన్నారా?

మాళవిక: చాలా సంతృప్తిగా ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల మధ్య పదేళ్ల ప్రయాణం చూపిస్తారు. ఆ పదేళ్ల కాలంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆలోచన విధానం మారుతుంది. భావోద్వేగాలు మారతాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇవి.

నాగశౌర్య, శ్రీనివాస్‌ అవసరాల గురించి చెప్పండి?

మాళవిక: నాగశౌర్య తన చుట్టూ ఉండేవాళ్లు ఆనందంగా ఉండాలి అనుకుంటాడు. ఎవరైనా బాధలో ఉంటే వాళ్లని నవ్విస్తారు. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం.  ఇక శ్రీనివాస్‌ అవసరాల చాలా సరదాగా ఉంటారు. ఏలాంటి విషయాన్నైనా చాలా సున్నితంగా చెబుతారు. నటీనటుల నుంచి ఎమోషన్స్‌ రాబట్టుకోవడం మీద దృష్టి పెడతారు. ఎంతో టాలెంటెడ్‌.  ఇలాంటి ప్రతిభ గల దర్శకుడితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అమెరికా వెళ్లి టెక్నికల్‌ స్కిల్స్‌ నేర్చుకొని ఇక్కడకు వచ్చి సినిమాలు తీస్తున్నారు.  ఇది చాలా అభినందించ తగిన విషయం. ఆయనకు తెలుగుపై పట్టు ఉంది. ఆయన వల్లే నేను తెలుగు నేర్చుకోగలిగా. ఇక చిత్ర నిర్మాత వివేక్‌గారితో ఇది నా రెండో సినిమా. కోవిడ్‌ సమయంలో ఆయన మాపై చాలా శ్రద్ధ చూపారు. 

ఈ సినిమాలో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా?

మాళవిక: లేదు.  నాకు ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే అలాంటి సన్నివేశాలు కావాలని పెట్టినవి కాదు. కథలో భాగం. 

మీరు తక్కువ సినిమాలు చెయ్యడానికి కారణం ఏంటి?

మాళవిక: వచ్చిన ప్రతి సినిమా చేయడం లేదు. నా మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తున్నాను.  నటిగా నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. కథ నచ్చితే అన్ని జోనర్ల సినిమాలు చేస్తాను. 

కల్యాణ్‌ మాలిక్‌ సంగీతం మీకెలా అనిపించింది?

మాళవిక: ఆయన ఈ సినిమాకు అద్భుతమైన స్వరాలు అందించారు. నాకు అన్నిపాటలు నచ్చాయి. ‘మేఘమా...’ పాట బాగా నచ్చింది. తాజాగా కల్యాణ్‌ మాలిక్‌ సోదరుడు కీరవాణి గారికి ఆస్కార్‌ రావడం చాలా గర్వించదగ్గ విషయం.  మన భారతీయ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది.

కొత్త సినిమాలు ఏం చేస్తున్నారు?

మాళవిక: ప్రస్తుతం ‘అన్నీ మంచి శకునములే’, ‘డెవిల్‌’ చిత్రాల్లో నటిస్తున్నాను. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు