Malla Reddy: విలన్‌గా నటించనని చెప్పా

కష్టపడి పనిచేస్తేనే ఫేమస్‌ అవుతామన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి (Malla Reddy). పాలు అమ్ముకునే నేను మంత్రినయ్యానంటే ప్రణాళికతో కష్టపడి పనిచేయడమే కారణం అన్నారు.

Updated : 27 Mar 2023 07:00 IST

- ‘మేమ్‌ ఫేమస్‌’ వేడుకలో మంత్రి మల్లారెడ్డి

కష్టపడి పనిచేస్తేనే ఫేమస్‌ అవుతామన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి (Malla Reddy). పాలు అమ్ముకునే నేను మంత్రినయ్యానంటే ప్రణాళికతో కష్టపడి పనిచేయడమే కారణం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 65 శాతం యువత ఉందని, ఇప్పటి నుంచే శ్రమించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘మేమ్‌ ఫేమస్‌’ (Mem Famous) సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమంత్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తూ... దర్శకత్వం వహించిన చిత్రమిది. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. అనురాగ్‌ రెడ్డి, శరత్‌చంద్ర, చంద్రు మనోహర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్‌ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టీజర్‌ విడుదల అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘‘కథానాయకుడు సుమంత్‌ ప్రభాస్‌ స్మార్ట్‌గా ఉన్నాడు. తెలంగాణ ప్రభాస్‌ తను. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా తర్వాత తనతో నేనే సినిమా నిర్మిస్తా. టీజర్‌ చాలా బాగుంది. ఛాయ్‌ బిస్కెట్‌ సంస్థ మంచి అభిరుచితో సినిమాలు నిర్మిస్తోంది. ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుంది. మొన్ననే హరీష్‌శంకర్‌ మా ఇంటికి వచ్చి పవన్‌కల్యాణ్‌తో తీస్తున్న సినిమాలో విలన్‌గా నటించమని గంటన్నర బతిమాలాడాడు. కానీ నేను విలన్‌గా నటించనని చెప్పా’’ అన్నారు. సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ ‘‘కాలేజీలో ఉన్నప్పుడు సరదాగా పిల్ల పిల్లగాడు అనే వెబ్‌సిరీస్‌ చేశాం. ఆ తర్వాత అనుకోకుండా నిర్మాత అనురాగ్‌ నుంచి కాల్‌ వచ్చింది. అది నా జీవితాన్ని మార్చింది. మేం సినిమా చేయగలమని నమ్మి, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ సినిమా చేయించారు. జూన్‌ 2న ఆహ్లాదకమైన సినిమాని చూపిస్తాం’’ అన్నారు. ‘‘మేం నిర్మించిన ‘రైటర్‌ పద్మభూషణ్‌’కి మంచి ఆదరణ లభించింది. అంతే ఉత్సాహంతో ఈ సినిమా చేశాం. చాలా బాగుంటుంది. థియేటర్లలో చూస్తే మజా వస్తుంద’’న్నారు నిర్మాతలు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని