Mukkamala: ఒకప్పుడు పెద్ద ఇల్లు.. చివరికి శవాన్ని తరలించడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి..!
నటులు తామే సినిమాలు నిర్మించడం, కొందరు దర్శకత్వం వహించడం ఎప్పటి నుంచో ఉంది. మహిళా నటుల్లో దాసరి కోటిరత్నం, కృష్ణవేణి, భానుమతి, అంజలిదేవి, సావిత్రి ఇలా ఎందరో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించారు. ఇంకొందరు నిర్మాతలుగా మారి చిత్రాలు తీశారు.
ఇంటర్నెట్‌డెస్క్: నటులు తామే సినిమాలు నిర్మించడం, కొందరు దర్శకత్వం వహించడం ఎప్పటి నుంచో ఉంది. మహిళా నటుల్లో దాసరి కోటిరత్నం, కృష్ణవేణి, భానుమతి, అంజలిదేవి, సావిత్రి ఇలా ఎందరో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించారు. ఇంకొందరు నిర్మాతలుగా మారి చిత్రాలు తీశారు. వాళ్లలో ముక్కామల ఒకరు. దుష్టపాత్రలు ధరించడంలో ముందు పేరు తెచ్చుకున్న ముక్కామల కృష్ణమూర్తి.. హెచ్.ఎమ్.రెడ్డి ‘నిర్దోషి’ (1951)లో కథానాయకుడి పాత్ర వేశారు. తర్వాత అన్నిరకాల పాత్రలూ చేశారు. ‘మాయాబజార్’, ‘జగదేకవీరుని కథ’, ‘అప్పుచేసి పప్పు కూడు’ తదితర చిత్రాల్లో గుర్తుండే పాత్రలు చేశారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటించారు.
1957లోనే ఆయన ‘ఋష్యశృంగ’ చిత్రంగా తీయాలని అనుకున్నారు. ఒక నిర్మాత లభించగా ఆ చిత్రాన్ని డైరెక్టు చేశారు. అది, 1961లోగానీ విడుదల కాలేదు. హరనాథ్, రాజసులోచన ముఖ్య పాత్రధారులు. అయితే అంతకుముందే ఆయన 1952లో తానే దర్శకుడు, నిర్మాత, హీరోగా ‘మరదలు పెళ్లి’ తీశారు. ఈ చిత్రం పరాజయం పొందడంతో ముక్కామల బాగా నష్టపోయారు. ‘ఋష్యశృంగ’కి కూడా ఆయన ఆర్థికంగా తోడ్పడ్డారు. అదీ ఆశించిన విజయం సాధించలేదు. మద్రాసులోని త్యాగరాయగానసభ (వాణీమహల్) ఎదురుగా ముక్కామలకు పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇల్లు పోయింది. తర్వాత అద్దె ఇంట్లోనే ఉండేవారు.
సినిమా నిర్మాణంలో సాధక బాధకాలు చాలా ఉంటాయి. నిర్మాణ రంగంలో అనుభవశాలులు తప్ప, నటులు నిలదొక్కుకోవడం కష్టం. ముక్కామల, మళ్లీ సినిమా తీయకపోయినా, పాత్రధారణ కూడా తగ్గడంతో ఇబ్బందులు పడ్డారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తూ ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చి మరణించారు. స్వస్థలమైన గుంటూరుకు ముక్కామల భౌతికదేహాన్ని తరలించడానికి కూడా డబ్బుల్లేవు. అప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కలగజేసుకుని ఆయన భౌతిక దేహాన్ని గుంటూరుకు తరలించే ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.