Christopher Review: రివ్యూ: క్రిస్టఫర్‌

Christopher Review: మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘క్రిస్టఫర్‌’ఎలా ఉందంటే?

Updated : 09 Mar 2023 18:39 IST

Christopher Review: చిత్రం: క్రిస్టఫర్‌; నటీనటులు: మమ్ముట్టి, వినయ్‌ రాయ్‌, స్నేహ, అమలా పాల్‌, ఐశ్వర్యలక్ష్మి, శరత్‌కుమార్‌ తదితరులు; సంగీతం: జస్టిన్‌ వర్గీస్‌; సినిమాటోగ్రఫీ: ఫైయిజ్‌ సిద్ధిక్‌; ఎడిటింగ్‌: మనోజ్‌; రచన: ఉదయ్‌ కృష్ణ; నిర్మాత, దర్శకత్వం: బి.ఉన్నికృష్ణన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ఒక భాషలో విడుదలైన చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్‌ చేసి, ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి కీలక పాత్రలో మలయాళంలో విడుదలై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘క్రిస్టఫర్‌’. బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. (Christopher Review) మరి ఈ సినిమా కథేంటి? ఓటీటీలో చూడవచ్చా?

కథేంటంటే: ఫుడ్‌ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లిని కూడా తీవ్రంగా గాయపరుస్తారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అయిన ఐపీఎస్‌ అధికారి క్రిస్టఫర్‌ (మమ్ముట్టి)కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్‌కౌంటర్‌ చేసేస్తుంటాడు క్రిస్టఫర్‌. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకుని వారిని కూడా ఎన్‌కౌంటర్‌ చేసేస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టఫర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తుంది. (Christopher Review)  దీంతో ప్రభుత్వం క్రిస్టఫర్‌పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోం సెక్రటరీ బీనా మరియం (స్నేహ), ఐపీఎస్‌ అధికారి సులేఖ (అమలాపాల్‌) ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టఫర్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు క్రిస్టఫర్‌ ఎవరు? అతని గతమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: నిజాయతీపరుడైన ఓ పోలీసు అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రేక్షకులు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దడంలో దర్శకుడు బి.ఉన్నికృష్ణన్‌ కొంత వరకే సఫలమయ్యారు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘న్యాయం జరగడం ఆలస్యమైతే, అది తిరస్కరణకు గురైనట్లే’. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్‌కౌంటర్‌ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాల్లో క్రిస్టఫర్‌ క్యారెక్టర్‌ ఏంటో చెప్పేశాడు దర్శకుడు. అయితే, అతడిపై విచారణ పేరుతో గతమేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఐపీఎస్‌ అధికారి సులేఖ. క్రిస్టఫర్‌ గతమేంటి? అతడు పోలీస్‌ ఎందుకు అయ్యాడు? ఆ తర్వాత అతడు పరిష్కరించిన కేసులు ఏంటి? చేసిన ఎన్‌కౌంటర్‌లు ఏంటి? ఇలా.. అతడి జీవితాన్ని చూపించే క్రమంలో సాదాసీదా సన్నివేశాలతో ప్రథమార్ధాన్ని చుట్టేశాడు దర్శకుడు. క్లిష్టమైన కేసులను ఒక పోలీస్‌ అధికారి తన తెలివి తేటలతో పరిష్కరిస్తే, చూసే ప్రేక్షకుడికి ఆసక్తి కలుగుతుంది. కానీ, ఇక్కడ కిస్టఫర్‌ పాత్ర పరిష్కరించాల్సింది పోయి ఎన్‌కౌంటర్‌ చేసుకుంటూ వెళ్తుంది. ఇక ఫస్టాఫ్‌లో జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు (వినయ్‌ రాయ్‌) పాత్ర ద్వితీయార్ధంలో కానీ, మళ్లీ కనపడదు. పోనీ క్రిస్టఫర్‌-త్రిమూర్తులు ఎదురు పడినప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుందా? అంటే అదీ గొప్పగా ఏమీ ఉండదు. ఇద్దరూ ఫేస్‌ టు ఫేస్‌ తలపడిన సన్నివేశాలను కూడా చాలా కూల్‌గా తీశాడు దర్శకుడు. అమైనా (ఐశ్వర్యలక్ష్మి) హత్య తర్వాత కథనంలో వేగం పెరుగుతుంది. ఆ కేసు పరిష్కారం కోసం రంగంలోకి దిగిన తర్వాత సినిమాపై కాస్త ఆసక్తి మొదలవుతుంది. (Christopher Review)  పతాక సన్నివేశాల వరకూ ఆ టెంపోను కొనసాగించాడు దర్శకుడు. అయితే, సన్నివేశాలన్నీ ఊహకు తగినట్లే సాగుతాయి. ఎక్కడా పెద్దగా సస్పెన్స్‌ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్‌ తీసిన ‘ఆరాట్టు’, తమిళ సినిమా ‘తేరి’ ఛాయలు చాలానే కనపడతాయి. ఆ  ఫోబియో నుంచి బహుశా ఆయన బయటకు రాలేదు. రెండున్నర గంటల పాటు సినిమా సుదీర్ఘంగా సాగుతుంది. నిజంగా ఈ కథకు అంత నిడివి అవసరం లేదు. ఈ సినిమాలో గొప్ప ఉపశమనం ఏంటంటే, పాటలు, ఇతర ప్రయోగాలకు జోలికిపోకుండా సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఒకే టెంపోలో సాగుతుంది. ఈ వీకెండ్‌లో టైమ్‌పాస్‌ కోసం ఏదైనా సినిమా చూడాలంటే నిడివి భరించగలిగితే ‘క్రిస్టఫర్‌’ ఒకసారి చూడొచ్చు.

ఎవరెలా చేశారంటే: గత కొంతకాలంగా వైవిధ్య చిత్రాలను చేస్తూ ముందుకు సాగుతున్న మమ్ముట్టి ఈ సారి పోలీస్‌ డ్రామాను ఎంచుకున్నారు. కథ, కథనాలు గొప్పగా లేకపోయినా, తన క్యారెక్టరైజేషన్‌, నటనతో రక్తికట్టించారు. ఎక్కడా ఓవరాక్షన్‌ లేకుండా సెటిల్డ్‌గా నటించారు. మరో పోలీస్‌ అధికారిగా అమలాపాల్‌కు స్క్రీన్‌ స్పేస్‌ బాగానే దక్కింది. అలాగే స్నేహకు కూడా. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. ప్రతినాయకుడిగా నటించిన వినయ్‌రాయ్‌ పాత్ర బలంగా లేదు. శరత్‌కుమార్‌ అతిథి పాత్రలో కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఓకే. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బాగుంది. చాలా సన్నివేశాలకు కత్తెర వేసే అవకాశం ఉన్నా వేయలేదు. (Christopher Review)  రెండున్నర గంటలు నిడివి చాలా ఎక్కువ. దర్శకుడు ఉన్నికృష్ణన్‌ గత చిత్రం ‘ఆరాట్టు’నుంచి ఇంకా బయటకు రాలేదు. దాని ఛాయలు కనిపిస్తాయి. కథానాయకుడు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అయితే, ప్రథమార్ధమంతా ఆయన చేసిన ఎన్‌కౌంటర్‌లను చూపించాలా? అన్నం ఉడికిందని తెలియడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలు కదా!

బలాలు: + మమ్ముట్టి నటన; + ద్వితీయార్ధం

బలహీనతలు: - రొటీన్‌ పోలీస్‌ డ్రామా; - కొత్తదనం లేని కథ, కథనాలు; - నిడివి

చివరిగా: క్రిస్టఫర్‌.. ‘మహిళలను వేధించిన వారిని ఇక్కడ ఎన్‌కౌంటర్‌లు చేయబడును’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు