Meter Movie Review: రివ్యూ: మీటర్
Meter Movie Review: కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మీటర్’ ఎలా ఉందంటే?
Meter Movie Review: చిత్రం: మీటర్; నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, పవన్ తదితరులు; సంగీతం: సాయి కార్తీక్; ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్, సురేష్ సరంగం; రచన, దర్శకత్వం: రమేష్ కదూరి; నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు; సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్; విడుదల తేదీ: 07-04-2023
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న కథానాయకుడు కిరణ్ అబ్బవరం (kiran abbavaram). ఇటీవలే ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో బాక్సాఫీస్ ముందు సత్తా చాటారు. ఇప్పుడీ జోష్‌లోనే ‘మీటర్’తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించారు. కొత్త దర్శకుడు రమేష్ తెరకెక్కించిన చిత్రమిది. పాటలు, ప్రచార చిత్రాలు కమర్షియల్ హంగులతో ఆకట్టుకునేలా ఉండటం.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సమర్పిస్తున్న సినిమా కావడం సినీప్రియుల దృష్టి దీనిపై పడింది. మరి ఈ ‘మీటర్’ కథేంటి?(Meter movie review) ప్రేక్షకుల్ని ఏమేర మెప్పించింది?
కథేంటంటే: అర్జున్ కల్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి నిజాయితీ గల కానిస్టేబుల్. వృత్తిపట్ల ఎంత నిబద్ధతగా ఉన్నా అవినీతిపరులైన ఉన్నతాధికారుల కారణంగా తన కెరీర్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. పైగా తన నిజాయితీ వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. అందుకే తన కొడుకును ఎస్సైను చేసి పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని కలలుకంటాడు. కానీ, అర్జున్‌కు పోలీస్ అవ్వడం అసలు ఇష్టం ఉండదు. అయితే తండ్రి ఇష్టాన్ని కాదనలేక పోలీస్ సెలక్షన్స్‌కు హాజరై.. ఏదోరకంగా అందులో ఫెయిలవుతూ వస్తుంటాడు. కానీ, ఓసారి అనుకోకుండా ఆ సెలక్షన్స్ పాసై ఎస్సై అయిపోతాడు. దీంతో ఆ పోలీస్ ఉద్యోగం నుంచి బయటకు రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలోనే హోంమంత్రి కంఠం బైర్రెడ్డి (పవన్) వల్ల అర్జున్ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. మరి అదేంటి? బైర్రెడ్డి వల్ల అతనెలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు?(Meter movie review) ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చేందుకు బైర్రెడ్డి చేసిన కుంభకోణం ఏంటి? దాని వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థ ఎలా ప్రభావితమైంది? దాన్ని అర్జున్ ఎలా చేధించాడు? అన్నది మిగతా కథ.
ఎలా ఉందంటే: ఫక్తు వాణిజ్య చిత్రాలంటేనే కొత్తదనానికి ఆమడ దూరంలో కనిపిస్తాయి. విజిల్స్ వేయించే ఐదు ఫైట్లు.. ఉర్రూతలూగించేలా నాలుగు మాస్ పాటలు.. ఓ చిన్న లవ్ స్టోరీ.. దానికి తోడు కథలో కాస్త సంఘర్షణ.. ఇవే వాటిలో కనిపించే రెగ్యులర్ మసాలా దినుసులు. ఇంతకు మించి మరే కొత్తదనానికి అందులో ఆస్కారముండదు. ‘మీటర్’ కూడా ఈ కోవకు చెందినదే. (Meter movie review) కొత్తదనం ఇసుమంతైనా కనిపించనీయకుండా ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించిన రొటీన్ కమర్షియల్ చిత్రమిది. ఇష్టం లేని పోలీస్ ఉద్యోగం చేస్తూ ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు.. ఒక బాధాకరమైన సంఘటన వల్ల పవర్‌ఫుల్ పోలీస్‌గా మారితే ఎలా ఉంటుందనేది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. దీనికి ఓ పరమ రొటీన్ ప్రేమకథను.. పేలవమైన తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ను జోడించి కథను నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందుకే ఆరంభం నుంచే ప్రేక్షకుడు ఈ కథతో ప్రయాణించలేని పరిస్థితి కనిపిస్తుంది. (Meter movie review) దీనికి తోడు ఈ కథ కిరణ్ ఇమేజ్‌కు మించిన స్థాయిలో ఉండటంతో ఇందులోని యాక్షన్ ఘట్టాలు, ఎలివేషన్లు మరీ అతిగా అనిపిస్తాయి.
సినిమా తొలి పదిహేను నిమిషాలు పోలీస్ అవ్వకుండా ఉండేందుకు అర్జున్ చేసే ప్రయత్నాలతో సాగుతుంది. ఆ తర్వాత నుంచి విరామం వరకు హీరోయిన్ లవ్ ట్రాక్‌తో, ఎస్సై ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యేందుకు అర్జున్ చేసే సిల్లీ ప్రయత్నాలతో నెమ్మదిగా సాగిపోతుంటుంది. వీటిలో చాలా ఎపిసోడ్లు సహనానికి పరీక్షలా ఉంటాయి. ముఖ్యంగా మగవాళ్లను ద్వేషించే యువతిగా అతుల్య ట్రాక్.. యాసిడ్ బాటిల్‌తో ఆమె చేసే హంగామా మరీ అతిగా అనిపిస్తుంది. ఇక పోలీస్ ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యేందుకు అర్జున్ చేసే ప్రయత్నాలూ మరీ సినిమాటిక్‌గా ఉంటాయి. విరామానికి ముందు హోంమంత్రి బైర్రెడ్డి పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అక్కడి నుంచే కథలో కాస్త వేగం పెరిగినట్లు అనిపిస్తుంది. (Meter movie review) కానీ, దాన్ని దర్శకుడు సమర్థంగా వినియోగించుకోలేదు. బైర్రెడ్డికి అర్జున్‌కు మధ్య సాగే వార్ ఏమాత్రం ఆసక్తిరేకెత్తించదు. అర్థరహిత సంభాషణలు, బలవంతంగా ఇరికించిన పాటలు, యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. కథకు ఆయువుపట్టుగా నిలవాల్సిన ఫాదర్ సెంటిమెంట్ పూర్తిగా తేలిపోయింది. పతాక సన్నివేశాలు పరమ రొటీన్‌గా ఊహలకు తగ్గట్లుగా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే: అర్జున్ కల్యాణ్ పాత్రలో కిరణ్ అబ్బవరం చక్కగా ఒదిగిపోయారు. కానీ, నటుడిగా తనకు సవాల్ విసిరే అంశాలు ఇందులో ఏమీ లేవు. అతుల్య తెరపై అందంగా కనిపించింది. నటన పరంగా ఆమె పాత్రకు ఆస్కారం లేదు. ప్రతినాయకుడిగా కనిపించిన పవన్ రొటీన్ విలనిజాన్నే చూపించారు. (Meter movie review) సప్తగిరి, పోసాని కృష్ణమురళీల పాత్రలు అక్కడక్కడా కాసేపు నవ్విస్తాయి. మిగిలిన నటీనటులంతా పరిధి మేరకు చేశారు. రమేష్ ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. కథనం ఏమాత్రం ఆసక్తికరంగా సాగలేదు. అలాగే సినిమాలోని ఏ పాత్రనూ సమర్థవంతంగా తీర్చిదిద్దుకోలేదు. సాయికార్తీక్ అందించిన నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. ‘చమ్మక్ పోరీ’ మినహా మిగిలిన పాటల్లో ఏ ఒక్కటీ గుర్తుంచుకునేల లేదు. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు: + కిరణ్ నటన; + విరామ సన్నివేశాలు
బలహీనతలు: - రొటీన్ కథ, స్క్రీన్‌ప్లే; - పేలవమైన లవ్ ట్రాక్, - ద్వితీయార్ధం
చివరిగా: ‘మీటర్’లో మేటర్ లేదు.. రొటీన్ యాక్షన్ డ్రామా! (Meter movie review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
-
Motkupalli: జగన్.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి
-
Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్ ‘యువగళం’ తిరిగి ప్రారంభం..!
-
Yanamala: ప్రభుత్వానివి చందమామ కథలు.. సీఐడీవి చిలకపలుకులు: యనమల
-
UPPAL Stadium: ఆటతో అదిరేలా.. ఉప్పల్ ఊగేలా!
-
Kushi Ott Release: ఓటీటీలోకి ‘ఖుషి’ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?