నెట్‌ఫ్లిక్స్‌.. అమెజాన్‌.. మధ్యలో మనోజ్ బాజ్‌పాయ్‌

సామాజిక మధ్యమాల్లో తమ వినియోగదారులకు వినోదం పంచడంలో ఓటీటీ వేదికలు చురుగ్గా ఉంటాయి. ప్రతిరోజూ వాళ్లను పలకరిస్తూ.. అప్పుడప్పుడు తోటి ఓటీటీ సంస్థలకు కౌంటర్లు వేస్తూ అభిమానులకు కనువిందు కలిగిస్తాయి. తాజాగా.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ మధ్య సరదాగా జరిగిన ట్విటర్‌ వార్‌ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Published : 11 Jun 2021 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో తమ వినియోగదారులకు వినోదం పంచడంలో ఓటీటీ వేదికలు చురుగ్గా ఉంటాయి. ప్రతిరోజూ వాళ్లను పలకరిస్తూ.. అప్పుడప్పుడు తోటి ఓటీటీ సంస్థలకు కౌంటర్లు వేస్తూ అభిమానులకు కనువిందు కలిగిస్తాయి. తాజాగా.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ మధ్య సరదాగా జరిగిన ట్విటర్‌ వార్‌ ప్రత్యేక ఆకర్షణగా మారింది. దానికి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ కూడా స్పందించడంతో విషయం వైరల్‌ అయింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

మనోజ్‌ బాజ్‌పాయ్‌ ప్రధానపాత్రలో నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’ ఇటీవల విడుదలై విశేష స్పందన సొంతం చేసుకుంది. తెలుగు తేజాలు రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌, సమంత, ప్రియమణితో పాటు పలువురు బాలీవుడ్‌ నటులు కనిపించారు. ఈ సిరీస్‌తో మంచి విజయం సొంతం చేసుకున్న మనోజ్‌ తన తర్వాతి ప్రాజెక్ట్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి చేస్తున్నారు. ‘రాయ్‌’ అనే వెబ్‌సిరీస్‌లో మనోజ్‌ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ కూడా విడుదలైంది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా ఒక ట్వీట్‌ చేసింది.

‘నెట్‌ఫ్లిక్స్‌ ‘రాయ్‌’ సిరీస్‌ కోసం మనోజ్‌ బాజ్‌పాయ్‌ వచ్చేస్తున్నారు. మీరు మా ఫ్యామిలీలో ఒకరు కావడం మాకు ఎంతో సంతోషమైన విషయం’ అంటూ ‘ఫ్యామిలీ మ్యాన్‌’ పేరు ప్రస్తావిస్తూ ఆ ట్వీట్‌లో పేర్కొంది. దీంతో అమెజాన్‌ స్పందిస్తూ.. ఆ ట్వీట్‌కు బదులిచ్చింది. ‘శ్రీకాంత్.. ఉద్యోగం మారడం తప్పనిసరి అనుకుంటున్నారా..!’ అంటూ సిరీస్‌లోని డైలాగ్‌ను హిందీలో ట్వీట్‌ చేసింది. దీనిపై మనోజ్‌ బాజ్‌పాయ్‌ స్పందించారు. ‘హహహ.. ఇదొక మంచి పరిహాసం. ఉద్యోగం లేదు.. మారడమూ లేదు’ అని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ మధ్య ఇలా ఫన్నీఫైట్‌ జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ‘మీర్జాపూర్‌2’ వెబ్‌ సిరీస్‌ సమయంలో ఇలాగే జరిగింది. ఆ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని