Mission Majnu Review: రివ్యూ: మిషన్‌ మజ్ను

Mission Majnu Review: సిద్ధార్థ్‌ మల్హోత్ర స్పై ఏజెంట్‌గా నటించిన ‘మిషన్‌ మజ్ను’ ఎలా ఉందంటే?

Updated : 20 Jan 2023 16:26 IST

Mission Majnu review; చిత్రం: మిషన్‌ మజ్ను; నటీనటులు: సిద్ధార్థ్‌ మల్హోత్ర, రష్మిక, పర్మీత్‌ సేథి, షరీబ్‌ హస్మి, మిర్‌ సార్వర్‌, కుముద్‌ మిశ్రా తదితరులు; సంగీతం: కేతన్‌ సోధ; సినిమాటోగ్రఫీ: బిజితీష్‌; ఎడిటింగ్‌: నితిన్‌ బైద్‌, సిద్ధార్థ్‌ ఎస్‌ పాండే; రచన: అసీమ్‌ అరోరా, సుమిత్‌ భతేజ, పర్వీన్‌ షేక్‌; దర్శకత్వం: శంతను భాగ్చి; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

ఒకవైపు థియేటర్‌లో సినిమాలు సందడి చేస్తున్నా, ఇప్పటికీ పలు చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఓటీటీ సంస్థలు సైతం అలాంటి చిత్రాలను కాస్త అధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నాయి. అలా థియేటర్‌లో విడుదల కావాల్సిన బాలీవుడ్‌ మూవీ ‘మిషన్‌ మజ్ను’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ మొదలైంది. ఫిక్షనల్‌ స్పైథ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? (Mission Majnu review) స్పై ఏజెంట్‌గా సిద్ధార్థ్‌ ఎలా నటించాడు? రష్మిక నటించిన తొలి బాలీవుడ్‌ సినిమా ఎలా ఉంది?

కథేంటంటే: ‘లాఫింగ్‌ బుద్ధ’ పేరుతో భారత్‌ అణుబాంబును పరీక్షించడం ప్రపంచదేశాలతో పాటు, పాకిస్థాన్‌కు కంటగింపుగా మారుతుంది. దీంతో అక్రమంగా ఓ న్యూక్లియర్‌ బాంబును తయారు చేయడం మొదలుపెడుతుంది. కానీ, అది పాకిస్థాన్‌ ఎక్కడ తయారు చేస్తోందో ఎవరికీ తెలియదు. దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి. ఎలాంటి విషయాన్నైనా తన చాకచక్యంతో బయటకు తీసుకురాగల భారత స్పై ఏజెంట్‌ అమన్‌ దీప్‌ అజిత్‌ పాల్‌ సింగ్‌ అలియాస్‌ తారిఖ్‌ (సిద్ధార్థ్‌ మల్హోత్ర) (Sidharth Malhotra)ను రంగంలోకి దింపుతుంది. ఆ న్యూక్లియర్‌ బాంబును కనిపెట్టడానికి  తారిఖ్‌ చేపట్టిన మిషన్‌ ఏంటి? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏవి? నస్రీన్‌ (రష్మిక) ఎవరు? చివరకు పాకిస్థాన్‌ తయారు చేస్తున్న న్యూక్లియర్‌ బాంబు స్థావరాన్ని తారీఖ్‌ కనిపెట్టాడా? (Mission Majnu review) తెలియాలంటే ‘మిషన్‌ మజ్ను’  (Mission Majnu) చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఇటీవల కాలంలో స్పై థ్రిల్లర్‌ మూవీలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఓటీటీ అందుబాటులోకి వచ్చాక, ఇతర భాషల్లో ఉన్న ఈ తరహా మూవీలను చూసేందుకు నెటిజన్లు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. కార్తి ‘సర్దార్’, జైన్‌ఖాన్‌ ‘ముక్బిర్‌: ది స్టోరీ ఆఫ్‌ స్పై’ ఈ కోవలోకి చెందినవే. థియేటర్‌లో విడుదల కావాల్సిన ‘మిషన్‌ మజ్ను’ ఇప్పుడు నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. శత్రు దేశం చేసే కుట్రలను తెలుసుకుని ఆ సమాచారాన్ని మాతృదేశానికి అందించడమే గూఢచారుల పని. (Mission Majnu review) ఈ సినిమా కూడా అదే తరహాలో సాగుతుంది. తండ్రిపై పడిన దేశద్రోహి ముద్రను చెరిపేందుకు శత్రుదేశంలో గూఢచారిగా పనిచేయాలని తారిఖ్‌ నిర్ణయించుకోవడం, అంధురాలైన నస్రీన్‌ను వివాహం చేసుకోవడం ద్వారా అక్కడి వారి సానుభూతి పొందడం తదితర సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. అయితే, తారీఖ్‌ ‘మిషన్‌ మజ్ను’ కోసం రంగంలోకి దిగిన తర్వాతే అసలు కథ ప్రారంభమవుతుంది. ఆసక్తిగా ఉత్కంఠగా సాగాల్సిన మిషన్‌ను సగటు స్పై థ్రిల్లర్‌లా దర్శకుడు తీర్చిదిద్దాడు. శత్రుదేశం తయారు చేసే న్యూక్లియర్‌ బాంబు ప్లాంట్‌ ఎక్కడుందో తెలుసుకునేందుకు తారిఖ్‌ ఏం చేస్తాడు? ఎవరికీ దొరకకుండా సమాచారాన్ని భారత్‌కు ఎలా చేరవేస్తాడు? తదితర అంశాలు కొత్తగా చూసేవారికి కాస్త ఉత్కంఠ కలిగించినా, ఇప్పటికే ఈ తరహా సినిమాలు చూసేవారికి మాత్రం పెద్ద థ్రిల్‌ ఏమీ అనిపించవు. శత్రుదేశం కుట్రను కచ్చితంగా కథానాయకుడు ఛేదించాలి కాబట్టి, అది ఎలా అన్నది మాత్రమే ఆసక్తి కలిగించే అంశం. (Mission Majnu review) దర్శకుడు శంతను భాగ్చి ఈ విషయంలో పెద్దగా మెరుపులేమీ మెరిపించలేదు. ఒక సగటు స్పై థ్రిల్లర్‌లా సినిమాను చుట్టేశారు. తెలుగులో ‘గూఢచారి’లాంటి సినిమాలను మనం ఇప్పటికే చూశాం. పతాక సన్నివేశాలు కాస్త థ్రిల్‌ను పంచినా, చివరకు ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది.

ఎవరెలా చేశారంటే: ‘షేర్షా’తో మెప్పించిన సిద్ధార్థ్‌ మల్హోత్ర స్పై ఏజెంట్‌ తారీఖ్‌గానూ చక్కగా నటించాడు. దేశద్రోహి కొడుకు అంటూ అందరూ విమర్శిస్తుంటే ఆ బాధను భరిస్తూ దేశం కోసం పనిచేసే వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. అయితే, భావోద్వేగాలను రాబట్టుకోవడంలో మాత్రం దర్శకుడు శ్రద్ధ పెట్టలేదు. ఈ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రష్మిక అంధురాలు నస్రీన్‌గా తన పాత్ర పరిధి మేరకు నటించింది. సినిమా మొత్తం కథానాయకుడు చుట్టూనే తిరుగుతుండటంతో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్‌ లేదు. రమణ్‌ సింగ్‌ అలియాస్‌ మౌల్విగా కుముద్‌ మిశ్రా, అస్లాం ఉస్మానియాగా షరీబ్‌ హష్మి, రా ఆఫీసర్‌గా జాకీర్‌ హుస్సేన్‌ తమ నటనతో మెప్పించారు. (Mission Majnu review) కథానాయకుడి పాత్రకు సమానంగా వాటిని తీర్చిదిద్దారు. తనిష్‌ భాగ్చి, రోచక్‌ కోహ్లీ, తురాజ్‌ సంగీతం ఫర్వాలేదు. కేతన్‌ సోది నేపథ్య సంగీతం బాగుంది. నితిన్‌ బైద్‌, సిద్ధార్థ్‌ పాండే ఎడిటింగ్‌ షార్ఫ్‌గా ఉంది. నిడివి రెండు గంటలు కావడం కాస్త ఉపశమనం. చివరిగా దర్శకుడు శంతన్‌ భాగ్చి ‘మిషన్‌ మజ్ను’ను ఆశించిన స్థాయిలో మాత్రం తీర్చిదిద్దలేదు. ఒక సగటు థ్రిల్లర్‌గా మాత్రమే చూపించారు. అందుకే థియేటర్‌లో విడుదల కావాల్సిన సినిమా రెండుసార్లు వాయిదా పడి, నేరుగా ఓటీటీలో వచ్చింది. ఏదైనా స్పై థ్రిల్లర్‌ చూడాలనుకుంటే ‘మిషన్‌ మజ్ను’ వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు.

బలాలు: + సిద్ధార్థ్‌ మల్హోత్ర, ఇతర నటులు + కొన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ + పతాక సన్నివేశాలు

బలహీనతలు: -రొటీన్‌ స్పై డ్రామా, - దర్శకత్వం

చివరిగా: ఇదొక ఆర్డినరీ ‘మిషన్‌’ (Mission Majnu review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని