Mem Famous: మహేశ్‌బాబు మెచ్చిన ‘మేమ్‌ ఫేమస్’.. ట్రోల్స్‌పై నిర్మాత అసహనం

స్వీయ దర్శకత్వంలో సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. ఈ సినిమాని ప్రముఖ హీరో మహేశ్‌బాబు మెచ్చుకోవడాన్ని పలువురు తప్పుబట్టారంటూ నిర్మాత శరత్‌ చంద్ర అసహనం వ్యక్తం చేశారు.

Published : 25 May 2023 18:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను నిర్మించిన ‘మేమ్‌ ఫేమస్‌’ (Mem Famous) చిత్రాన్ని ప్రముఖ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) మెచ్చుకోవడంపై పలువురు విమర్శలు చేశారంటూ నిర్మాత శరత్‌ చంద్ర (Sharath Chandra) అసహనం వ్యక్తం చేశారు. తమకు సంబంధం లేకపోయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారని, అది మంచి పద్ధతి కాదన్నారు. ఆలోచనలు పాజిటివ్‌గా ఉంటే జీవితం పాజిటివ్‌గా ఉంటుందని, నెగెటివ్‌గా ఆలోచిస్తే లైఫ్‌ నెగెటివ్‌గా ఉంటుందని పేర్కొన్నారు. సుమంత్‌ ప్రభాస్‌ పాజిటివ్‌ దృక్పథం ఉన్న వ్యక్తి అని, అందుకే 23 ఏళ్లకే నటుడు, దర్శకుడిగా మంచి స్థానంలో ఉన్నాడని కొనియాడారు. శుక్రవారం ఈ సినిమా విడుదలకానున్న సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

స్వీయ దర్శకత్వంలో సుమంత్‌ ప్రభాస్‌ (Sumanth Prabhas) హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహరన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ ఎంటర్‌టైనర్‌లో నటీనటులంతా కొత్తవారే. ఇప్పటికే ప్రీమియర్‌ చూసిన మహేశ్‌బాబు.. సినిమా బాగుందంటూ ట్విటర్‌ వేదికగా ‘మేమ్‌ ఫేమస్‌’ టీమ్‌ని ప్రశంసించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసిన శరత్‌ చంద్ర.. సుమంత్‌ ప్రభాస్‌తో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నామని, జీఎంబీ (మహేశ్‌బాబుకి చెందినది) ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మాణంలో భాగస్వామి అయితే బాగుంటుందని మనసులో మాట బయటపెట్టారు. దానికి మహేశ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కొత్త ప్రతిభను, చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో మహేశ్‌ ముందుంటారని కొందరు పొగిడితే, మరికొందరు నెగెటివ్‌గా కామెంట్లు చేశారు. విభిన్నంగా ప్రచారం చేసి, అందరి దృష్టిని ఆకర్షించింది ‘మేమ్‌ ఫేమస్‌’ టీమ్‌. చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమా ప్రమోషన్‌లో భాగమవడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని