Manchu Manoj: ఆ వ్యక్తి కావాలనే మా అన్నయ్యని టార్గెట్‌ చేశాడు: మనోజ్‌

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల సమయంలో కావాలనే తన అన్నయ్య విష్ణును కొందరు టార్గెట్‌ చేశారని మనోజ్‌ అన్నారు.

Published : 22 Mar 2022 01:21 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల సమయంలో కావాలనే తన అన్నయ్య విష్ణును కొందరు టార్గెట్‌ చేశారని మనోజ్‌ ఆరోపించారు. శ్రీ విద్యానికేతన్‌ 30వ వార్షికోత్సవం సందర్భంగా తాజాగా తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో మనోజ్‌ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఉన్నత ఆలోచనతో ఉండాలని, అది ఉంటే తప్పకుండా జీవితంలో వృద్ధి చెందుతారన్నారు. అనంతరం మంచు విష్ణు లక్ష్యంగా విమర్శలు చేసిన ఒక వ్యక్తి గురించి పరోక్షంగా మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తుల మధ్య ఉన్నప్పటికీ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

‘‘జీవితంలో ప్రతి ఒక్కరికీ ఉన్నతస్థాయి విలువుల కలిగి ఉండాలి. జీవిత లక్ష్యం కంటే కూడా అది ఎంతో గొప్పది. ఎందుకంటే అది మనిషి లోపలి నుంచి పుడుతుంది. అది లేకపోతే మనిషి తనని తాను నాశనం చేసుకుంటాడు. పక్కవాళ్లని ఇబ్బందులకు గురిచేస్తాడు. ఉదాహరణకు చెప్పాలంటే మొన్న ‘మా’ ఎన్నికలు జరిగాయి. పోటీ అంటే రెండు వైపులా ఉంటుంది. ఇటువైపు వాళ్లూ ఓట్లు వేయమని అడిగారు. అటువైపు వాళ్లూ ఓట్లు వేయమని కోరారు. సభ్యులందరూ కలిసి.. ఫలానా వ్యక్తి ప్రెసిడెంట్‌గా ఉంటే బాగుంటుందని భావించి మా అన్నయ్యని గెలిపించారు. నాకు తెలిసినంత వరకూ పరిశ్రమలో అందరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందరం స్నేహితులమే. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రతిసారీ మా అన్నయ్యని టార్గెట్‌ చేసి మానసికంగా ఇబ్బందిపెట్టాలని చూశాడు. మేము ఆ మాటల్ని పట్టించుకోలేదు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి మాకు సపోర్ట్‌ చేసే వాళ్లని వయసుతో సంబంధం లేకుండా ఎన్నో మాటలు అన్నాడు. ఇలా ఎన్నో ఘటనలు ఎదురైన తర్వాత ఆ వ్యక్తి ఎందుకలా మాట్లాడుతున్నాడా అని ఆలోచించాను. అప్పుడు మా నాన్న ఒక్కటే చెప్పారు. ‘‘ఆ వ్యక్తికి జీవితంలో ఎలాంటి లక్ష్యం అనేది లేదు. అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి వాళ్ల గురించి నువ్వు పట్టించుకోకు’’ అని నాన్న చెప్పిన మాటలు విన్నాక.. అది నిజమే అనిపించింది. ఎందుకంటే మా అన్నని టార్గెట్‌ చేసిన ఆ వ్యక్తి చుట్టూ గొప్ప వాళ్లు ఉన్నారు. జనాలకు ఏదైనా చేయాలనే తపనతో జీవిస్తున్నవారు ఉన్నారు. ఆ వ్యక్తి మాత్రం అలాంటిది ఏం లేకుండా జీవిస్తున్నారు’’ అంటూ మనోజ్‌ పరోక్షంగా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు అంతటా వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని