MAA Elections: అవును వాళ్లకు విమానం టికెట్లు బుక్‌ చేశాం.. అందులో తప్పేమీ లేదు!

సినీ నటుడు నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానని, ప్రస్తుతం సమయం లేనందున వీడియో రూపంలో తన అభిప్రాయాన్ని వ్యక్త

Updated : 12 Oct 2021 05:51 IST

హైదరాబాద్‌: సినీ నటుడు నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానని, ప్రస్తుతం సమయం లేనందున వీడియో రూపంలో తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తానని మా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి మంచు విష్ణు అన్నారు. శనివారం సాయంత్రం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘శుక్రవారం నిర్వహించిన మేనిఫెస్టో డిన్నర్‌ పార్టీకి 250 నుంచి 300మంది వస్తారనుకున్నాం. కానీ, 560మంది వచ్చారు. అందరూ ‘మా’ సభ్యులే. వారంతా నాతోనే ఉన్నారు. నా కుటుంబ సభ్యులను పిలిచి నాకెందుకు ఓటు వేయాలో చెప్పాను. వాళ్లకు నచ్చితే వేస్తారు. వాళ్లంతా పాజిటివ్‌గా స్పందించారు. ‘మా’ చరిత్రలో ఇప్పటివరకూ జరగని రీతిలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ‘మా’ సభ్యులు విమానంలో వచ్చి మరీ ఓటు వేసి వెళ్తారు. వాళ్లంతా చూపిస్తున్న ప్రేమ, భరోసా ఎన్ని జన్మలైనా రుణం తీర్చుకోలేను’’ అని మంచు విష్ణు చెప్పారు.

విష్ణు చక్రాన్ని పాకెట్‌లో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్లకు తెలుస్తుంది

ఇక విష్ణు ప్యానెల్‌కు మద్దతు ఇస్తున్న ‘మా’ మాజీ అధ్యక్షుడు, సినీ నటుడు నరేశ్‌ కూడా విలేకరులతో మాట్లాడారు. ‘‘రెండు రోజుల నుంచి ఎన్నికల ఏర్పాట్లు చూస్తున్నాం. ఇరు ప్యానెల్‌ వర్గాలు వచ్చాయి. ఎన్నికలు అధికారులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 8గంటలకు పోలింగ్‌ మొదలవుతుంది. మధ్యాహ్నం 2గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. నాలుగైదు గంటల పాటు ఓట్లను లెక్కిస్తారు. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టాలని మొదట అనుకున్నాం. కానీ, వర్షాల కారణంగా అందరి ఆమోదంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. ఎవరి ప్రచారాన్ని వాళ్లు పూర్తి చేసుకున్నారు. ఈరోజంతా ఏర్పాట్లలోనే ఉన్నాం. శుక్రవారం మోహన్‌బాబుగారు ఇచ్చిన మేనిఫెస్టో డిన్నర్‌కు పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారు. విష్ణు ప్యానెల్‌కు ఏ స్థాయిలో మద్దతు ఉందో దీనిని బట్టే తెలుసుకోవచ్చు. మేం గెలవడం కాదు.. ఓటర్లు గెలవాలి’’

‘‘నేను చక్రం తిప్పడం పక్కన పెడితే, విష్ణు చక్రాన్ని పాకెట్‌లో పెట్టుకుంటే ప్యాంట్‌ ఏమవుతుందో వాళ్లు ఆలోచించాలి. క్యాంపు రాజకీయాలు ఏమీ జరగడం లేదు. భోజనాలకు ఇబ్బంది లేకుండా ఆఫీస్‌లాంటిది ఏర్పాటు చేశాం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్‌ చేశాం. అందులో తప్పేమీ లేదు. ఓటర్లకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా! అదేమీ పెద్ద సమస్య కాదు. ఇక విష్ణు ప్యానెల్‌ ప్రకటించిన మేనిఫెస్టో చరిత్రలో ఎవరూ ప్రకటించలేదు. దాన్ని చూసిన తర్వాత విష్ణు ప్యానెల్‌పై నటీనటులకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ప్రకాశ్‌రాజ్‌కు ఇంగిత జ్ఞానం, విషయ జ్ఞానం, సినిమా జ్ఞానం ఉన్న వ్యక్తి అని అంటున్నారు కానీ, క్యారెక్టర్‌ కూడా ఉండాలి కదా. అది ఉంటే ఆయన గెలుస్తారు’’ అని ఎద్దేవా నరేశ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు