Mohan Babu: మా బావ ప్రభాస్‌కు అభినందనలు: ఎక్స్‌ వేదికగా మోహన్‌బాబు పోస్ట్‌ వైరల్‌

Mohan Babu: ‘కల్కి’ మూవీ చూసిన మోహన్‌బాబు ఎక్స్‌ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Updated : 29 Jun 2024 19:48 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సినిమాను చూసిన సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఈ మూవీని చూసిన సీనియర్‌ నటుడు మోహన్‌బాబు (Mohan babu) ‘కల్కి’ టీమ్‌ను మెచ్చుకున్నారు.

‘‘ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం.. మహాద్భుతం! మా బావ ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను’’ అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ప్రభాస్‌ను ‘బావ’ అంటూ పిలవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరూ కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘బుజ్జిగాడు’ చిత్రానికి పనిచేసిన సంగతి తెలిసిందే. అందులో మోహన్‌బాబు సోదరి త్రిషను ప్రేమించేది ప్రభాసే. ఆ ఉద్దేశంతోనే ప్రభాస్‌ను ‘బావ’ అని పిలిచారని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు మోహన్‌బాబు నిర్మిస్తూ నటిస్తున్న ‘కన్నప్ప’లో ప్రభాస్‌ అతిథి పాత్రలో నటించారు. మంచు విష్ణు ఇందులో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు.

‘‘అద్భుతమైన విజువల్‌ వండర్‌ను ఇచ్చిన కల్కి టీమ్‌కు అభినందనలు. ప్రియమైన ప్రభాస్‌ నవ్విస్తూనే అదరగొట్టేశారు. అమితాబ్‌ బచ్చన్‌ నటన ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. మాటలు రావడం లేదు. తర్వాతి భాగంలో కమల్‌హాసన్‌ విశ్వరూపం కోసం ఎదురు చూస్తున్నా. దీపిక పదుకొణె చాలా సులువుగా చేసుకుంటూ వెళ్లిపోయారు. దిశా పటానీ మెరుపులు అలరించాయి. సాంకేతిక బృందానికి అభినందనలు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌, ఎడిటింగ్‌, మేకర్‌ అద్భుతం. వైజయంతీ మూవీస్‌, అశ్వనీదత్‌, స్వప్నదత్‌, ప్రియాంక దత్‌లు రిస్క్‌ చేసి మరీ భారతీయ సినిమాను నిలబెట్టారు. కెప్టెన్‌ నాగ్‌ అశ్విన్‌ తన టేకింగ్‌తో ప్రతి సినిమా ప్రేమికుడిని ఆశ్చర్యపరిచారు. ఈ తరంలో సరికొత్త మార్గానికి బాటలు వేసిన దర్శకుడిగా నిలిచారు’’ - అల్లు అర్జున్‌

‘‘ఇప్పుడే సినిమా చూశా. ఏం చెప్పాలో నాకు మాటలు రావడం లేదు. ఆనందం ఉప్పొంగిపోతోంది. భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లింది. కచ్చితంగా రూ.1000 కోట్ల మూవీ అవుతుంది’’ -విజయ్ దేవరకొండ

‘‘నాగ్‌ అశ్విన్‌ నువ్వు నిజంగా జీనియస్‌. నిజంగా నమ్మలేకపోతున్నా. కల్కి టీమ్‌కు అభినందనలు. ఈ సినిమాకు అందరి ప్రేమ కావాలి. పురాణాల్లో ఉండే పాత్రలను సజీవంగా వెండితెరపై ఆవిష్కరించిన తీరు నాకు బాగా నచ్చింది. అద్భుతమైన చిత్రం’’ - రష్మిక

‘‘నీ అద్భుతమైన ఆలోచనాశక్తికి హ్యాట్సాఫ్‌ నాగ్ అశ్విన్. నీవు కేటాయించిన సమయం, నీవు చేసిన కృషికి యావత్‌ ప్రపంచం అందించే అభినందనలకు అన్ని విధాల అర్హుడవు. భారతీయ సినిమాకు ఇదొక గర్వించదగ్గ సమయం. ప్రభాస్‌, అమితాబ్‌, దీపిక పదుకొణె, కమల్‌హాసన్‌ పాత్రలు తెరపై చూస్తున్నప్పుడు చూపు తిప్పుకోనివ్వలేదు. కల్కి టీమ్‌కు నా అభినందనలు’’ -అజయ్‌ భూపతి, దర్శకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని