Meter: థియేటర్లో మాస్‌ ప్రేక్షకుల విజిల్సే

అసలు సిసలు వాణిజ్య ప్రధానమైన చిత్రం మా ‘మీటర్‌’ అన్నారు కిరణ్‌ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమిది. అతుల్య రవి కథానాయిక.

Updated : 06 Apr 2023 07:04 IST

అసలు సిసలు వాణిజ్య ప్రధానమైన చిత్రం మా ‘మీటర్‌’ (Meter) అన్నారు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమిది. అతుల్య రవి కథానాయిక. రమేష్‌ కడూరి దర్శకత్వం వహించారు. చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మించారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ సమర్పకులు. ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. దర్శకులు గోపీచంద్‌ మలినేని, బుచ్చిబాబు సానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘‘మాస్‌ ప్రేక్షకుడికి ఎలాంటి అంశాలు ఇష్టమో అవి ఇందులో ఉన్నాయి. నన్ను కొత్త కోణంలో చూపించారు దర్శకుడు. థియేటర్లలో విజిల్స్‌ కొట్టి గోల చేసి ఆస్వాదించే సినిమా ఇది. సెలవుల్లో వస్తున్న ఈ సినిమా అందరికీ వినోదం పంచుతుంద’’న్నారు. గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ ‘‘దర్శకుడు రమేష్‌ ‘క్రాక్‌’ సినిమాకి నా దగ్గర సహ దర్శకుడిగా పనిచేశాడు. తనకి ఈ సినిమా మంచి ఆరంభం అవుతుంది. మంచి నిర్మాతలు దొరకడం తన అదృష్టం. కిరణ్‌ అబ్బవరం ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి, ఎదుగుతున్న కథానాయకుడు. తన బలం సంభాషణలు చెప్పడమే. చాలా సహజంగా ఉంటుంది ఆయన నటన. అతుల్య రవి అందంగా ఉంది’’ అన్నారు. బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘‘కథానాయకుడిగా కిరణ్‌ ఈ సినిమాతో మరో స్థాయికి చేరుకుంటాడు.  తపన ఉన్న దర్శకుడు రమేష్‌. మాస్‌ మీటర్‌తో ఆలోచించే చెర్రీకి ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ ‘‘సినిమా చూశా. ఈ వేసవిలో మంచి వాణిజ్య చిత్రం అవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి, గోపీనాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని