Rajamouli: సర్‌.. మీ పోస్ట్‌ చూసి మా అన్నయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు: రాజమౌళి

అమెరికా దిగ్గజ సంగీతకారుడు రిచర్డ్‌ కార్పెంటర్‌ (Richard Carpenter) ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి కీరవాణి (Keeravani) కన్నీళ్లు పెట్టుకున్నట్లు దర్శకుడు రాజమౌళి (Rajamouli) చెప్పారు. తమ కుటుంబానికి ఇవి అపురూప క్షణాలని పేర్కొన్నారు.

Published : 16 Mar 2023 12:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా దిగ్గజ సంగీతకారుడు రిచర్డ్‌ కార్పెంటర్‌ (Richard Carpenter) ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి తన సోదరుడు కీరవాణి (Keeravani) ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెలిపారు. ఆస్కార్‌ క్యాంపెయిన్‌ మొత్తం ప్రశాంతంగా ఉన్న కీరవాణి రిచర్డ్‌ సందేశం చూసిన వెంటనే ఉద్వేగానికి లోనైనట్లు జక్కన్న చెప్పారు. ‘‘సర్‌.. ఆస్కార్‌ ప్రచారంలో మొత్తం అన్నయ్య ఎలాంటి భావోద్వేగాన్ని ప్రదర్శించలేదు. ఆస్కార్‌ గెలుపొందడానికి ముందు, ఆ తర్వాత కూడా ఆయన ఏ విధమైన ఉద్వేగాన్నీ బయటపెట్టలేదు. కానీ, మీ పోస్ట్‌ చూశాక ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మా కుటుంబానికి ఇదొక మధురానుభూతి’’ అని రాజమౌళి పేర్కొన్నారు.

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు...’ పాటకుగాను ఆస్కార్‌ (Oscars 2023) గెలుపొందిన అనంతరం కీరవాణి మాట్లాడుతూ నేను రిచర్డ్‌ కార్పెంటర్‌ సాంగ్స్‌ వింటూ పెరిగాను అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రిచర్డ్‌ ఫేమస్‌ సాంగ్‌ ‘టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌...’ను తనదైన శైలిలో మార్చి స్టేజ్‌పై కీరవాణి పాడి వినిపించారు. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన రిచర్డ్‌.. కీరవాణి, చంద్రబోస్‌కు అభినందనలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. తన కుమార్తెలతో కలసి ఆయన ‘టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌...’ పాటను ఆలపిస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి కంగ్రాట్స్‌ చెప్పారు. ఆ పోస్ట్‌పై కీరవాణి ఆనందం వ్యక్తం చేశారు. కార్పెంటర్‌ పోస్ట్‌ చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని