Manchu Lakshmi: నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్‌

Manchu Lakshmi: ఇటీవల తాను చేసిన ట్వీట్‌ను ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శలను ఖండిస్తూ మంచు లక్ష్మి ఓ వీడియో విడుదల చేశారు.

Published : 23 Sep 2023 06:25 IST

హైదరాబాద్‌: డబ్బు మనకు కేవలం స్వేచ్ఛను మాత్రమే ఇస్తుందని అంటున్నారు మంచు లక్ష్మి (Manchu Lakshmi). ఇటీవల ఆమె చేసిన ఓ ట్వీట్‌పై వరుస కామెంట్లు రావడంతో ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

‘‘అందరికీ నమస్కారం. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో కార్పెట్‌ శుభ్రంగా లేదని వీడియో పెట్టాను. నా ఐఫోన్‌తో తీసిన ఫొటో వల్ల ఇంకా బాగా కనపడుతోందని అన్నాను. అంతే వరుసగా ‘ఓహో.. నువ్వు బిజినెస్‌ క్లాస్‌లో వెళ్తున్నావా? నీకు ఐఫోన్‌ ఉందా’ అంటూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ‘నువ్వు కొనిచ్చావా’. నా కష్టం.. నా సంపాదన.. నా ఖర్చు.. నీకేమిరా నొప్పి? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? నేను బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించడం, ఐఫోన్‌ వాడటం తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. నాకు సొంతంగా విమానం కావాలి? మీకు వద్దా? పెద్దగా ఆలోచించరా? మీకు అన్నీ తప్పులే కనపడుతున్నాయి. ఒక సగటు మహిళ ఏమీ చెప్పకూడదు. సోషల్‌మీడియాలో ఏదీ పోస్ట్‌ చేయకూడదు. మీ సమస్య ఏంటి? డబ్బు సంపాదించడానికి నేను చాలా కష్టపడతా. మా అమ్మానాన్నలెవరూ నాకు డబ్బులు ఇవ్వరు. కష్టపడటం నేర్పించారు’’

‘‘డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నేను వాళ్లతో నేను ఏకీభవించను. నా జీవితంలో ఎంతో డబ్బును చూశా. నేను వజ్రాలు పొదిగిన బంగారు స్పూన్‌ ఉన్న ఇంట్లో పుట్టి, పెరిగా. కానీ, అమెరికాలో ఉన్నప్పుడు రోజూ తినే తిండికోసం కూడా కష్టపడి పనిచేశా. డబ్బు మనకు స్వేచ్ఛను మాత్రమే ఇస్తుంది. వంట చేయడంలో తప్పులేదు. పిల్లల్ని పెంచడంలో తప్పులేదు. కానీ, ‘నువ్వు అదే చేయాలి. మరొకటి చేయకూడదు’ అనడం నా దృష్టిలో తప్పు. మనం ప్రతి దానికీ తప్పుపట్టకూడదు. జీవితం చాలా చిన్నది. ‘వేరే వాళ్ల కోసం బతికే బతుకు ఒక బతుకేనా?’ ఇతరుల అభిప్రాయాలను ఎత్తి చూపుతూ, నీ జీవితాన్ని నాశనం చేసుకోకు’’ అంటూ మంచు లక్ష్మి హితవు పలికారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటీవల విమానం ఎక్కేందుకు ముంబయి వెళ్లిన మంచు లక్ష్మి అక్కడ కార్పెట్‌ అపరిశుభ్రంగా ఉండటం గమనించారు. ఈ మేరకు ఎయిర్‌ ఇండియాను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘‘ముంబయిలో ఎయిర్‌ ఇండియా విమానం ఎక్కేందుకు బిజినెస్‌ క్లాస్‌ వాళ్లు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన కార్పెట్‌లు శుభ్రంగా లేవు. ఇదే విషయాన్ని సిబ్బంది అడిగితే వాళ్లు నవ్వి ఊరుకున్నారు. పరిశుభ్రత ప్రయాణికుల హక్కు. నా ఐఫోన్‌ కెమెరాతో ఇంకా బాగా కనపడేలా చేస్తుంది’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇందుకు ఎయిర్‌ ఇండియా కూడా స్పందిస్తూ, విచారం వ్యక్తం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు