Mohan babu: చిరు సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకున్నారు!

ప్రముఖ నటుడు మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకుడు. శుక్రవారం

Published : 04 Jun 2021 21:27 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకుడు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను నటుడు సూర్య విడుదల చేశారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో విడుదలైన ఈ టీజర్‌లో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అలరిస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి, సూర్యకు మోహన్‌బాబు ధన్యవాదాలు తెలిపారు.

‘‘నేను సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రాన్ని తీస్తున్నానని నా అభిమానులకి, ప్రేక్షకులకు తెలుసు. ఆ చిత్రానికి ప్రారంభంలో వాయిస్‌ ఓవర్‌ అవసరమైంది. ‘చిరంజీవి అంకుల్‌ వాయిస్‌ అయితే బాగుంటుంది’ అని విష్ణు సలహా ఇచ్చాడు. ఇదే విషయాన్ని చిరుకు ఫోన్‌ చేసి అడిగాను. ‘ఎన్ని రోజులలో కావాలి బాబు’ అని చిరు అడిగారు. ‘పది రోజుల్లో ఎప్పుడైనా ఓకే’ అన్నాను. ‘ఆ వాయిస్‌ ఓవర్‌ మ్యాటర్‌ నాకు పంపు’ అని చిరు నుంచి సమాధానం వచ్చింది. తాను ‘ఆచార్య’ షూటింగ్‌లో బిజీగా ఉన్నా నేను అడిగిన వెంటనే మూడు రోజుల్లోనే నాకు చెప్పకుండా తనే థియేటర్‌ బుక్‌ చేసి, డబ్బింగ్‌ చెప్పి పంపాలనుకున్నారు. ఆ విషయం నాకు తెలిసింది. డబ్బింగ్‌ థియేటర్‌కు విష్ణుని పంపాను. విష్ణును చూడగానే చిరంజీవి నవ్వుతూ ‘నిన్ను ఎవరు రమన్నారు. డబ్‌ చేసి మీ నాన్నకు సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకున్నా’ అన్నారట. అంత గొప్ప మనసు ఎవరికుంటుంది. నేను అడగ్గానే ఇంత గొప్పగా స్పందించిన చిరంజీవి తీరుకి, అతని సహృదయతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు’’

‘‘సన్‌ ఆఫ్‌ ఇండియా టీజర్‌ జూన్‌ 4న నీ చేతుల మీదుగా రిలీజ్‌ చేద్దామనుకుంటున్నా’ అని సూర్యకు చెప్పిన వెంటనే ‘నేను మీ ఫ్యామిలీ మెంబర్‌ని. విష్ణుతో మాట్లాడి ప్లాన్‌ చేసుకుంటాం. మీరు చెప్పిన సమయానికి రిలీజ్‌ అవుతుంది’ అని సూర్య అన్నారు. సూర్యకి నా మీద ఉన్న ప్రేమకి ధన్యవాదాలు. ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ టీజర్‌కి అంచనాలను మించి ప్రేక్షకులకు, అభిమానులు స్పందించినందుకు ధన్యవాదాలు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకు వస్తాం’’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని