Chiranjeevi: ‘మేము చేయలేనిది ఏదీ లేదు.. మా గమ్యం ఒక్కటే’.. చిరంజీవి ఎమోషనల్‌ పోస్ట్‌

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) కోసం శ్రమించిన సినీ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). సినీ కార్మికుల కష్టాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు.

Published : 15 Jan 2023 09:53 IST

హైదరాబాద్‌: సినీ కార్మికులు తలచుకుంటే చేయలేనిది ఏమీ లేదని.. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలరని అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). సినిమా చిత్రీకరణలో ఎన్నో కష్టాలను వాళ్లు ఇష్టంగా ఎదుర్కొంటారని.. ఎన్నో నెలలపాటు కుటుంబానికి, భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ ప్రేక్షకులను అలరించడానికి శ్రమిస్తారని తెలిపారు. ఈ మేరకు తన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) కోసం శ్రమించిన సినీ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ చిరు ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు.

‘మేమంతా సినీ కార్మికులం.. నిరంతర శ్రామికులం.. కళామతల్లి సైనికులం.. సినిమా ప్రేమికులం.. సినిమానే మా కులం.. మా గమ్యం.. మిమ్మల్ని అలరించటం!’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియోలో సినీ శ్రామికుల శ్రమను చిరు తన కవిత్వంతో తెలియజేశారు. అలాగే ‘వాల్తేరు వీరయ్య’ షూట్‌కు సంబంధించిన మేకింగ్‌ను సైతం ఈ వీడియోలో చూపించారు. సినీ కార్మికుల అకుంటిత కృషి.. ఈ సినిమా విజయానికి ఓ కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సినీ ప్రియుల మది దోచేస్తోంది.

చిరు (Chiranjeevi) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో మాస్‌, యాక్షన్‌ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వింటేజ్‌ చిరుని మరోసారి స్క్రీన్‌పై ఆవిష్కరించిందని అభిమానులు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని