Ab Dilli Dur Nahin: సినిమా కోసం అంబానీ ఫోన్‌.. ప్రాంక్‌ అనుకున్న చిత్ర బృందం!

Ab Dilli Dur Nahin: ఇటీవల విడుదలైన ‘అబ్‌ దిల్లీ దూర్‌ నహీ’ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ ప్రత్యేకంగా చూడాలనుకున్నారు. ఇదే విషయమై అంబానీ ఆఫీస్‌ నుంచి చిత్ర బృందానికి ఫోన్‌ చేస్తే వాళ్లు అస్సలు నమ్మలేదట. ఈ ఆసక్తికర విషయాలను కథానాయకుడు ఇమ్రాన్‌ జాహిద్‌ తాజాగా పంచుకున్నారు.

Updated : 15 May 2023 17:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అనుకోకుండా కొత్త నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చి అవతలి వ్యక్తి ‘నేను ఫలానా హీరోను, బిజినెస్‌మ్యాన్‌ను’ అని మాట్లాడితే మొదట ఎవరూ నమ్మరు. ఎవరైనా ప్రాంక్‌ చేస్తున్నారేమో అనుకుంటారు. ‘అబ్‌ దిల్లీ దూర్‌ నహీ’ (Ab Dilli Dur Nahin) చిత్ర బృందానికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేసి, ‘మా సర్‌ మీ సినిమాను యాంటీలియా(అంబానీ నివాసం) చూడాలనుకుంటున్నారు. స్క్రీనింగ్‌ ఏర్పాటు చేస్తారా?’ అని అడిగితే, తాము మొదట నమ్మలేదని చిత్ర బృందం పేర్కొంది. అధికారిక మెయిల్‌ ఐడీ ద్వారా సమాచారం ఇస్తేనే స్పందిస్తామని చెప్పిందట. దీంతో ముకేశ్‌ అంబానీ ఆఫీస్‌ నుంచి ‘మా సీఎండీ ముకేశ్‌ అంబానీ కోసం మీరు తీసిన ‘అబ్‌ దిల్లీ దూర్‌ నహీ’ని ఆయన నివాసమైన యాంటీలియాలో ప్రదర్శించగలరు’ అని మెయిల్‌ రావడంతో చిత్ర బృందం ఆనందంతో ఉబ్బితబ్బిబైయిందట.

ఇటీవల జరిగిన ఈ ఆసక్తికర సంఘటనపై చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్‌ జాహిద్‌ మాట్లాడుతూ.. ‘‘మా సినిమా వేల మందిలో స్ఫూర్తినింపడమే కాదు, ముఖేశ్‌ అంబానీలాంటి గొప్ప వ్యక్తులు చూడాలనిపించేలా ఉండటం మాకు దక్కిన గౌరవం.. అంతకన్నా ఎక్కువే. సినిమా స్క్రీనింగ్‌ కోసం ముఖేశ్‌ అంబానీ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వస్తే మేము ప్రాంక్‌ కాల్‌ అనుకున్నాం. అధికారికంగా మెయిల్‌ పెట్టమని అడిగాం. నిజంగానే మెయిల్‌ వచ్చింది. యాంటీలియాలో స్క్రీనింగ్‌ కావడం పట్ల మా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి’’ అని చెప్పారు. ముంబయిలోని ముఖేశ్‌ అంబానీ నివాసంలో వారి కుటుంబం కోసం ప్రత్యేకంగా థియేటర్‌ ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా విషయానికొస్తే, బిహార్‌కు చెందిన గోవింద్‌ జైశ్వాల్‌ యువకుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఓ సామాన్య రిక్షా కార్మికుడి కుమారుడైన జైశ్వాల్‌ సివిల్‌ సర్వీసెస్‌ సాధించేందుకు పడిన కష్టాలను, జీవిత ప్రయాణాన్ని హృదయానికి హత్తుకునేలా కమల్‌ చంద్ర తెరకెక్కించారు. ఇమ్రాన్‌ జాహిద్‌, శ్రుతి సోడి కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా  మే12 అతి తక్కువ థియేటర్‌లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ దర్శక-నిర్మాత మహేశ్‌భట్‌ ఇందులో అతిథి పాత్ర పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని