MohanRaja: ‘గాడ్‌ ఫాదర్‌’లో పది సర్‌ప్రైజ్‌లు!

‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు మోహన్‌రాజా. తర్వాత పూర్తిగా తమిళ చిత్రసీమకే పరిమితమైన ఆయన.. అక్కడ రీమేక్‌ చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. 21 ఏళ్ల విరామం తర్వాత ‘గాడ్‌ఫాదర్‌’తో తిరిగి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది.

Updated : 04 Oct 2022 10:52 IST

‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు మోహన్‌రాజా (MohanRaja). తర్వాత పూర్తిగా తమిళ చిత్రసీమకే పరిమితమైన ఆయన.. అక్కడ రీమేక్‌ చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. 21 ఏళ్ల విరామం తర్వాత ‘గాడ్‌ఫాదర్‌’తో (GodFather) తిరిగి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్‌’కు ఇది రీమేక్‌. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బుధవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు మోహన్‌రాజా. ఆ విశేషాలివి..

‘‘ధృవ’ సినిమా నుంచి నాకూ చరణ్‌కి పరిచయం. ‘ధృవ 2’ స్క్రిప్ట్‌ గురించి చర్చలు జరుపుతున్న సమయంలో ‘లూసీఫర్‌’ ప్రస్తావన వచ్చింది. నిర్మాత ఎన్వీప్రసాద్‌ దర్శకుడిగా నా పేరు సూచించారు. అది చరణ్‌, చిరంజీవికి నచ్చింది. ఓరోజు ఆయన ఫోన్‌ చేసి పిలిపించారు. వారిని కలిసే ముందే ‘లూసీఫర్‌’ని చూశా. అందులో నాకు ఓ కొత్త కోణం దొరికింది. దాన్నే నేను చిరంజీవితో పంచుకున్నా. అది నచ్చడంతో ‘గాడ్‌ఫాదర్‌’ పనులు మొదలయ్యాయి’’.

* ‘‘గాడ్‌ ఫాదర్‌’ స్క్రీన్‌ప్లే కొత్తగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలూ గెలుస్తాయి. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి. ఇవన్నీ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. ఓపిక ఉంటే ‘లూసీఫర్‌’ని మరోసారి చూసి రండి (నవ్వుతూ). ఈ చిత్రాన్ని నేను పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కంటే ఎక్కువ ప్రేమించాను. ఇందులో ప్లస్‌లు.. మైనస్‌లు నాకే బాగా తెలుసు’’.

* ‘‘చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ లాంటి ఇద్దరు మెగాస్టార్లను డైరెక్ట్‌ చేయడం సులువైన విషయం కాదు. చాలా ఒత్తిడి ఉంటుంది. చిరు ఆ ఒత్తిడిని తీసేశారు. సెట్లో ఆయనిచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. సల్మాన్‌ సెట్‌లో కూల్‌గా ఉంటారు. చిరుపై ఆయనకున్న ప్రేమతో ఈ చిత్రం చేశారాయన’’.

* ‘‘గాడ్‌ఫాదర్‌’కు సీక్వెల్‌ చేసే స్కోప్‌ ఉంది. ‘ధృవ 2’ చేయాలన్న ఆలోచన ఉంది. అయితే ఇదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి. తెలుగులో నాగార్జున - అఖిల్‌తో ఓ స్టైలిష్‌ యాక్షన్‌ సినిమా చేయనున్నా. త్వరలో మరిన్ని వివరాలు
తెలియజేస్తా’’.

* ‘‘21ఏళ్ల తర్వాత తిరిగి తెలుగు సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడులో పుట్టినా.. దర్శకుడిగా జన్మనిచ్చింది తెలుగు చిత్రసీమే. ఇన్నేళ్లు తెలుగు తెరకు దూరంగా ఉన్నా.. ఆ భావన నాలో ఏమాత్రం లేదు. వరుసగా ఆరు తెలుగు చిత్రాల్ని తమిళంలో రీమేక్‌ చేశా. అందుకే ఈ ప్రాంతంతో ఎప్పుడూ దగ్గరగా ఉన్నట్లే ఉంటుంది’’.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు