Meter: అప్పుడే తెలుగు నేర్చుకున్నా

‘మీటర్‌’ చిత్రంతో తెలుగు తెరపైకి అడుగు పెడుతున్న తమిళ సోయగం అతుల్య రవి. కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాని రమేష్‌ కడూరి తెరకెక్కించారు.

Updated : 29 Mar 2023 07:16 IST

‘మీటర్‌’ చిత్రంతో తెలుగు తెరపైకి అడుగు పెడుతున్న తమిళ సోయగం అతుల్య రవి. కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాని రమేష్‌ కడూరి తెరకెక్కించారు. ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో ముచ్చటించిందామె.

‘‘తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టాలని మూడేళ్లుగా అనుకుంటున్నా. కొవిడ్‌ టైమ్‌లో నాలుగైదు ప్రాజెక్ట్‌లు వచ్చాయి. కానీ, అవేమీ సరైన లాంచ్‌గా అనిపించలేదు. ఆ తర్వాత ‘మీటర్‌’ కథ నా దగ్గరకొచ్చింది. స్క్రిప్ట్‌ విన్నప్పుడే ఇది కచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నా. దీనికి తోడు మైత్రీ మూవీస్‌ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ నిర్మిస్తుండటంతో మరింత ఆనందంగా అనిపించింది. నిజానికి కథ వినడానికి ముందు దీంట్లో మైత్రీ సంస్థ భాగమవుతుందని నాకు తెలియదు. కిరణ్‌ అబ్బవరం హీరో అని మాత్రమే తెలుసు. నేనప్పటికే తన ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’ చిత్రం చూశా. అది బాగా నచ్చింది’’.

* ‘‘మీటర్‌’ పక్కా కమర్షియల్‌ చిత్రం. తండ్రి సెంటిమెంట్‌ నేపథ్యంగా సాగుతుంది. ఇందులో నేను మగవాళ్లను ద్వేషించే యువతి పాత్రలో కనిపిస్తా. సీరియస్‌గా కనిపిస్తూనే వినోదాత్మకంగా సాగే పాత్ర ఇది. నటనకు ఎంతో ఆస్కారముంది. నా నిజ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రం చేస్తున్న సమయంలోనే సెట్లోని సిబ్బందితో మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నా. ఇందులో కిరణ్‌ పాత్ర చాలా ఉల్లాసంగా ఉంటుంది. నాకు తనకు మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఆ జోన్‌లోనే ఉంటాయి’’.

* ‘‘నటిగా నాకంటూ ఎలాంటి పరిమితులు లేవు. అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. ముఖ్యంగా మంచి ఆహ్లాదకరమైన ప్రేమకథల్లో నటించాలనుంది. అలాగే తెలుగులో అందరు స్టార్లతో పని చేయాలనుంది. ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు వింటున్నా. ఓ సినిమా చర్చల దశలో ఉంది. తమిళంలో హరీష్‌ కల్యాణ్‌ సరసన ‘డీజిల్‌’లో నటిస్తున్నా’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని