Manchu Manoj: జీవితంలో ఎన్నోసార్లు మా నాన్నను ఇబ్బందిపెట్టా.. : మంచు మనోజ్‌

నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో తాను క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పారు.

Published : 22 Mar 2023 13:13 IST

హైదరాబాద్‌: గతంలో తాను క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) గుర్తు చేసుకున్నాడు . కుటుంబసభ్యుల సహకారంతోనే తాను సవాళ్లను అధిగమించి ముందుకు అడుగు వేయగలిగానని తెలిపాడు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన తండ్రి మోహన్‌బాబు (Mohanbabu) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టినప్పటికీ.. తన తండ్రి ప్రేమగానే చూసుకున్నారని అన్నాడు.

‘‘మా నాన్నే నాకు స్ఫూర్తి. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఎన్నో సందర్భాల్లో మా నాన్న కష్టాలను చూశా.. అలాగే ఆయన విజయాల్నీ చూశా. గెలుపోటములకు అతీతంగా ఆయన ముందుకు సాగడానికి కారణం ప్రేమ. ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది. తాను చేసే ప్రతి పనిని ఆయన ప్రేమిస్తారు. ప్రేమ అంటే కేవలం భావోద్వేగాలు మాత్రమే కాదు.. ప్రేమంటే ఒక నిర్ణయం. చేసే పనిని ప్రేమిస్తే తప్పకుండా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం. ప్రతిఒక్కరూ జీవితంలో ఏదో ఒక దశలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో బాధ, భయంతో అక్కడే ఆగిపోకూడదు. ఇష్టమైన పనిపై ధ్యాస పెట్టి ధైర్యంగా ముందుకు సాగాలి. అప్పుడే మళ్లీ వెలుతురు వస్తుంది. నేనూ అలాంటి దశనే ఎదుర్కొన్నా. అప్పుడు నా కుటుంబసభ్యులు అండగా నిలిచారు. అదే సమయంలో నా జీవితంలోకి వచ్చిన వెలుతురు మౌనిక. తను ఏం చేయాలనుకున్నా నేను అండగా ఉంటా. ఎన్నోసార్లు నాన్నని ఇబ్బందిపెట్టా. అయినప్పటికీ ఆయనకు నాపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. మౌనికను ఇష్టపడిన తర్వాత నాన్న వద్దకు వెళ్లి.. ‘‘నాన్నా.. జీవితాంతం తోడుంటానని నేను ఒక అమ్మాయికి మాటిచ్చా’’ అని చెప్పాను. నా ఇష్టాన్ని ఆయన గౌరవించారు. ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను’’ అని మనోజ్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని