వారిలో ధైర్యాన్ని నింపండి: ఎం.ఎం.కీరవాణి

కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానానికి ముందుకు రావాలంటూ పిలుపునిచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మరో వ్యాధిపైనా అవగాహన

Updated : 22 Sep 2020 14:56 IST

హైదరాబాద్‌: కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానానికి ముందుకు రావాలంటూ పిలుపునిచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మరో వ్యాధిపైనా అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చారు. ఇటీవలే తనకు మల్టిపుల్‌ స్కెలెరోసిస్‌ అనే వ్యాధి గురించి తెలిసిందనీ, యోగా చేయడం, సంగీతం వినడం వంటి వాటితో ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చనీ అన్నారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను తన ట్విటర్‌లో పంచుకున్నారు.

‘‘ఇటీవలే ఎం.ఎస్‌.(మల్టిపుల్‌ స్కెలెరోసిస్‌‌) అనే వ్యాధి గురించి తెలిసింది. ఇది ఎవరికైనా, ఎప్పుడైనా, ఏ వయసు వారికైనా రావచ్చు. ఇది శరీరానికీ మెదడుకూ మధ్య ఉన్న అనుసంధాన వ్యవస్థను దెబ్బతీస్తుంది. మల్టిపుల్‌ స్కెలెరోసిస్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంతో కృషి చేస్తోంది. అంతేకాదు, ఈ వ్యాధి గురించి ప్రభుత్వానికి తెలిసేలా దీనిపై అవగాహన ఉన్న వారితో కలిసి తన గళాన్ని వినిపిస్తోంది. ఈ సందర్భంగా అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. ఈ సమస్యతో బాధపడే వారికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఎంతో అవసరం. యోగా సాధన, శ్రావ్యమైన సంగీతం ఇలా అన్ని మార్గాల్లోనూ వారిలో మనో ధైర్యాన్ని నింపేలా ప్రోత్సహించండి.

ఇటీవల కరోనాని జయించిన ఎం.ఎం. కీరవాణి తన కుమారుడితో కలిసి రెండోసారి ప్లాస్మా దానం చేశారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదనీ, అందరూ ధైర్యంగా అవసరమైన వారికి ప్లాస్మా దానం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. కీరవాణి ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తోపాటు, పవన్‌ కల్యాణ్‌-క్రిష్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని