Manasanamaha: గిన్నిస్‌ వరల్డ్‌రికార్డు సాధించిన ‘మనసానమః’

తెలుగు సినిమా గర్వించేలా మరో అరుదైన రికార్డు నమోదైంది. యువ దర్శకుడు దీపక్‌రెడ్డి తెరకెక్కించిన లఘు చిత్రం ‘మనసానమః’

Published : 27 Jun 2022 01:11 IST

హైదరాబాద్‌: తెలుగు సినిమా గర్వించేలా మరో అరుదైన రికార్డు నమోదైంది. యువ దర్శకుడు దీపక్‌రెడ్డి(deepak reddy) తెరకెక్కించిన లఘు చిత్రం ‘మనసానమః’(Manasanamaha) గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది.  అత్యధిక అవార్డులు అందుకున్న లఘు చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకూ ఏ లఘు చిత్రం సాధించని విధంగా ఏకంగా 513 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రశంసాపత్రాన్ని అందించింది. రివర్స్ స్క్రీన్‌ప్లే లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసిన సినీ ప్రియులు... దర్శకుడి ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. అంతేకాదు, గతేడాది ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌ బరిలోనూ ఈ చిత్రం నిలిచింది. శిల్ప గజ్జల నిర్మించిన చిత్రంలో విరాజ్‌, దృశిక కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ సినిమాటోగ్రఫీ, కమ్రాన్‌ సంగీతం ఈ లఘు చిత్రానికి మరింత వన్నె తెచ్చాయి.

‘మనసానమః’ అలా మొదలైంది..

దర్శకుడు దీపక్‌రెడ్డికి సినీ నేపథ్యం లేకపోయినా చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. అయితే, ఇంట్లో వాళ్లను నొప్పించటం ఇష్టం లేక మాస్టర్స్‌ చేసేందుకు అమెరికా వెళ్లిపోయాడు. అయినా సినిమాపై ఆసక్తి తగ్గలేదు. ఎక్కువగా ఆర్జీవీ చిత్రాల చూసి స్ఫూర్తి పొందిన దీపక్‌ శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ అమెరికా షెడ్యూల్‌లో సుమారు 40 రోజులు పనిచేశాడు. ఆ సమయంలోనే సినిమా తీయడంపై అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ‘ఎక్స్‌క్యూజ్‌మీ’, ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ వంటి షార్ట్‌ఫిల్మ్స్‌ చేశాడు. అయితే, ఏదైనా లవ్‌స్టోరీని తీయాలని భావించిన సమయంలో అనుకున్నదే ‘మనసానమః’.

2009లో వచ్చిన ‘మన్మథబాణం’లో ఓ పాట పూర్తిగా రివర్స్‌లో తీశారు. అదే తరహాలో కథా, భావోద్వేగాలు దెబ్బ తినకుండా ‘మనసానమః’ తీయాలని దీపక్‌ భావించాడు. అలా 2019లో షూటింగ్‌ పూర్తి చేసి, 2020 జనవరిలో యూట్యూబ్‌లో విడుదల చేశారు. చిత్రీకరణకు పట్టిన సమయం కేవలం ఐదు రోజులు మాత్రమే. ప్రీప్రొడక్షన్స్‌, పోస్ట్ ప్రొడక్షన్‌ కోసం ఏడాది పాటు శ్రమించాడు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ చూసిన తెలుగు సినీ దర్శకులు సుకుమార్‌, క్రిష్‌లు దీపక్‌ టాలెంట్‌ను మెచ్చుకున్నారు. మరో దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ ఏకంగా ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తమిళంలో అనువాదం చేసి, విడుదల చేయటం విశేషం.

అనేక అంతర్జాతీయ వేదికలపై ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఎన్నో అవార్డులను అందుకుంది. అంతేకాదు, ఆస్కార్‌ నామినేషన్స్‌కు ఎంట్రీ లభించింది. ప్రకృతిని కథావస్తువుగా తీసుకుని, సూర్య అనే యువకుడి జీవితంలో చోటు చేసుకున్న ప్రేమ మజిలీలను చైత్ర, వర్ష, సీత అంటూ కాలాలకు అన్వయమయ్యేలా పేర్లు పెట్టి దీనిని రూపొందించాడు. వైవిధ్యంగా ఉండేందుకు రివర్స్‌ స్క్రీన్‌ప్లేలో తెరకెక్కించాడు. అలా ఈ చిత్రం అందరి మనసులు దోచుకుంది. అంతేకాదు, ఈ షార్ట్‌ఫిల్మ్‌ టైటిల్‌ ఎటు చూసిన ‘మనసానమః’ ఒకేలా కనిపించటం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని