Bangarraju: ‘మేఘాల్లో బంగార్రాజు’.. నాగార్జున, నాగ చైతన్య వినూత్న ప్రచారం

తమ సినిమా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఒక్కో చిత్ర బృందం ఒక్కోలా ప్రచారం చేస్తుంటుంది. ఈ విషయంలో ‘బంగార్రాజు’ టీమ్‌ వినూత్న ప్రయత్నం చేసింది.

Published : 10 Jan 2022 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ సినిమా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఒక్కో చిత్ర బృందం ఒక్కోలా ప్రచారం చేస్తుంటుంది. ఈ విషయంలో ‘బంగార్రాజు’ టీమ్‌ వినూత్న ప్రయత్నం చేసింది. ఓ ప్రత్యేక విమానంలో సినిమా విశేషాల్ని పంచుకుంది. ‘మేఘాల్లో బంగార్రాజు’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రమిది. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా నాగార్జున, నాగ చైతన్య, కృతిశెట్టి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ విశేషాలివీ..

* ‘బంగార్రాజు’ సినిమాలో నటించటం ఎలా అనిపించింది?

నాగార్జున: గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన పాత్రల్ని నా కెరీర్‌ ప్రారంభంలో పోషించా. మధ్యలో అలాంటి బ్యాక్‌డ్రాప్‌ చిత్రాలు తగ్గిపోయాయి. చాలా కాలం తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయన’ చేశా. ఆ సినిమాలో నటించేటపుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. దాని సీక్వెల్‌ ‘బంగార్రాజు’లో మరోసారి మళ్లీ అలాంటి రోల్‌ పోషించటం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ పాత్ర కోసం నేర్చుకున్న యాస, పంచెకట్టు గొప్ప అనుభూతి పంచాయి. ఇలాంటివి నాన్నగారి (అక్కినేని నాగేశ్వరరావు) సినిమా ‘దసరా బుల్లోడు’లో ఎక్కువగా కనిపించేవి.

* నాగచైతన్య.. ఈ సినిమా కోసం మీరెలా సన్నద్ధమయ్యారు?

నాగ చైతన్య: నా కెరీర్‌లో నేను ఇప్పటి వరకూ ఇలాంటి పాత్రల్లో నటించలేదు. చిన్న బంగార్రాజు పాత్ర బాగా నచ్చటంతో ఈ చిత్రంలో నటించా. ఓ వైపు చిన్న బంగార్రాజుగా, మరోవైపు పెద్ద బంగార్రాజుగా నటించటం కొత్తగా అనిపించింది. ఈ సినిమా ప్రారంభానికి ముందు తొలి భాగాన్ని (సోగ్గాడే చిన్నినాయన) ఐదారు సార్లు చూశా. అందులోని యాస, మ్యానరిజం గమనించేవాడ్ని. ఈ సినిమా విషయాకొనిస్తే.. కీలక సన్నివేశాల్లో నేను బాగా మాట్లాడేందుకు నాన్న (నాగార్జున) సంబంధిత డైలాగ్స్‌ని రికార్డ్‌ చేసి ఇచ్చేవారు. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కూడా యాస విషయంలో సహాయం చేశారు. వీరిద్దరి ఇన్‌పుట్స్‌తో నా పాత్ర చాలా బాగా వచ్చింది.

* కృతిశెట్టి.. ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

కృతిశెట్టి: నేనిందులో సర్పంచి నాగలక్ష్మి అనే పాత్ర పోషించా. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే పాత్ర కావడంతో కాస్త కష్టమనిపించింది. కానీ, టీమ్‌ సహకారంతో కొన్ని రోజులకు తేలికగా అనిపించింది. ప్రతిరోజూ షూటింగ్‌ ప్రారంభానికి ముందు సంభాషణలు ఎలా చెప్పాలో, హావభావాలు ఎలా పలకాలో దర్శకుడిని అడిగి తెలుసుకునేదాన్ని.

* పెద్ద బంగార్రాజు, చిన్న బంగార్రాజు.. ఎవరితో కంఫర్ట్‌ అనిపించింది?

కృతిశెట్టి: ఇద్దరూ కంఫర్ట్‌గానే ఉంటారు. అయితే, పెద్ద బంగార్రాజు (నాగార్జున)తో నాకు ఎక్కువ సన్నివేశాలు లేవు.

* నాగార్జున, నాగ చైతన్య చిత్రాల్లో మీకేది బాగా ఇష్టం?

కృతిశెట్టి: నాగార్జునగారు నటించిన సినిమాల్లో నాకు ‘మనం’ బాగా ఇష్టం. నాగ చైతన్య చిత్రాల్లో ‘మజిలీ’.

* పంచెకట్టు విషయంలో తాతగారిని ఫాలో అయ్యారా? నాన్నను అనుసరించారా?

నాగ చైతన్య: ఈ విషయంలో నాన్ననే ఫాలో అయ్యా. సినిమాలో బంగార్రాజు మనవడిని కాబట్టి ఆయన్నే అనుసరించా.

* నాగార్జునతో కలిసి ‘మనం’ సినిమాలోనూ నటించారు. అప్పటికీ ఇప్పటికీ మీరు చూసిన మార్పేంటి?

నాగ చైతన్య: ‘మనం’, ‘బంగార్రాజు’.. రెండూ వేర్వేరు నేపథ్యాల్లో తెరకెక్కాయి. అందులోని పాత్రల తీరూ విభిన్నంగా ఉంటుంది. రెండు సినిమాల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ‘మనం’ చిత్రీకరణ సమయంలో నాన్నతో కలిసి నటించేందుకు కాస్త భయపడేవాడ్ని. ఇప్పుడు ఆ భయం పోయింది.

* ఈ సినిమా సంగీతం గురించి..

నాగ చైతన్య: ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. ప్రతి పాటా విడుదలైన అనతి కాలంలోనే వైరల్‌ అయింది. ఈ చిత్రానికే కాదు అనూప్‌ ప్రతి సినిమాకూ చక్కటి మ్యూజిక్‌ ఇచ్చాడు.

* పెద్ద బంగార్రాజుకి చిన్న బంగార్రాజు ఏమవుతాడు?

నాగార్జున: ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా చూసిన వారందరికీ సమాధానం తెలిసి ఉండొచ్చు. అందులో బంగార్రాజుకి రాము కొడుకు కాబట్టి ఇందులో చిన్న బంగార్రాజు మనవడు.

* అన్నాతమ్ముళ్లుగా నటించే అవకాశం వస్తే చేస్తారా?

నాగార్జున: తప్పకుండా చేస్తాం. అన్నాతమ్ముళ్ల పాత్రలు మా ఇద్దరికీ (నాగార్జున, నాగచైతన్య) సవాలు విసిరేలా ఉంటాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని