Roja: కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలి: మంత్రి రోజా

కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలని ఏపీ మంత్రి రోజా అన్నారు.ప్రజల్లోనూ మార్పు వచ్చిందని, ప్రజల కోసం నాయకులు మారాలని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

Updated : 07 Dec 2022 21:34 IST

హైదరాబాద్‌: కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలని ఏపీ మంత్రి రోజా అన్నారు. రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘శాసనసభ’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల్లోనూ మార్పు వచ్చిందని, ప్రజల కోసం నాయకులు మారాలని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

‘‘మావాడు, మా కులం అని ఓట్లు వేసి, ఆ తర్వాత అతడు ఏమీ చేయలేదని బాధపడే కన్నా, మంచి వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకుంటే వాళ్లకు మంచి జరుగుతుంది. కాబట్టి, కులం, మతం ప్రాంతాలను పక్కన పెట్టండి. మీ ప్రాంతంలో ఎవరు నిలబడ్డారు? వారిలో ఎవరు బెస్ట్‌, ఎవరికి ఓటు వేస్తే మంచి చేస్తారనేది ఆలోచించండి. ఓటు వేసిన దగ్గరి నుంచి మళ్లీ ఓటు వేయించుకునే వరకూ ఎమ్మెల్యేలు, ఎంపీలు గడప గడపకూ వెళ్లి ఏం ఇచ్చారో కనుక్కోవాలి. గెలిచిన ఐదేళ్లు ఏసీ రూముల్లో కూర్చొనే రోజులు పోయాయి. ఇప్పటికే మార్పు మొదలైంది. రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి’’ అని రోజా అన్నారు.

‘‘ప్రతి వాడికి యుద్ధంలో గెలవాలని ఉంటుంది. కానీ, ఒక్కడే గెలుస్తాడు. వాడినే వీరుడు అంటారు’ అనే డైలాగ్‌ వినగానే జగన్మోహన్‌రెడ్డిగారే గుర్తొచ్చారు. రాజకీయాలు ప్రతిరోజూ యుద్ధంలాంటిది. ఆ యుద్ధంలో ప్రజల మనసును ఎవరు గెలుచుకుంటారో వాళ్లేకే శాసనసభలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. శాసనసభ అనగానే నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఇది ఫస్ట్‌ పాన్‌ ఇండియా పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ అని చెబుతున్నారు. పొలిటికల్‌ చిత్రాలకు సంభాషణలు చాలా ముఖ్యం. రాఘవేంద్రరెడ్డి చక్కని సంభాషణలు అందించారు. కేజీయఫ్‌లాంటి భారీ బడ్జెట్‌ చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు కొత్తవారిని ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో ఈ సినిమాకు అద్భుత సంగీతం అందించిన రవి బస్రూర్‌కు సెల్యూట్‌ చేస్తున్నా. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని