maredumilli prajaneekam review: రివ్యూ: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

Maredumilli prajaneekam review: అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించిన ‘మారేడుమిల్లి ప్రజానీకం’మూవీ ఎలా ఉందంటే?

Updated : 25 Nov 2022 14:40 IST

Maredumilli prajaneekam review: చిత్రం: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం; నటీనటులు: అల్లరి నరేష్‌, ఆనంది, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, సంపత్‌ రాజ్‌, రఘుబాబు, శ్రీతేజ్‌, కుమరన్‌, షాని తదితరులు; కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌; మాటలు: అబ్బూరి రవి; సంగీతం: శ్రీచరణ్‌ పాకాల; ఛాయాగ్రహణం: రాంరెడ్డి; రచన, దర్శకత్వం: ఏఆర్‌ మోహన్‌; నిర్మాత: రాజేష్‌ దండా; విడుదల తేదీ: 25-11-2022

వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలుస్తూ.. మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు అల్లరి నరేష్‌ (allari naresh). అయితే ‘నాంది’ విజయంతో ఆయన ఇమేజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఆ చిత్రమిచ్చిన స్ఫూర్తితో తనలోని నటుడ్ని సరికొత్తగా ఆవిష్కరించే వినూత్నమైన కథలతో ప్రయాణం చేయడంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (maredumilli prajaneekam) చిత్రానికి పచ్చజెండా ఊపారు. దీన్ని ఏఆర్‌ మోహన్‌ తెరకెక్కించారు. పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే సామాజికాంశాలు నిండిన కథ కావడం.. టీజర్‌, ట్రైలర్లు ఆలోచింపజేసేలా ఉండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని ‘ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అందుకుందా? (maredumilli prajaneekam review) నరేష్‌ ఖాతాలో మరో విజయం చేరిందా?

కథేంటంటే: ఓ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పని చేస్తుంటారు శ్రీపాద శ్రీనివాస్‌ (అల్లరి నరేష్‌). మంచి విలువలతో పాటు మానవత్వం ఉన్న వ్యక్తి. సాయానికి ఎప్పుడూ ముందుంటాడు. ఎన్నికల విధుల్లో భాగంగా రంప చోడవరం సమీపంలోని మారేడుమిల్లికి వెళ్తాడు. అదొక మారుమూల గిరిజన గ్రామం. విద్య,వైద్యం, రహదారులు.. ఇలాంటి ఏ కనీస సౌకర్యాలు లేని కొండ ప్రాంతం. ఏదైనా జరిగి ప్రాణం మీదకి వస్తే.. ఆ ప్రాణంపై ఆశ వదులుకోవాల్సిందే తప్ప ఆదుకునేందుకు ఏ వ్యవస్థ అందుబాటులో ఉండదు. తమ కష్టాలు తీర్చమని అక్కడి గిరిజనులు ప్రజా ప్రతినిధుల చుట్టూ.. ప్రభుత్వ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం శూన్యం. (maredumilli prajaneekam review) అందుకే ఆ ప్రాంత వాసులంతా ఓటు వేయడానికి నిరాకరిస్తారు. అయితే శ్రీనివాస్‌ చేసిన ఓ సాయం వల్ల వాళ్లంతా మనసు మార్చుకొని ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే.. బ్యాలెట్‌ బాక్సులతో తిరిగి వెళ్తున్న శ్రీనివాస్‌ బృందాన్ని ఆ గిరిజన గ్రామంలోని కండా (శ్రీతేజ) కిడ్నాప్‌ చేస్తాడు. అయితే దీని వెనకున్న అతని లక్ష్యమేంటి? కిడ్నాప్‌ అయిన ప్రభుత్వ అధికారుల్ని విడిపించడానికి ప్రభుత్వం ఏం చేసింది? విద్య,వైద్యం, రహదారులు కావాలంటూ మారేడుమిల్లి ప్రజానీకం చేసిన పోరాటం ఫలితాన్నిచ్చిందా? ఈ కథలో లక్ష్మీ (ఆనంది) పాత్ర ఏంటి? ఆమె శ్రీనివాస్‌కు ఎలా సాయపడింది? అన్నది మిగతా కథ.

ఎలా సాగిందంటే: స్వాతంత్య్రం సాధించి 75ఏళ్లు పూర్తవుతున్నా.. ఆ అభివృద్ధి ఫలాలు అందుకోలేని ప్రజానీకం మన సమాజంలో నేటికీ ఉన్నారు. చదువు కోవాలన్నా.. వైద్య చికిత్స చేయించుకోవాలన్నా.. కొండలు, నదులు దాటి రావాల్సిన దుర్భర పరిస్థితుల్ని వారు నేటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పల్లెలు, గిరిజన గ్రామాలు ఇప్పటికీ అనేకం. అలాంటి ఓ మారుమూల గిరిజన ప్రాంత వాసుల కన్నీటి కథకు దృశ్య రూపమే ఈ చిత్రం. తమ జీవితాల్ని మార్చలేని ప్రభుత్వ వ్యవస్థపై ఎన్నికల సమయంలో వారు చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. వాణిజ్య హంగులకు దూరంగా ఉండే ఇలాంటి కథను తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించాలంటే దర్శకుడికి ఎంతో నేర్పు ఉండాలి. (maredumilli prajaneekam review)  ప్రేక్షకుల్ని చివరి వరకూ కూర్చోబెట్టగలిగే విధంగా ఉత్కంఠభరితంగా కథ అల్లుకోగలగాలి. సమస్యల్ని భావోద్వేగభరితంగా హృదయానికి హత్తుకునేలా తెరపై చూపించగలగాలి. ఈ విషయాల్లో దర్శకుడు ఆది నుంచే తడబడ్డాడు. ఈ కథలో ప్రధమార్ధమంతా మారేడుమిల్లి గిరిజనుల జీవితం, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎన్నికల విషయంలో వారికి.. హీరోకి మధ్య జరిగే పోరాటాన్ని చూపించారు. ఆరంభ సన్నివేశాలు సాదాసీదాగా ఉంటాయి. ఎన్నికల విధుల్లో భాగంగా హీరో మారేడుమిల్లికి వెళ్లడం.. ఈ క్రమంలో ఆ ప్రాంత పరిస్థితుల్ని, అక్కడి సంస్కృతి సంప్రదాయాల్ని చూపిస్తూ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఓటు హక్కు వినియోగించుకునే విషయమై గిరిజనులు హీరోపై తిరగబడటం.. ఈ క్రమంలో వారి నుంచి అతనికి ఎదురయ్యే సవాళ్లతో కథ కాస్త ఆసక్తికరంగానే సాగుతుంది. ఓ గిరిజన యువతి ప్రసవం విషయంలో కథానాయకుడు చేసే సాయం అందరినీ కదిలిస్తుంది. ఆ ఎపిసోడ్‌ను దర్శకుడు తెరపై భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. (maredumilli prajaneekam review)  ఇక విరామానికి ముందు హీరో తాను అనుకున్నట్లుగా అక్కడి గిరిజనుల్లో మార్పు తీసుకొచ్చి ఓటు వేసేలా చేయడం.. కానీ, ఆ వెంటనే వాళ్లు అతన్ని కిడ్నాప్‌ చేయడంతో ద్వితీయార్ధం ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది.

ఇక అక్కడి నుంచి మారేడుమిల్లి వాసులు తమ హక్కులు సాధించేందుకు ప్రభుత్వంతో ఎలాంటి పోరాటం చేశారు? ఈ క్రమంలో వారికి హీరో ఎలా సాయపడ్డాడు? ఈ పోరాటంలో వారందరికీ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది చూపించారు. అయితే గిరిజనుల సమస్యల్ని సీరియస్‌గా తీసుకున్న కథానాయకుడు కేవలం సలహాలు, సూచనలతో కథ నడిపిస్తుంటాడే తప్ప.. నేరుగా రంగంలోకి దిగి వ్యవస్థపై తిరుగుబాటు చేసింది కనిపించదు. దీంతో చాలా సన్నివేశాల్లో హీరో కన్నా అతని చుట్టూ ఉన్న పాత్రలే శక్తిమంతంగా కనిపిస్తుంటాయి.(maredumilli prajaneekam review) మారేడుమిల్లి వాసులకు, ప్రభుత్వ అధికారులకు మధ్య వచ్చే ఘర్షణ ఏమాత్రం ప్రభావవంతంగా ఉండదు. ఈ ఎపిసోడ్‌లన్నీ మరీ సినిమాటిక్‌గా ఉంటాయి. ప్రతిదీ ప్రేక్షకుల ఊహకు అందేలాగే ఉంటుంది. విద్యుత్‌ సదుపాయం.. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ లేని ప్రాంతం నుంచి హీరో గిరిజనుల సమస్యని సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రీకరించి బయట ప్రపంచానికి తెలియజేయడం అసలే మాత్రం లాజిక్‌గా అనిపించదు. పతాక సన్నివేశాలు మరీ క్లాస్‌ పీకినట్లుగా ఉంటాయి. సినిమాని ముగించిన తీరు అంతగా మెప్పించదు.

ఎవరెలా చేశారంటే: ఈ కథలో నరేష్‌లోని నటుడికి సవాల్‌ విసిరిన అంశం ఒక్కటీ కనిపించదు. ఆయన మాత్రం శ్రీనివాస్‌ పాత్రకు ఎంత కావాలో.. అంత వరకు చేశారు. సీరియస్‌గా సాగే కథలో కాస్తంత నవ్వులు పంచింది వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌ మాత్రమే. ప్రధమార్ధంలో వీరిద్దరి పాత్రలు కాసేపు కాలక్షేపాన్నిస్తాయి. గిరిజన యువతిగా ఆనంది అందంగా కనిపించింది. నటన పరంగా ఆమెకు ఈ సినిమాలో పెద్దగా ఆస్కారం దొరకలేదు. శ్రీతేజ్‌, కుమరన్‌, రఘుబాబు, సంపత్‌ రాజ్‌ల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు కథ మొదలు పెట్టిన విధానం బాగున్నా.. దాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లడంలో తడబడ్డారు. ప్రజా సమస్యల్ని ప్రభావవంతంగా తెరపైకి తీసుకురాలేకపోయారు. (maredumilli prajaneekam review)  కథానాయకుడిలోని హీరోయిజాన్ని సరైన రీతిలో చూపించలేకపోయారు. అబ్బూరి రవి రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ‘‘56 అక్షరాల తెలుగు ముందు.. 26 అక్షరాల ఇంగ్లిష్‌ ఎప్పుడూ చిన్నదే’’, ‘తప్పు చేసి  శిక్ష పడినా పర్వాలేదు.. సాయం చేసి బాధ పడకూడదు’’, ‘‘మనందరం గొప్ప వాళ్లం అయిపోవాలని అనుకుంటున్నాం.. కానీ, ఎవరూ మనిషి కావడం లేదు’’ వంటి అర్థవంతమైన సంభాషణలు సినిమాలో వినిపించారు. శ్రీచరణ్‌ సంగీతం కథకు తగ్గట్లుగా ఉంది. రాంరెడ్డి ఛాయాగ్రాహణం పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.


బలాలు: 👍అల్లరి నరేష్‌ నటన; 👍ప్రధమార్ధం; 👍అబ్బూరి మాటలు


బలహీనతలు: 👎 కొత్తదనం లేని కథనం; 👎సాగతీత సన్నివేశాలు; 👎ముగింపు


చివరిగా: ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ పోరు అంతగా మెప్పించదు!


గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు