Mamta Mohandas: డేటింగ్‌ వార్తలపై స్పందించిన మమతా మోహన్‌ దాస్‌.. ఏమన్నారంటే

డేటింగ్‌ రూమర్స్‌పై నటి మమతా మోహన్‌దాస్‌ స్పందించారు. ఒకప్పుడు రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.

Published : 13 Jun 2024 13:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘యమదొంగ’లో ప్రత్యేక పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌. ఆ సినిమా తర్వాత ఈ మలయాళీ కుట్టి వరుస అవకాశాలు అందుకొని దక్షిణాది భాషలన్నిటిలో నటించారు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో కలిసి ‘మహారాజా’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డేటింగ్‌పై ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు. 

‘‘లాస్‌ ఏంజెలెస్‌లో (Los Angeles) ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించాను. కానీ, మా బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. జీవితంలో రిలేషన్‌ ఉండాలి.. కానీ ఒత్తిడితో కూడిన బంధాన్ని నేను కోరుకోవడం లేదు. జీవితానికి కచ్చితంగా ఒకతోడు అవసరం అని భావించడం లేదు. ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. మంచి జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నా.. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి’’ అన్నారు. తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ..‘మలయాళీ చిత్రపరిశ్రమలోనూ నాకు మంచి గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను పోషించిన ఎన్నో పాత్రలకు అగ్ర నటీనటుల నుంచి ప్రశంసలు వచ్చాయి. తెలుగు, తమిళ బాషల్లోనూ స్టార్స్‌తో సినిమాలు చేసే అవకాశం వచ్చింది. బాలీవుడ్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠి, గౌరీ ఖాన్‌ ప్రశంసలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని మమతా మోహన్‌ దాస్ (Mamta Mohandas) చెప్పారు. గతేడాది ఐదు చిత్రాలతో సందడి చేసిన మమతా ప్రస్తుతం ‘మహారాజా’ ప్రచారంలో బిజీగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని