Ileana: ఆశను కోల్పోయిన వేళ.. నా కన్నీళ్లు తుడిచాడు: ప్రియుడి గురించి ఇలియానా తొలి పోస్ట్‌

తన ప్రియుడు గురించి తొలిసారి పోస్ట్‌ పెట్టారు నటి ఇలియానా (Ileana). ఎన్నో విషయాల్లో అతడు తనకు ధైర్యంగా నిలిచాడని ఆమె చెప్పారు. 

Updated : 10 Jun 2023 15:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి ఇలియానా (Ileana) త్వరలో తల్లి కానున్న విషయం తెలిసిందే. ఇటీవల బేబీమూన్‌కు వెళ్లి వచ్చిన ఆమె తాజాగా ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. తన ప్రియుడి గురించి తొలిసారి ఆమె మాట్లాడారు. తాను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అతడు ధైర్యంగా నిలిచాడని, కన్నీళ్లు తుడిచాడని ఆమె చెప్పారు.

‘‘తల్లి కావడమనేది ఒక అపురూపమైన అనుభూతి. ఇలాంటి ఆనందాన్ని నేను పొందుతానని ఎప్పుడూ ఊహించలేదు. కనుక, ఈ ప్రయాణాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నీలో ఒక జీవి ప్రాణం పోసుకుంటుందనే అనుభూతిని చెందడం ఎంత మనోహరంగా ఉంటుందో వర్ణించలేకపోతున్నా. చాలారోజులు బేబీబంప్‌ని చూస్తూ.. ‘త్వరలో నిన్ను కలవనున్నాను’ అంటూ అమితానందం పొందాను.

అలాగే, కొన్ని కష్టమైన రోజులు.. వాటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా. కొన్ని పరిస్థితులు గందరగోళానికి గురి చేశాయి. మరొకొన్ని పరిస్థితులు నిస్సహాయత కలిగించాయి. కన్నీళ్లు, అపరాధ భావం.. అలాంటి సమయంలో ‘చిన్న చిన్న విషయాలకు ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి’ అని నాకు నేనే ధైర్యాన్ని ఇచ్చుకున్నాను. భవిష్యత్తులో పుట్టబోయే బేబీని ఎలా చూసుకుంటానో నాకు తెలియదు కానీ, ఇప్పుడు అమితంగా ఇష్టపడుతున్నా.

ఇక, నా గురించి నేనే మర్చిపోయిన రోజుల్లో ఈ వ్యక్తి (ప్రియుడిని ఉద్దేశిస్తూ) నాకు అండగా నిలిచాడు. నాలో ధైర్యాన్ని నింపాడు. కన్నీళ్లు తుడిచివేసి.. చిరునవ్వులు పూయించాడు. నాకు ఎప్పుడు ఏం కావాలో అర్థం చేసుకుని.. నా చెంతనే నిలిచాడు. ఇకపై, ఏదీ కష్టంగా అనిపించదు’’ అని ఇలియానా రాసుకొచ్చారు.

‘దేవదాస్‌’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇలియానా.. ‘పోకిరి’, ‘రాఖీ’, ‘మున్నా’, ‘జల్సా’, ‘బర్ఫీ’, ‘బిగ్‌బుల్‌’, ‘కిక్‌’ వంటి చిత్రాల్లో నటించారు. 2018లో విడుదలైన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా.. తాను తల్లి కాబోతున్నట్లు ఏప్రిల్‌ నెలలో ప్రకటించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని