VT13: మెగా హీరోతో మాజీ ప్రపంచ సుందరి.. వీడియో రిలీజ్‌ చేసిన టీం

వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నటిస్తోన్న తాజా చిత్రంలో ఆయన సరసన మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ (Manushi Chhillar)‌నటించనుంది. ఈ మేరకు చిత్రబృందం వీడియో విడుదల చేసింది.

Published : 03 Mar 2023 16:50 IST

హైదరాబాద్‌: విభిన్నమైన కథలు ఎంచుకుంటూ మంచి సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej). ఈ యంగ్‌ హీరో తాజాగా శక్తి ప్రతాప్‌ సింగ్‌ (Shakti Pratap Singh) దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా VT13గా ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో వరుణ్‌ సరసన మాజీ ప్రపంచ సుందరి నటించనుందని వార్తలు వచ్చాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ చిత్రబృందం వీడియో విడుదల చేసింది. 

ఈ ప్రాజెక్ట్‌లో మాజీ మిస్‌ యూనివర్స్‌ మానుషి చిల్లర్ (Manushi Chhillar)‌‌ హీరోయిన్‌గా నటించనుందని మేకర్స్‌ తెలియజేశారు. ఇందులో మానుషి ఓ ఆఫీసర్‌ పాత్రలో అలరించనుంది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ..‘‘ఇంత గొప్ప సినిమాలో నేనూ భాగమవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. ఈ స్క్రిప్ట్‌ చదివాక ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్స్‌ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువైంది. నాకు ఈ  అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌కు కృతజ్ఞతలు. వరుణ్‌తో కలిసి నటించేందుకు ఆసక్తిగా  ఎదురుచూస్తున్నాను’’ అని తెలిపింది. అలాగే వరుణ్‌ కూడా ఆమెకు వెల్‌కమ్‌ చెబుతూ ట్వీట్‌ చేశాడు.

ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో వరుణ్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుండగా.. మానుషి తెలుగు తెరకు పరిచయమవ్వనుంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కనుంది. వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్లను ఇందులో చూపనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రానున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని