‘ఆచార్య’.. బాక్సులు బద్దలవుతాయ్‌

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడు తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ తప్పకుండా బాక్సులు బద్దలుకొడుతుందని ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా నుంచి ఇటీవల..

Updated : 07 Dec 2022 19:48 IST

లాహే లాహే సక్సెస్‌పై రచయిత, సంగీత దర్శకుడు

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ తప్పకుండా బాక్సులు బద్దలుకొడుతుందని ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా నుంచి ఇటీవల ‘లాహే లాహే’ పాట విడుదలై యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. పరమశివుడు-పార్వతిదేవిల ఏకాంత సమయాన్ని తెలియజేసే విధంగా రచించిన ఈ పాట ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ‘లాహే లాహే’ గురించి చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ, రచయిత రామజోగయ్యశాస్త్రి చెప్పిన కొన్ని విశేషాలు..

అలా రాశా: రామజోగయ్యశాస్త్రి

‘‘కొరటాల శివ ఆలోచనలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. ఆయన మనసులో మాటల్ని కొద్దిగా మాత్రమే బయటకు చెబుతారు. జడలు విరబూసుకున్న అమ్మవారి రూపానికి సంబంధించి ఓ విజువల్‌ ఆయన మనసులో ఉంది. అది ఎక్కడో ఒకచోట ఈ పాటలో రావాలని ఆయన అనుకున్నారు. అలా ఈ పాట రాశాను. సాధారణంగా శివుడు గురించి పాట రాయవచ్చు. అలాగే అమ్మవారి గురించి విడిగా రాయవచ్చు. కానీ వాళ్లిద్దరి ఏకాంత సమయాన్ని.. వాళ్ల మధ్య జరిగే చిన్న చిన్న విషయాలను చమత్కారంగా చెప్పే అవకాశం రావడం అనేది ఒక సువర్ణావకాశమనే చెప్పాలి. జనాలకు మరింత చేరువ కావాలనే ‘లాహే లాహే’ పదాలు ఉపయోగించాం’’

వేదపండితుల నుంచి ఫోన్‌ కాల్స్‌‌ : మణిశర్మ

‘‘మొదటిసారి ‘లాహే లాహే’ లిరిక్స్‌ చూడగానే తెలియని వైబ్రేషన్స్‌ వచ్చాయి. వెంటనే ఆపాటకు ట్యూన్‌ చేయాలనిపించింది. ఇక, పాట విడుదలయ్యాక వేద పండితుల నుంచి నాకు మెస్సేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ మొదలయ్యాయి. ప్రశంసలు కురిపించారు’’

చిన్న భయం: రామజోగయ్య శాస్త్రి

‘‘పాట రిలీజ్‌ అంటే ఒక చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే కథ, సందర్భం ఏమీ బయటకు చెప్పలేం. మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా చిరంజీవి అభిమానులకు ఉన్న అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయి. పాట అనగానే మొదట వాళ్లు వేరే ఏదో ఊహించుకుంటారు. ఇలాంటి భక్తిపరమైన పాటను విడుదల చేస్తే ఏమైనా నిరాశకు గురి అవుతారా? అనే భయం విడుదలకు ముందు ఉంది. కానీ పాట విడుదలయ్యాక అందరూ దాన్ని బాగా ఆదరించారు. మా పాటను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పాట విడుదలైన రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదిగంటల వరకూ సోషల్‌మీడియాలో వచ్చిన కామెంట్లకు రిప్లైలు ఇచ్చాను. అలాగే వేద పండితులు కూడా ఫోన్‌ చేశారు’’

గొప్పతనం శివదే: మణిశర్మ

‘‘పాటంటే ప్రతి పదం కూడా స్పష్టంగా వినిపించాలి. ఇది నా మొదటి సినిమా నుంచి నేను ఫాలో అవుతున్న నియమం. ఈ పాటకు సంబంధించి శాస్త్రిగారిని, నన్నూ ఎంతో ప్రోత్సహించిన దర్శకుడు కొరటాలశివకే ఈ క్రెడిట్‌ దక్కుతుంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. ఇప్పటికే నాలుగు పాటలకు కంపోజింగ్‌ పూర్తి చేశాం. ఇక, ‘లాహే లాహే’ పాట విని చిరు అన్నయ్య నాకు ఫోన్‌ చేసి 15 నిమిషాలు మాట్లాడారు’’

శివ.. గొప్ప మనిషి: రామజోగయ్య శాస్త్రి

‘‘కొరటాల శివతో నాది దాదాపు నాలుగు సినిమాల ప్రయాణం. ఆయనలో ఉండే గొప్పలక్షణం ఏమిటంటే.. రచయితలను గౌరవిస్తారు. ఒకవేళ ఏదైనా లిరిక్స్‌ని ఫోన్‌లో పంపించినా సరే దానిని పైకి చదివి పక్కవాళ్లతో చెప్పి మమ్మల్ని మెచ్చుకుంటారు. ‘ముసలి తాత ముడతముఖం’ సాంగ్‌ రాసిన సమయంలో లొకేషన్‌కు వెళ్లి ఆయనతో చెప్పాను. వెంటనే అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ అందర్నీ దగ్గరకు పిలిపించి మరీ ఆ పాట మరోసారి నాతో పాడించారు. వాళ్లందరి ముందు నా పాట బాగుందని చెప్పారు. ఆయన గొప్ప వ్యక్తి’’

ఆ కోరిక ఇలా తీరింది: రామజోగయ్య శాస్త్రి

‘‘చిరంజీవి చిత్రానికి ఓ పాట రాయాలనే కోరిక నాలో ఎప్పటి నుంచో ఉంది. ‘ఖైదీ నం:150’లో ‘రైతన్న’ పాట రాశాను. కానీ ఆయనకు తగ్గట్టు పాట రాయాలనే కోరిక నాకు అలాగే మిగిలింది. చిరుతో ఇది నాకు సెకండ్‌ సాంగ్‌. నా ఎదురుచూపులకు ఓ మంచి అవకాశం ఈ పాటతో దక్కింది. ఆ పాట విని చిరు నాకు ఫోన్‌ చేసి అభినందించారు. మెగాస్టార్‌ లాంటి పెద్ద వ్యక్తి నాలాంటి వాడికి ఫోన్‌ చేసి ప్రశంసిస్తారని ఊహించనేలేదు. ఈ సినిమా తప్పకుండా బాక్సులు బద్దలు కొడుతుంది’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని