Chiranjeevi: మెగా-మాస్‌ కాంబో మొదలైంది.. చిరు-రవితేజ కలిసిన వీడియో చూశారా?

అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో జోరుమీదున్నారు.

Published : 17 Jul 2022 01:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఆయన కీలక పాత్రలో బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘మెగా 154’ (వాల్తేరు వీరయ్య టైటిల్‌ ఇంకా ఖరారు చేయలేదు) పేరుతో షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ సినిమాలో రవితేజ (Ravi teja) నటిస్తున్నారని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఆయన సెట్స్‌లో అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. కారులో నుంచి దిగి నడుచుకుంటూ వచ్చిన రవితేజ.. చిరు క్యారవాన్‌ దగ్గరకు వచ్చి ‘అన్నయ్యా’ తలుపు కొట్టారు. ‘హాయ్‌ బ్రదర్‌’అంటూ క్యారవాన్‌లో నుంచి చిరు చేయి అందించగా రవితేజ కన్ను కొడుతూ లోపలికి వెళ్లారు. ‘మెగా మాస్‌ కాంబో మొదలైంది’ అంటూ బాబీ ఎండ్‌ కార్డ్‌ వేశారు.

క్లాస్‌ నుంచి మాస్‌ వరకూ అన్ని వర్గాల్లోనూ చిరంజీవికి అభిమానులు ఉన్నారు. ఇక మాస్‌ను మెప్పించేలా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు రవితేజ. వీరిద్దరూ ఒకే తెరపై కనిపిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  రవితేజను ‘బలుపు’, ‘పవర్‌’ చిత్రాల్లో తనదైన శైలిలో చూపించిన బాబీ.. ఇప్పుడు చిరంజీవిని అంతకన్నా ఊరమాస్‌ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తెరపై వీరిద్దరూ కనిపిస్తే థియేటర్లు పూనకాలతో ఊగిపోతాయని అంటున్నారు. శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయికగా నటిస్తున్న ‘మెగా 154’ పూర్తి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా బాబీ తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తీసుకురావాలని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని