Published : 07 Jan 2022 23:19 IST

Bangarraju: ‘మనం’ సమయంలో అనుకున్నది ‘బంగార్రాజు’తో కుదిరింది: అనూప్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శక-నటులు, నాయకానాయికలు కాంబినేషన్లకే కాదు నటుడు- సంగీత దర్శకుడు కాంబోకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంటుంది. వాటిల్లో అక్కినేని నాగార్జున- అనూప్‌ రూబెన్స్‌ కాంబినేషన్‌ ఒకటి. ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రాలతో అలరించిన వీరిద్దరూ త్వరలో ‘బంగార్రాజు’తో సందడి చేయనున్నారు. నాగార్జున హీరోగా కల్యాణ్‌కృష్ణ తెరకెక్కించిన చిత్రమిది. నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. ఈ సినిమా జనవరి 14న విడుదలవుతున్న నేపథ్యంలో అనూప్‌ రూబెన్స్‌ మీడియాతో మాట్లాడారు.

సీక్వెల్‌కు సంగీతమందించటం క‌ష్టం అనిపించిందా?

అనూప్‌: సీక్వెల్‌కు సంబంధించి ఒత్తిడి ఉండటం సహజమే. తొలిభాగం ఘన విజయం అందుకోవటంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరుగుతాయి. ఆ అంచనాల్ని అందుకోవాలంటే అంతకుమించి కష్టపడాల్సి ఉంటుంది. ‘బంగార్రాజు’ విషయంలోనూ అంతే. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం సూపర్‌ హిట్‌కావటంతో దాని సీక్వెల్‌ ‘బంగార్రాజు’ విషయంలో కాస్త ఒత్తిడి అనిపించింది. సంగీతం విషయంలోనే కాదు సీక్వెల్‌ అంటే అన్ని విభాగాలు చాలా కష్టపడాలి. నాగార్జునగారు, దర్శకుడు కల్యాణ్‌కృష్ణ ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు.

కొందరు సంగీత దర్శకులు కొంతమంది హీరోల చిత్రాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారనటంలో నిజముందా?

అనూప్‌: కాంబినేషన్‌ వల్ల ఇలా జరుగుతుంటుంది. ఏదైనా నిర్మాణ సంస్థను మాతృ సంస్థగా భావించటం కారణం కావొచ్చు. ఎందుకంటే ఆయా సంస్థలతో అప్పటికే పనిచేసి ఉంటాం కాబట్టి తదుపరి చిత్రాలకు పనిచేయడం తేలికవుతుంది. వారు మా నుంచి ఏం కోరుకుంటున్నారో ఇట్టే తెలిసిపోతుంది. దానికి తగ్గట్టు అవుట్‌పుట్‌ ఇస్తాం. అంతే తప్ప మరో కారణంలేదు. ఏ సినిమాకైనా మేం ఒకేలా కష్టపడతాం.

నాగార్జునతో మరోసారి కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

అనూప్‌: నాగార్జునగారు స్నేహపూర్వకంగా ఉంటారు. నాకే కాదు ప్రతి సంగీత దర్శకుడికీ ఆయన పూర్తి స్వేచ్ఛనిస్తారు. ఆయన సినిమాలకు పనిచేసే సాంకేతిక నిపుణులందరి ఫీలింగ్‌ ఇదే. ఆయనంత ఫ్రీడమ్‌ ఇస్తారు కాబట్టి మా బాధ్యత పెరుగుతుంది. మంచి ఫలితం వచ్చేందుకు నిర్విరామంగా కృషి చేశాం.

* నాగార్జునతో పాట పాడించాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది?

అనూప్‌: ‘మ‌నం’ సినిమా చిత్రీకరణ సమయంలో.. ఆ సినిమాలోని ‘పీయో పీయో రే’ పాటను నాగ్‌ సర్‌ స‌ర‌దాగా పాడారు. ఆయన గాత్రంలో ఆ పాట చాలా బాగుంది. ‘మీ వాయిస్ సూపర్‌ సర్‌. ఓ పాట పాడండి అని అడిగా’. అది ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంతో సాధ్యమైంది. అందులో ‘డిక్క‌డిక్క‌డుండుం..’ అనే క్యాచీ గీతాన్ని ప్రయత్నించాం. ఆ పాట‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అలాంటి గీతమే ‘బంగార్రాజు’లోనూ ఉంది. ‘లడ్డుండా’ అనే పాటను పాడి మరోసారి సందడి చేశారాయన.

* పాట పాడ‌టం క‌ష్ట‌మేనా?

అనూప్‌: ఎవరు చేసే పని వారికి తేలిక. ఇతరుల పని చేయమంటే కష్టం. సంగీతం అందించే, పాటలు పాడే నన్ను న‌టించ‌మంటే క‌ష్టంగా ఫీలవుతా. వేరే పని చేసేవారిని పాట పాడమంటే కష్టమే మరి!  కొంత‌మంది మాత్రం ఏదైనా చేయగలరు. విజయం అందుకోగలరు.

* ‘బంగార్రాజు’ ఆల్బ‌మ్ అంచ‌నాలు అందుకుందా?

అనూప్‌: ఇప్పటి వరకూ మూడు పాటలు విడుదల చేశాం. వాటిల్లో ‘లడ్డుండా’ ఎక్కువ మందికి చేరువైంది. అందరినీ మెప్పించింది. ‘నా కోసం’, ‘వాసివాడి తస్సాదియ్యా’కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే మరో పాటను విడుదల చేయబోతున్నాం.

* గ‌తంలో అన్ని పాటలు ఒకేసారి విడుదలయ్యేవి. ప్ర‌స్తుతం ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తున్నారు. ఈ విధానం సినిమాకు కలిసొస్తుందా?

అనూప్‌: ట్రెండ్‌కు తగ్గట్టు సినిమా ప్రచారం చేయటమే మంచిది. అప్పట్లో క్యాసెట్లు, సీడీల్లో పాటలు వినేవారు. ఇప్పుడు ఇంటర్‌నెట్‌ వేదికగా సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒక్కో పాటను ఒక్కో రోజు విడుదల చేయటం వల్ల సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.

* సిధ్‌ శ్రీ‌రామ్‌ గురించి చెప్తారా?

అనూప్‌: సిధ్‌ స్వరంలో ఏదో తెలియని మాయ ఉంటుంది. ఆయన.. భగవంతుడు మనకందించిన బహుమతి. తను ఏ పాట పాడినా అద్భుతంగా ఉంటుంది. స్వతహాగా నేను మెలొడీనే ఇష్టపడతా. అందుకే ఆయనతో అవే పాడిస్తుంటా. ‘నీలి నీలి ఆకాశం’ (30 రోజుల్లో ప్రేమించటం ఎలా?), ‘సోసోగా ఉన్న నన్నే’ (మంచి రోజులు వచ్చాయి) పాటలు అలా వచ్చినవే. ఇప్పుడు ‘నా కోసం’ (బంగార్రాజు) శ్రోతల్ని అలరిస్తోంది.

* మీరు బాణీ కట్టాలంటే ప్రేరేపించే అంశాలేంటి?

అనూప్‌: ముందుగా కథ. స్టోరీని ఇష్టపడితే ఆటోమేటిక్‌గా సందర్భానికి తగిన బాణీలు వస్తుంటాయి. ప్రయాణాల్లోనూ కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఆ ట్యూన్‌ అలా చేస్తే బెటర్‌, ఇలా చేస్తే బాగుంటుందని మనసులో అనుకుంటా. తర్వాత దాన్ని ఆచరణలో పెడతా.

* ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్తారా?

అనూప్‌: ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమాను చూస్తుంటే గ్రామీణ వాతావరణంలో ఉన్నట్టే అనిపిస్తుంది. కథకు తగ్గట్టే పాటలు, నేపథ్య సంగీతం అందించా. బీజీఎం (బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌) ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సినిమాకు రీ-రికార్డింగ్ ఎప్పుడో పూర్త‌యింది. ఇలాంటి పెద్ద చిత్రాలకు రీ రికార్డింగ్‌ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ త‌క్కువ స‌మ‌యంలోనే దీన్ని పూర్తి చేయగలిగాం. చిత్రీకరణ కూడా సుమారు నాలుగు నెలల్లోనే పూర్త‌యింది. సమష్టి కృషి వల్ల ఇంత త్వరగా విడుదలవుతుంది.

* దర్శకుడు కల్యాణ్‌కృష్ణలో మీరు చూసిన మార్పేంటి?

అనూప్‌: మా కాంబినేషన్‌లో వచ్చిన  ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు ఐదేళ్లు. టేకింగ్‌ విషయంలో ఆయనలో ఎంతో పరిణతి కనిపించింది. ఆయన రాసే సంభాషణలన్నీ హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. కథ, డైరెక్షన్‌ విషయంలో చాలా స్పష్టత ఉంటుంది.

* కొవిడ్ వ‌ల్ల ప‌ని విధానంలో మార్పు గమనించారా?

అనూప్‌: క‌ష్ట‌ప‌డేవారికి ఎక్క‌డున్నా ఒక్క‌టే. పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఎక్కడుంటున్నా పనిని ప్రేమించాలి. అయితే, లాక్‌డౌన్‌ వల్లే కుటుంబంతో గడిపే సమయం దొరికింది.

* త‌దుప‌రి సినిమాల విశేషాలు?
అనూప్‌: రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కిన ‘శేఖ‌ర్’కు సంగీతం అందించా. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా వుంది. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం చాలా కీలకం. విక్రమ్‌ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాకు పనిచేస్తున్నా.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్