modern love hyderabad review: రివ్యూ: మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌

మోడ్రన్‌ లవ్‌’కు వీరి చెప్పిన కొత్త అర్థం ఏంటి? ఈ సిరీస్‌ ఎలా ఉంది?

Published : 09 Jul 2022 01:47 IST

వెబ్‌సిరీస్‌: మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌; నటీనటులు: రేవతి, నిత్యామేనన్‌, ఆది పినిశెట్టి, రీతూవర్మ, సుహాసిని, నరేశ్‌, మాళవిక నాయర్‌, అభిజీత్‌, నరేశ్‌ అగస్త్య, కొమాలి ప్రసాద్‌, ఉల్కా గుప్త తదితరులు; సినిమాటోగ్రఫీ: సంగ్రామ్‌ గిరి, ఆదిత్య జావేద్‌, సాయి ప్రకాశ్‌, ఉమ్మడిసింగు; ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, రవితేజ గిరిజాల, హరి శంకర్‌ తమ్మినాన; రచన: నగేశ్‌ కుకునూరు, శశి సుడిగాల, బషీష్‌ కపూర్‌; దర్శకత్వం: నగేశ్‌ కుకునూరు, వెంకటేశ్‌ మహా, ఉదయ్‌ గిరిజాల, దేవిక; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ఇతర దేశాల్లో, ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాల ఆధారంగా తెరకెక్కిన తెలుగు చిత్రాలు ఎన్నో. మన నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసుకున్నప్పుడే అవి ప్రేక్షకుల హృదయానికి మరింత దగ్గరవుతాయి. అమెరికన్‌ సిరీస్‌ ‘మోడ్రన్‌ లవ్’ తరహాలో తెరకెక్కిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సిరీస్‌ ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌’. దర్శకులు నగేశ్‌ కుకునూరు, వెంకటేశ్‌ మహా కలిసి ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మరి ‘మోడ్రన్‌ లవ్‌’కు వీరు చెప్పిన కొత్త అర్థం ఏంటి? ఈ సిరీస్‌ ఎలా ఉంది?

1.మై అన్‌లైక్లీ పాండమిక్‌ డ్రీమ్స్‌ పార్టనర్‌

నూర్‌ హుస్సేన్‌ (నిత్యా మేనన్‌) తల్లి మెహరున్నీసా (రేవతి)తో విభేదాల కారణంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది. కొన్నిరోజులకు కాలికి గాయమై మోకాలికి శస్త్ర చికిత్స చేయడంతో ఆమెను చూసేందుకు నూర్‌ ఇంటికి తల్లి మోహరున్నీసా వస్తుంది. అదే సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటిస్తారు. దీంతో నూర్‌ ఇంట్లోనే మెహరున్నీసా ఉండిపోవాల్సి వస్తుంది. మనస్పర్థలతో మాట్లాడుకోవటం మానేసిన తల్లీకూతుళ్ల మధ్య బంధం ఎలా బలపడింది? అందుకు చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి? ఈ ఎపిసోడ్‌లో చూపించారు. తల్లీకూతుళ్లుగా రేవతి, నిత్యామేనన్‌ చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. వాళ్లిద్దరి మధ్య బంధం పెరగడానికి హైదరాబాద్‌ ఫుడ్‌ను వాడుకొన్న తీరు బాగుంది. సన్నివేశాలు హృద్యంగా ఉన్నా, కాస్త నెమ్మదిగా సాగుతాయి. పెద్ద ట్విస్ట్‌లేమీ ఉండవు.

2. ఫుజీ, పర్పుల్‌ అండ్‌ ఫుల్‌ ఆఫ్‌ థ్రోన్స్‌

అనుకోకుండా గుడిలో పరిచయమై లివింగ్‌ రిలేషన్‌లో ఉంటారు డాక్టర్‌ ఉదయ్‌ (ఆది పినిశెట్టి), రేణుక (రీతూవర్మ). ఉదయ్‌ గతంలో లివింగ్‌ రిలేషన్‌లో ఉన్న అమ్మాయికి సంబంధించిన పర్పుల్‌ చెప్పులు ఇంట్లోనే ఉండిపోతాయి. ఉదయ్‌ ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేదంటూ రేణుక తీవ్రంగా మథనపడిపోతుంటుంది. ఆ చెప్పుల కారణంగా వీరి లివింగ్‌ రిలేషన్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించారు? అన్నది ఈ ఎపిసోడ్‌లో చూపించారు. ఆద్యంతం నవ్వులు పంచుతూ అలరించేలా సాగుతుంది ఈ ఎపిసోడ్‌. నేటి యువ జంటలను స్ఫూర్తిగా తీసుకుని ఉదయ్‌, రేణుక పాత్రలు తీర్చిదిద్దారు. సమయమే తెలియకుండా ఈ ఎపిసోడ్‌ సరదాగా సాగుతుంది.

3.వై డిడ్‌ షీ లీవ్‌ మీ దేర్‌?

తల్లిదండ్రులు చనిపోవడంతో మనవడు రాములు (నరేశ్‌ అగస్త్య), అతడి అక్కను అమ్మమ్మ గంగవ్వ (సుహాసిని) పెంచుతుంది. నాలుగు ఇళ్లలో పనిచేసుకుంటూ వారిని సాకుతుంటుంది. అదే సమయంలో జరిగిన ఓ ప్రమాదంలో రాములు అక్క చనిపోతుంది. మరోవైపు గంగవ్వ అనారోగ్యంతో బాధపడుతుంటుంది. దీంతో రాములుని అనాథాశ్రమంలో చేరుస్తుంది. అక్కడ కొత్త జీవితం ప్రారంభించిన రాములు.. పెరిగి పెద్దవాడై రోహన్‌ మోటివేషనల్‌ స్పీకర్‌ అవడమే కాదు, పెద్ద కంపెనీకి సీఈవో అవుతాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు గుండెలకు హత్తుకుంటాయి. ముఖ్యంగా మనవడు-అమ్మమ్మ మధ్య బంధం కంటతడి పెట్టిస్తుంది.

4. వాట్‌ క్లోన్‌ వ్రోట్‌ ది స్క్రిప్ట్‌

అశ్విన్‌ (అభిజీత్‌) ఓ టెలివిజన్‌ ఛానల్‌లో ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌. వందన (మాళవిక) స్టాండప్‌ కమెడియన్‌. వీరిద్దరూ కలిసి ‘తెలుగు మ్యాన్‌’ పేరుతో ఒక సిరీస్‌ చేయాలనుకుంటారు. కానీ ఆ అవకాశం వేరొక అమ్మాయికి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? రెండు పాత్రల మధ్య ఏర్పడిన బంధం ఎటువైపు వెళ్లింది? అనే విషయాలను నేటి తరానికి ఉన్న అభిరుచులకు అనుగుణంగా చూపించారు.

5.ఎబౌట్‌ దట్‌ రసెల్‌ ఇన్‌ ది బుషెస్‌

శ్రీధర్‌ (నరేశ్‌), జ్యోతిక (దివ్యవాణి)ల కుమార్తె స్నేహ (ఉల్కా గుప్తా). తల్లిదండ్రుల కఠిన నియమాలను పాటిస్తూ విసిగి వేసారిపోతుంది. తనకు తగిన వాడిని వెతుక్కునే క్రమంలో అనేక మందిని కలుస్తుంది. మరి స్నేహ తాను అనుకున్నది సాధించిందా? ఈ క్రమంలో కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అన్న అంశాలను ఆసక్తికరంగా చూపించారు దేవిక. పిల్లల పట్ల ప్రేమ మితిమీరితే ఎలా ఉంటుందో నరేశ్‌ పాత్ర ద్వారా చెప్పించారు. ఇందుకు నరేశ్‌ నటనానుభవం ఎంతగానో తోడ్పడింది. నేటి యువతరంలో సగటు అమ్మాయిగా స్నేహ పాత్రలో ఉల్కా గుప్తా చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది.

6. ఫైండింగ్‌ యువర్‌ పెంగ్విన్‌

ఇందు (కోమలా ప్రసాద్‌) మైక్రోబయాలజిస్ట్‌. తన భాగస్వామిగా ఎవరిని ఎంచుకోవాలన్న దానిపై ఆమెకు స్పష్టత ఉండదు. ఈ క్రమంలో రిలేషన్‌షిప్‌లో విఫలమవుతుంది. నేటి యువతలో ఎంతోమంది ఎదుర్కొంటున్న ఈ సమస్యను దర్శకుడు వెంకటేశ్‌ మహా చూపించారు. అయితే, మెన్‌తో రిలేషన్‌షిప్‌ను జంతువులు, పక్షులతో పోల్చడంతో కాస్త ఇబ్బందికరంగా ఉంది.

సిరీస్‌ చూడొచ్చా: అమెరికన్‌ సిరీస్‌ ‘మోడ్రన్‌ లవ్‌’ఆధారంగా ఇండియాలోనూ వివిధ భాషల్లో ఈ సిరీస్‌ తెరకెక్కింది. ఇటీవలే ‘మోడ్రన్‌ లవ్‌ ముంబయి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌’ను ఇక్కడి నేటివిటికీ అనుగుణంగా, నగేశ్‌ కుకునూరు, వెంకటేశ్‌ మహా, ఉదయ్‌ గుర్రాల, దేవిక తెరకెక్కించారు. ప్రేమ ఒక మధురమైన భావన. నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి తమ ప్రేమకు ఒక్కో నిర్వచనం ఇస్తారు. అది వారు ఆరాధించే వ్యక్తులను బట్టి ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రస్తుత యువతకు కనెక్ట్‌ అయ్యేలా చూపించారు. కొన్ని ఎపిసోడ్స్‌లో సన్నివేశాలు కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. ఎలాంటి యాక్షన్‌ హంగామా, రక్తపాతం లేకుండా ఒక హృద్యమైన వెబ్‌సిరీస్‌ చూడాలనుకుంటే ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌’ మంచి ఆప్షన్‌.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని