Mani Ratnam: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కార్యరూపం దాల్చడానికి స్ఫూర్తి ఆ సినిమానే: మణిరత్నం

Mani Ratnam: ‘పొన్నియన్‌ సెల్వన్‌’ కార్యరూపం దాల్చడం వెనుక ఉన్న వ్యక్తి గురించి దర్శకుడు మణిరత్నం మరోసారి పంచుకున్నారు.

Updated : 24 Feb 2023 13:01 IST

చెన్నై: ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు వచ్చిన అశేష ప్రజాదరణతో దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన కెరీర్‌లోనే అత్యున్నత స్థానంలో నిలిచారు. జేమ్స్‌ కామెరూన్‌, స్పీల్‌బర్గ్‌ వంటి హాలీవుడ్‌ దర్శకులు సైతం రాజమౌళి దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కల్ట్‌ క్లాసిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మణరత్నం చేరారు. రాజమౌళి దర్శకత్వం, పనిపై ఉన్న నిబద్ధత తనని ఎంతో ప్రభావితం చేసిందన్నారు. చెన్నై వేదికగా సౌత్‌ ఇండియా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ జరిగింది. ఇందులో భాగంగా ‘భవిష్యత్‌ సినిమా ట్రెండ్‌’ అనే అంశంపై నిర్వహించిన చర్చా వేదికలో మణిరత్నం (Mani ratnam), ఎస్‌ఎస్‌ రాజమౌళి (Rajamouli), సుకుమార్‌ (sukumar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు ముగ్గురూ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని మణిరత్నాన్ని ‘మిమ్మల్ని సానుకూలంగా అత్యంత ప్రభావితం చేసిన అంశం ఏంటి’ అని అడగ్గా, ‘రాజమౌళి అనుకుంటున్నా’ అని సమాధానం ఇచ్చారు.

‘‘రాజమౌళినే ఎందుకో నేను చెబుతా. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ను సినిమా తీయాలని ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తూ ఉన్నా. ‘బాహుబలి’ వచ్చే వరకూ నాకెలాంటి మార్గం కనిపించలేదు. అందులో ఆసక్తికర విషయ ఏంటంటే, అది రెండు భాగాలుగా రావటం. ఒక కథను అలా తీసి, ప్రేక్షకులకు ఆ సినిమాపై ఆసక్తి సన్నగిల్లకుండా చేయవచ్చని అర్థమైంది. ఒకవేళ బాహుబలి రెండు భాగాలుగా రాకపోయుంటే, నేను ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తీసేవాడిని కాదేమో. థ్యాంక్యూ వెరీ మచ్‌’’ అని మణిరత్నం అన్నారు. అక్కడే ఉన్న రాజమౌళి స్పందిస్తూ ‘సర్‌, ఇది నా కెరీర్‌లోనే అతిపెద్ద అభినందన. నిజంగా చాలా పెద్దది’ అన్నారు.

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కథను కల్కి కృష్ణమూర్తి మొత్తం 5 భాగాలుగా రాశారు. ఎంజీ రామచంద్రన్‌, కమల్‌హాసన్‌ వంటి లెజెండరీ నటులు సైతం ఈ కథతో సినిమా తీయాలని ప్రయత్నించారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. కథకు ఉన్న నిడివి, నిర్మాణ వ్యయం ప్రధాన అడ్డంకిగా మారాయి. ఎట్టకేలకు మణిరత్నం ఈ మూవీని తీర్చిదిద్దారు. గతేడాది విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. మణిరత్నం చిత్రం ఏకంగా రూ.500కోట్లు వసూలు చేసింది. దీనికి కొనసాగింపుగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’ (PonniyinSelvan2)ను ఏప్రిల్‌ 28, 2023న తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది.విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, కార్తి, త్రిష జయం రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని