Chiranjeevi: లూసిఫర్‌ రీమేక్‌ కోసమేనా ఈ లుక్‌?

కొత్త సినిమా అంటే ప్రతి విషయాన్ని ఎంతో రహస్యంగా ఉంచాలని భావిస్తారు దర్శక నిర్మాతలు. అయితే.. కొన్నిసార్లు ఆ విషయాలు అనుకోకుండా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా.. చాలా మంది ఎదురుచూసేది ‘హీరో లుక్‌’ కోసం. తాజాగా..

Published : 19 Jun 2021 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త సినిమా అంటే ప్రతి విషయాన్ని ఎంతో రహస్యంగా ఉంచాలని భావిస్తారు దర్శక నిర్మాతలు. అయితే.. కొన్నిసార్లు ఆ విషయాలు అనుకోకుండా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా.. చాలా మంది ఎదురుచూసేది ‘హీరో లుక్‌’ కోసం. తాజాగా.. అలాంటి సంఘటనే జరిగింది. మెగాస్టార్‌ చిరంజీవి చేయబోతున్న చిత్రం ‘లూసిఫర్‌’ లుక్‌ బయటికి వచ్చేసింది. ‘ఆచార్య’ కోసం నిన్నటి వరకూ పనిచేసిన  చిరు ‘లూసిఫర్‌’ కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఇంతకీ ఆయన లుక్‌ ఎలా లీక్‌ అయిందంటే..

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డి తన స్వగ్రామంలో శిథిలావస్థకు చేరిన కొన్ని దేవాలయాలను పునర్నిర్మించి, మరికొన్నింటిని నూతనంగా నిర్మించారు. ఆ ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి తన రాజకీయ సన్నిహితుడు రఘువీరారెడ్డికి అభినందనలు చెప్తూ ఒక వీడియో పంచుకున్నారు. ఆ వీడియోను రఘువీరారెడ్డి ట్వీటర్‌లో పోస్టు చేశారు. ‘నా రాజకీయ ప్రస్థానంలో అతి తక్కువ కాలంలో ఎంతో ఆప్తుడుగా మారిన వ్యక్తి రఘువీరారెడ్డి. రాయలసీమకు నీళ్లు తేవాలనే పాత్రలో నేను ‘ఇంద్ర’ సినిమాలో నటిస్తే.. దాన్ని రాఘువీరారెడ్డి నిజం చేశారు. దాని ప్రారంభోత్సవానికి నేను ముఖ్య అతిథిగా హాజరవడం ఇంకా గుర్తుంది. ఇప్పుడు ఆయన చేపట్టిన ఈ ఆలయాల కార్యక్రమం విజయవంతం కావాలని ఆయన మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ చిరు అందులో పేర్కొన్నారు.

కాగా.. ఈ వీడియోలో చిరంజీవి కాస్త నెరిసిన గెడ్డంతో పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఈ లుక్‌లోనే ఆయన లూసిఫర్‌గా అలరించనున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మోహన్‌లాల్‌ ప్రధానపాత్రలో వచ్చిన మాతృక ‘లూసిఫర్‌’ భారీ విజయం సాధించింది. దీంతో ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. దానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు సత్యదేవ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ పనులు మొదలయ్యాయి. పట్టాలెక్కించడమే ఆలస్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని