Mukhachitram review: రివ్యూ: ముఖచిత్రం

Mukhachitram review: విశ్వక్‌సేన్‌, వికాస్‌ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్యరావ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘ముఖచిత్రం’ ఎలా ఉందంటే?

Updated : 09 Dec 2022 17:10 IST

Mukhachitram review; చిత్రం: ముఖ‌చిత్రం; న‌టీన‌టులు: వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్, విష్వ‌క్‌సేన్ (ఓ కీల‌క‌పాత్ర‌లో), ర‌విశంక‌ర్ త‌దిత‌రులు; సంగీతం: కాల భైరవ; కూర్పు: పవన్ కళ్యాణ్; సమర్పణ: ఎస్ కే ఎన్; నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల; కథ స్క్రీన్ ప్లే, మాటలు - సందీప్ రాజ్; దర్శకత్వం - గంగాధర్; సంస్థ‌:  పాకెట్ మ‌నీ పిక్చ‌ర్స్‌; విడుద‌ల‌: 09 -12-2022

ఈవారం ప‌దుల సంఖ్య‌లో సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. చూడాల‌నే ఆస‌క్తిని ప్రేక్ష‌కుల్లో క‌లిగించిన సినిమాలు ఇందులో  కొన్నే.  ‘ముఖ‌చిత్రం’ ప్ర‌చార చిత్రాలు ఆక‌ర్షించాయి. ‘కల‌ర్‌ఫొటో’ తీసిన ద‌ర్శ‌కుడు సందీప్ రాజ్ ర‌చ‌న చేయ‌డం, క‌థానాయ‌కుడు విష్వ‌క్‌సేన్ ఇందులో భాగం కావ‌డం త‌దిత‌ర విష‌యాలు సినిమాపై కాస్త అంచ‌నాల్ని పెంచాయి. (Mukhachitram review) మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందో లేదో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం...

క‌థేంటంటే: మ‌హ‌తిని (ప్రియ వ‌డ్ల‌మాని)ని ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకుంటాడు రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట).  అత‌నొక  ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్. మ‌రోప‌క్క అత‌న్ని మాయా ఫెర్నాండెజ్ (అయేషా ఖాన్) అనే యువ‌తి చిన్న‌ప్ప‌ట్నుంచీ ప్రేమిస్తుంటుంది. త‌న ప్రియుడికి పెళ్లి కావ‌డంతో నిరాశ చెందుతుంది. అంతా సవ్యంగా సాగుతున్న ద‌శ‌లో రాజ్ జీవితంలో కొన్ని అనూహ్య‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. అవి రాజ్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అత‌ని జీవితంలో డాక్టర్ సత్య (చైతన్య రావు) ఎలా భాగమయ్యాడన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవ‌ల్సిందే.

ఎలా ఉందంటే: ఒక ముఖ్య‌మైన విష‌యాన్ని ప్ర‌స్తావించిన చిత్ర‌మిది. ఇలాంటి సామాజిక ప‌ర‌మైన అంశాల్ని  సినిమాతో స్పృశించ‌డం మంచి ప‌రిణామం. ఆ విష‌యంలో చిత్రబృందాన్ని మెచ్చుకోవాల్సిందే.  కానీ, దాన్ని డీల్ చేసిన విధానంలోనే లోటుపాట్లు క‌నిపిస్తాయి.  సామాజికాంశాన్ని  ప్రేక్ష‌కుడికి  న‌చ్చే వినోదంతో మేళ‌వించిన తీరు అత‌క‌లేదు.  ప్ర‌థమార్ధం మొత్తం పాత్ర‌ల ప‌రిచ‌యంతోనే గ‌డిచిపోతుంది.  చెప్పాల‌నుకున్న‌దంతా ద్వితీయార్ధంలో చెప్ప‌డం కోసం ప్ర‌య‌త్నించారు.  కొన్ని మ‌లుపులు ఆక‌ట్టుకున్నా, ఆ త‌ర్వాత మ‌ళ్లీ సినిమా గాడి త‌ప్పింది. కోర్ట్ రూమ్ డ్రామా సినిమాకి కీల‌కం. కానీ అది కూడా సినిమాపై పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌దు. నిజానికి ఈ క‌థ‌లో మంచి సందేశం, థ్రిల్ల‌ర్ అంశాలు, కోర్ట్ రూమ్ డ్రామా వంటి బ‌ల‌మైన ముడిస‌రకు ఉన్నాయి. కానీ, వాటిని స‌రైన స‌మ‌యంలో స‌రైన రీతిలో వాడుకోవ‌డ‌మే కుద‌ర‌లేదు. దాంతో దేనిక‌దే ప్ర‌త్యేకంగా అనిపిస్తుంది. ప్రేక్ష‌కుడు ఎక్క‌డా క‌థ‌లో లీనం కాలేని ప‌రిస్థితి. ద్వితీయార్ధం ఆరంభ స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా సాగినా, ఆ త‌ర్వాత మ‌ళ్లీ  ఆ జోరు క‌నిపించ‌దు. సినిమా పూర్తయ్యాక ఓ  బ‌ల‌మైన క‌థాంశం వృథా అయిన‌ట్టు అనిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: ప్రియా వ‌డ్ల‌మాని న‌ట‌న సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.  ఆమె రెండు కోణాల్లో సాగే పాత్ర‌లో మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. వికాస్ వ‌శిష్ఠ , ఆయేషాఖాన్, చైత‌న్య‌రావు కూడా ఆక‌ట్టుకుంటారు. విష్వ‌క్‌సేన్  ఓ కీల‌క పాత్ర‌లో మెరుస్తారు. కోర్ట్ రూమ్ డ్రామాలో ఆయ‌న, ర‌విశంక‌ర్ ల న‌ట‌న మెప్పిస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కాల‌భైర‌వ సంగీతం ఆక‌ట్టుకుంటుంది.   కెమెరా ప‌నిత‌నం మెచ్చుకోత‌గ్గ స్థాయిలో ఉంది. సందీప్‌రాజ్ క‌థ‌, మాట‌లు బాగున్నాయి. క‌థ‌నం ప‌రంగా ఆయ‌న చేసిన క‌స‌ర‌త్తులు చాల‌లేదు. ద‌ర్శ‌కుడు గంగాధ‌ర్ కొన్ని స‌న్నివేశాల‌పై మాత్ర‌మే ప్ర‌భావం చూపించారు. నిర్మాణం బాగుంది.

బ‌లాలు: 👍 క‌థా నేప‌థ్యం, 👍 ప్రియా వ‌డ్ల‌మాని న‌ట‌న‌, 👍 ద్వితీయార్ధంలో మ‌లుపులు

బ‌ల‌హీన‌త‌లు: 👎 ప్ర‌థ‌మార్ధంలో కొన్ని స‌న్నివేశాలు, 👎 ఆస‌క్తిని రేకెత్తించ‌ని క‌థ‌నం 👎 ప‌తాక స‌న్నివేశాలు

చివ‌రిగా: ముఖ‌చిత్రం: కాన్సెప్ట్ బాగుంది కానీ..

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని