Chiranjeevi: ‘సీతారామం’పై మెగాస్టార్‌ ప్రశంసలు..

అపురూప ప్రేమకథా చిత్రంగా విడుదలై సినీ ప్రియుల మన్ననలు అందుకొన్న ‘సీతా రామం’పై (Sita Ramam) అగ్రకథానాయకుడు...

Updated : 28 Aug 2022 21:59 IST

హైదరాబాద్‌: అపురూప ప్రేమకథా చిత్రంగా విడుదలై సినీ ప్రియుల మన్ననలు అందుకొన్న ‘సీతా రామం’పై (Sita Ramam) అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల వర్షం కురిపించారు. ఒక అందమైన ప్రేమకావ్యాన్ని చూసిన అనుభూతి కలిగిందన్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన చిత్రబృందాన్ని అభినందిస్తూ ఓ ట్వీట్‌ పెట్టారు.

‘‘సీతారామం’ చూశాను. ఒక చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి. విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఈ ప్రేమకథని ఆవిష్కరించిన విధానం నాకెంతో నచ్చింది. సినీ ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వనీదత్‌, స్వప్నాదత్‌, ప్రియాంకాదత్‌లకు నా శుభాకాంక్షలు’’ 

‘‘దీన్ని చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడి.. కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్‌ చంద్రశేఖర్‌.. అన్నింటికన్నా ముఖ్యంగా సీతా - రామ్‌లుగా ఆ ప్రేమకథకు ప్రాణం పోసిన మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌.. సూత్రధారి పాత్రని పోషించిన రష్మిక.. ఇలా టీమ్ మొత్తానికీ నా హృదయపూర్వక అభినందనలు. ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం జాతీయస్థాయిలో మరెన్నో అవార్డులు, రివార్డులు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

కథ ఏమిటంటే:

కశ్మీర్‌ నేపథ్యంలో సాగే ఫీల్‌గుడ్‌ ప్రేమకథగా ‘సీతా రామం’ రూపుదిద్దుకుంది. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ అధికారి రామ్ (దుల్కర్‌ సల్మాన్‌) ఓ అనాథ. మానవత్వం ఉన్న వ్యక్తి. ఒక మిషన్‌ తర్వాత అతడి పేరు దేశమంతటా మార్మోగిపోతుంది. ఆల్ ఇండియా రేడియోలో తానొక అనాథ అని చెప్పిన‌ప్పట్నుంచీ.. అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ సీతామ‌హాల‌క్ష్మి ఎవ‌రు? ఆమెని క‌లుసుకునేందుకు హైదరాబాద్‌ వచ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? వీళ్లిద్దరి క‌థ‌తో ఆఫ్రిన్‌(ర‌ష్మిక‌)కు సంబంధ‌మేమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

‘కార్తికేయ 2’ను మెచ్చిన రామ్‌చరణ్‌

నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన ‘కార్తికేయ 2’ చిత్ర బృందాన్ని సోషల్‌ మీడియా వేదికగా రామ్‌చరణ్‌ ప్రశంసించారు. మంచి సినిమాలు ఎప్పుడూ థియేటర్లకు కళను తీసుకొస్తాయని కొనియాడారు. దీనిపై స్పందించిన నిఖిల్‌ రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘చరణ్‌ భాయ్‌.. మీ నుంచి ఈ మాట రావటం మా టీమ్‌ అందరికీ సంతోషకర విషయం. మీ విషెస్‌ మాకు చాలా విలువైనవి’’ అని నిఖిల్‌ పేర్కొన్నారు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. శ్రీకృష్ణతత్వం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా హిందీలోనూ సత్తా చాటింది. ఇటీవలే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని