Published : 04 Dec 2021 17:58 IST

Cinema news: 2021 ఆఖరి నెలలో సినిమా సందడి.. విడుదల కానున్న సినిమాలివే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాదంతా లాక్‌డౌన్‌తో సినిమాలకు దూరమైన ప్రేక్షకులకు ఈ ఏడాది కాస్త వినోదం లభించింది. కొన్ని సినిమాలు థియేటర్లలో.. మరికొన్ని సినిమాలు/వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో సందడి చేశాయి. అయితే, పెద్ద సినిమాలన్నీ 2022లో విడుదలకు సిద్ధమవుతుండగా.. మరికొన్ని సినిమాలు మాత్రం అంతకన్నా ముందే.. ఈ ఏడాది చివరి నెల డిసెంబర్‌లోనే విడుదల కాబోతున్నాయి. మరి ఆ సినిమాలేవో చూసేద్దామా..!

పుష్ప (పార్ట్‌ -1) - డిసెంబర్‌ 17

క్లాసిక్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ నుంచి రాబోతున్న మాస్‌ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్‌(ది రైజ్‌)ను డిసెంబర్‌ 17న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో అల్లు అర్జున్‌.. ‘పుష్పరాజ్‌’ పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జోడీగా నటి రష్మిక.. శ్రీవల్లి పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇటీవల పుష్ప సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌లో మూడోది కావడం విశేషం.


స్పైడర్‌ మ్యాన్‌ నో వే హోమ్‌ - డిసెంబర్‌ 17

అటు.. మార్వెల్ అభిమానులు ఇటు.. స్పెడ‌ర్ మ్యాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ‘స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్’ ఎట్టకేలకు డిసెంబర్‌ 17న విడుదల కాబోతుంది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, తెలుగు, తమిళ్‌ భాషల్లో విడుదల చేయనున్నారు. టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఈ సారి ‘డాక్టర్ స్ట్రేంజ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.


శ్యామ్‌ సింగరాయ్‌ - డిసెంబర్‌ 24

కథానాయకుడు నాని నటించిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రం డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. బెంగాల్‌ గడ్డపై మీసం తిప్పిన తెలుగోడి కథతో ఈ చిత్రం తెరకెక్కిందని చిత్రబృందం చెబుతోంది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు, టీజర్లకు మంచి స్పందన లభించింది. సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.


గని - డిసెంబర్‌ 24

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన  తాజా చిత్రం ‘గని’. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఓ కుర్రాడు.. బాక్సింగ్‌ క్రీడాకారుడిగా ఎలాంటి చరిత్ర సృష్టించాడు? కెరీర్‌లో దూసుకెళ్లే తరుణంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అనే ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. వరుణ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి సాయీ మంజ్రేకర్‌ నటిస్తున్నారు. జగపతిబాబు, ఉపేంద్ర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


83 - డిసెంబర్‌ 24 

భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన స్పోర్ట్స్‌ డ్రామా ‘83’. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు చిత్రబృందం ఈ సినిమాని డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించారు. ఇందులో కపిల్‌దేవ్ సతీమణిగా రణ్‌వీర్‌కు జోడీగా దీపికా పదుకొణె నటించారు. తాహీర్‌ రాజ్‌ భాసిన్‌, జీవి, కీలకపాత్రలు పోషించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేయనున్నారు.


అత్రంగి రే - డిసెంబర్‌ 24

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్, కోలీవుడ్‌ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అత్రంగి రే’. సారా అలీఖాన్‌ కథానాయిక. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌’ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ప్రేమికులైన ధనుష్‌, సారా అలీఖాన్‌ గొడవ పడతారు. దీంతో ధనుష్‌ను దూరంపెట్టిన సారా అలీఖాన్‌ అక్షయ్‌ కుమార్‌కు ఎందుకు దగ్గరైందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఏఆర్‌ రెహమాన్‌ నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్‌ ఎల్‌. రాయ్‌, భూషణ్‌ కుమార్‌, హిమాన్షు శర్మ, కృష్ణన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


జెర్సీ - డిసెంబర్‌ 31

2019లో తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని బాలీవుడ్‌లో అదే పేరుతో రీమేక్‌ చేశారు. ఇందులో హీరోగా షాహిద్‌ కపూర్‌ నటించారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించారు. గత నెల 5నే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడి.. డిసెంబర్‌ 31న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌, సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌, దిల్‌రాజు, అమన్‌గిల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో విజయ్‌ దేవరకొండ నటించిన బ్లాక్‌బ్లాస్టర్‌ హిట్‌ చిత్రం ‘అర్జున్‌రెడ్డి’ని కూడా బాలీవుడ్‌లో ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. అందులోనూ షాహిద్‌ కపూరే కథానాయకుడు. ఇవీ కాకుండా.. డోంట్‌ లుక్‌ అప్‌(డిసెంబర్‌ 10), ఛండీగఢ్‌ కరే ఆషికీ (డిసెంబర్‌ 10) తదితర చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. 

Read latest Cinema News and Telugu News

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని