Alluri Sitarama Raju: వెండితెరపై వెలిగిన మన్యం వీరులు వీరే..

ధైర్యం, త్యాగానికి మారుపేరైన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju)  జీవితగాథ తెలుగువారికి సుపరిచితమే. అలాంటి స్వాతంత్ర్య యోధుడి పాత్రలో నటించేందుకు ఎంతోమంది తెలుగు హీరోలు ఆసక్తి కనబర్చినప్పటి....

Updated : 04 Jul 2022 12:25 IST

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) జీవిత గాథ తెలుగువారికి సుపరిచితమే. అలాంటి స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో నటించేందుకు ఎంతోమంది తెలుగు హీరోలు ఆసక్తి కనబర్చినప్పటికీ కేవలం కొందరికి మాత్రమే ఆ అదృష్టం వరించింది. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ కృష్ణ (Superstar Krishna). కృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణే అనే పేరు ప్రేక్షకుడి మదిలో సుస్థిరంగా నిలిచిపోయింది. సోమవారం ‘అల్లూరి సీతారామరాజు’ 125వ జయంతి సందర్భంగా ఆ పోరాటయోధుడి పాత్రలో నటించిన తెలుగు నటులెవరో తెలుసుకుందాం..! 

అల్లూరి పాత్రలో నటించాలని ఎంతగానో ఆశపడ్డ నటుల్లో అగ్రకథానాయకుడు నందమూరి తారకరామారావు(NTR) ఒకరు. ఎన్నిసార్లు ప్రయత్నించినా సీతారామరాజు పాత్ర చేయడం ఆయనకు సాధ్యపడలేదు. ఓ సమయంలో ఆనాటి ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్టు కూడా తయారుచేయించారు. అది పట్టాలెక్కడం కాస్త ఆలస్యమైంది. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్‌ కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ తెరకెక్కించారు. అయితే.. అల్లూరిపై ఉన్న మక్కువతో మరో సినిమా చేయాలని ఉద్దేశంతో ఓసారి పరుచూరి బ్రదర్స్‌ని పిలిపించి కథ సిద్ధం చేయమని కోరగా, ‘కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చూడండి అన్నగారు.. అప్పటికీ మీకు సినిమా చేయాలనిపిస్తే తప్పకుండా కథ రాస్తాం’ అని చెప్పడంతో ప్రత్యేకంగా షో వేయించుకుని సినిమా చూసి, కృష్ణను అభినందించారు. ఇక తాను సీతారామరాజు సినిమా చేయొద్దని నిర్ణయించుకున్నారు. అయితే, సీతారామరాజు పాత్రలో నటించాలనే తన చిరకాల కోరికను ‘సర్దార్‌ పాపారాయుడు’(Sardar Papa Rayudu), ‘మేజర్‌ చంద్రకాంత్‌’ (Major Chandrakanth) చిత్రాలతో తీర్చుకున్నారు. ఆయా చిత్రాల్లోని పాటల్లో ఎన్టీఆర్‌ ‘అల్లూరి’ గెటప్‌లో దర్శనమిస్తారు.


‘‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడూ ఒక్కో విప్లవ వీరుడై బ్రిటిష్‌ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు. సమూహ శక్తి’’ అంటూ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో ఒదిగిపోయి నటించారు సూపర్‌స్టార్‌ కృష్ణ. అల్లూరి కథను ఎలాగైనా ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లాలనే కృష్ణ సంకల్పమే ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారణం. ఎందుకంటే, ఈ చిత్రానికి ముగ్గురు వ్యక్తులు దర్శకత్వం వహించారు. ఈ ప్రాజెక్ట్‌ని వి.రామచంద్రరావు డైరెక్ట్‌ చేయడం ప్రారంభించి.. కొంతభాగం షూట్‌ చేసిన తర్వాత ఆయన కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత కృష్ణ మెగాఫోన్‌ పట్టారు. ఇక, ఇందులోని పోరాట సన్నివేశాలకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించారు. 1974 మే 1 విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. సుమారు 19 థియేటర్లలో శతదినోత్సవ వేడుకలు జరుపుకొంది.


బాలకృష్ణ (Balakrishna) కూడా అల్లూరిగా నటించాలని ఆశపడ్డారు. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ‘భారతంలో బాలచంద్రుడు’లోని(Bharatamlo Bala Chandrudu) ఓ సీన్‌లో సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించారు. ఇక, ఇటీవల విడుదలైన ‘ఎన్టీఆర్‌’ (NTR) బయోపిక్‌ కోసం మరోసారి అల్లూరి గెటప్‌ ధరించారు.


రామ్‌చరణ్‌(RamCharan) ఇటీవల అల్లూరి సీతారామరాజుగా అదరగొట్టేశారు. కొమురంభీమ్‌, అల్లూరి సీతారామరాజుల ఫిక్షనల్‌ కథతో అగ్ర దర్శకుడు రాజమౌళి (Rajamouli) రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో(RRR) సీతారామరాజుగా ఆయన నటించి సినీ ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ ఫైట్‌లో ఆయన అల్లూరిగా బ్రిటిష్‌ వారిపై పోరాటం చేస్తుంటే.. ఆ సన్నివేశాలు చూసి ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని