OTT: ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే!

ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.  ఆ చిత్రాలు.. అవి విడుదలయ్యే డిజిటల్‌ వేదికలేంటో చూద్దాం. 

Updated : 10 Aug 2022 12:27 IST

థియేటర్ల అనిశ్చితి ఇంకా కొనసాగుతుండటంతో సినిమాలన్నీ ఓటీటీ బాటపడుతున్నాయి. భారీ చిత్రాలు సైతం అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌ వంటి డిజిటల్‌ వేదికలను ఎంచుకుంటున్నాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.  ఆ చిత్రాలు.. అవి విడుదలయ్యే డిజిటల్‌ వేదికలేంటో చూద్దాం!

కోల్డ్‌ కేస్ (అమెజాన్‌ ప్రైమ్‌)

కరోనా కారణంగా ఓటీటీ బాట పట్టిన  సినిమా ‘కోల్డ్‌ కేస్’‌. మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ నటిస్తున్న చిత్రమిది. ‘అరువి’ ఫేమ్‌ అదిత్‌ బాలన్‌ ముఖ్యపాత్రలో నటిస్తోంది. తను బాలక్‌ దర్శకుడు. ‘మెమొరిస్‌’, ‘పోలీస్‌ పోలీస్‌’, ‘సెవన్త్‌ డే’, ‘రావణ్‌’ సినిమాల్లో పోలీసుగా అదిరిపోయేలా నటించిన  పృథ్వీరాజ్‌ మరోసారి ఈ సినిమా కోసం ఖాకీ చొక్కా తొడిగాడు. మర్డర్‌ కేసును పరిష్కరించే పోలీసు ఆఫీసర్‌  సత్యజిత్‌ గా ఇందులో ఆయన కనిపించనున్నాడు.  అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 30న విడుదల అవుతోంది. 

హసీన్‌ దిల్‌రూబా (నెట్‌ఫ్లిక్స్‌)

లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో జోరుమీదుంది తాప్సీ. మరోసారి అలాంటి చిత్రంతోనే  ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.  కరోనా కారణంగా విడుదల ఆలస్యమవుతూ వచ్చిన ‘హసీన్‌ దిల్‌రూబా’ చివరకు ఓటీటీ బాట పట్టింది. జులై 2న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలవుతోంది. రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తాప్సీకి జోడిగా విక్రాంత్‌ మాస్సే నటిస్తున్నాడు. ఇందులో తెలుగు నటుడు హర్షవర్ధన్‌ రాణె కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. వినీల్‌ మాథ్యూ దర్శకుడు.  మునుపెన్నడు కనిపించని విధంగా ఇందులో కొత్తగా కనిపిస్తోంది తాప్సీ. సస్పెన్స్‌, యాక్షన్‌ కలగలిసిన ఈ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ఏ మేరకు అలరిస్తుందో తెలియాలంటే జులై 2న చూసి తెలుసుకోవాల్సిందే. 

పొగరు (ఆహా)

‘కేజీయఫ్‌’ చిత్రం తెలుగులో ఘనవిజయం సాధించినప్పటి నుంచి కన్నడ హీరోలు తెలుగులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.   కన్నడ సినిమాలు  ‘యువరత్న’, ‘రాబర్ట్‌ ’, ‘పొగరు’ తెలుగులోకి అనువాదాలుగా ఈ  ఏడాదే విడులయ్యాయి. వీటిలో ధ్రువ్‌ సార్జా నటించిన ‘పొగరు’ ఆకట్టుకుంది. అయితే, ఎక్కువ థియేటర్‌లలో విడుదలకాకపోవడం, కరోనా పరిస్థితులు కారణంగా పెద్దగా టాక్‌ తెచ్చుకోలేదు. ఇప్పుడీ చిత్రం డిజిటల్‌ మీడియాలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జులై 2న తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా విడుదలవుతోంది. పక్కా మాస్‌ మసాలా ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా చేసింది. 

లోకి :తెలుగు( డిస్నీ హాట్ స్టార్‌)

ఇప్పటికే ఇంగ్లీష్‌ విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీస్‌ ‘లోకి: ది మిస్చీఫ్’‌. మార్వెల్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగులో కాస్త ఆలస్యంగా జూన్‌ 30న విడుదల కాబోతుంది.  ఇంగ్లీష్‌ వెర్షన్‌లో ఇప్పటివరకు మూడు ఎపిసోడ్లు  విడుదలయ్యాయి. నాలుగో ఎపిసోడ్‌ జూన్‌ 30న విడుదలవుతోంది.  అదే రోజున తెలుగు, తమిళం భాషల్లో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ‘లోకి’ అలరించేందుకు సిద్ధమైంది. 

ఈ వారంలో రానున్న మరికొన్ని చిత్రాలు

చిత్రంపేరు విడుదల తేదీ ఎక్కడ చూడొచ్చు
జూన్‌ జూన్‌ 30 ప్లానెట్‌ మరాఠీ
సోఫీ జూన్‌ 30 నెట్‌ఫ్లిక్స్‌
ప్రైమ్‌ టైమ్‌ జూన్‌ 30 నెట్‌ఫ్లిక్స్‌
సిండ్రెల్లా స్టోరీ: స్టార్‌ స్ట్రక్‌ జూన్‌ 30 బుక్‌ మై షో స్ట్రీమ్‌
నో సడెన్‌ మూవ్‌ జులై 1 హెచ్‌బీవో మాక్స్‌
జనరేషన్‌ 56కె జులై 1 నెట్‌ఫ్లిక్స్‌
ది లాస్ట్‌ క్రూయిజ్‌ జులై 1 డిస్నీ హాట్ స్టార్‌
యంగ్‌ రాయల్స్‌ జులై 1 నెట్‌ఫ్లిక్స్‌
రేడియోయాక్టివ్‌ జులై 2 బుక్‌మై షో స్ట్రీమ్‌
ది టుమారో వార్‌ జులై 2 అమెజాన్‌ ప్రైమ్‌
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? జులై 2 ఆహా
వుయ్‌ ది పిపుల్‌ జులై 3 నెట్‌ఫ్లిక్స్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని