F 3: ఈసారి ‘ఎఫ్‌ 2’కి మించిన నవ్వులు.. పాటలు: దేవిశ్రీ ప్రసాద్‌

ఆయన అందించిన బీట్‌ వింటే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ డ్యాన్స్‌ చేయాలనిపిస్తుంది. ఆయన పాటలకు శ్రోతలు ఫిదా అవ్వాల్సిందే. ఆ సంగీతం సంచలనం మరెవరో కాదు దేవిశ్రీ ప్రసాద్‌. ఆయన మ్యూజిక్‌ అందించిన తాజా చిత్రం ‘ఎఫ్‌ 3’. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దేవిశ్రీ విలేకరులతో మాట్లాడారు. ఆ సంగతులివీ..

Published : 21 May 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆయన అందించిన బీట్‌ వింటే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ డ్యాన్స్‌ చేయాలనిపిస్తుంది. ఆయన పాటలకు శ్రోతలు ఫిదా అవ్వాల్సిందే. ఆ సంగీతం సంచలనం మరెవరో కాదు దేవిశ్రీ ప్రసాద్‌. ఆయన మ్యూజిక్‌ అందించిన తాజా చిత్రం ‘ఎఫ్‌ 3’. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దేవిశ్రీ విలేకరులతో మాట్లాడారు. ఆ సంగతులివీ..

* ‘ఎఫ్ 3’ ఎలా ఉండబోతుంది?

దేవిశ్రీ: ‘ఎఫ్‌ 2’కి మించి ఉండబోతుంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి కామెడీ మార్క్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు రీరికార్డింగ్‌ చేస్తున్నప్పుడు నవ్వీనవ్వీ నా పొట్ట చెక్కలైంది. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాలు ఎలా ఉంటాయో ఇదీ ఆ తరహాలోనే గిలిగింతలు పెట్టబోతోంది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్రప్రసాద్‌, సునీల్‌, అలీ.. ఇలా అందరూ తమదైన శైలిలో నవ్వులు పంచారు ఈ చిత్రంలో.

* ‘ఎఫ్ 2’కు మీరిచ్చిన సంగీతం శ్రోతలను విశేషంగా మెప్పించింది. ‘ఎఫ్ 3’ విషయంలో ఒత్తిడి అనిపించిందా?

దేవిశ్రీ: అనిల్ రావిపూడి పక్కనుంటే అసలు ఒత్తిడే అనిపించదు. స్క్రిప్ట్‌తోనే ఆయన సినిమా చూపిస్తారు. ఆయా పాత్రల గురించి వివరిస్తూ.. ఆయనే వాటిల్లో ఒదిగిపోతారు. అనిల్‌లో మంచి నటుడున్నాడు. సంగీతం విషయానికొస్తే.. ‘ఎఫ్‌ 2’లో పాటలు సందర్భానుసారం వచ్చేవే. ‘ఎఫ్‌ 3’లో మరో ముందడుగేశాం. సామాజికాంశాలు శ్రోతలకు కనెక్ట్‌ అయ్యేలా ప్రయత్నించాం.

* ఇప్పటికే ‘ఎఫ్ 3’ ఆల్బమ్ హిట్‌ అయ్యింది. ఈ చిత్రం విషయంలో మీరు మరిచిపోలేని ప్రశంస? 

దేవిశ్రీ: పాటలు బాగున్నాయంటూ చాలా మంది సందేశాలు పంపారు. పాటలతోపాటు నేపథ్యసంగీతం బాగుందని అనిల్‌ రావిపూడి మెచ్చుకోవడాన్ని మరిచిపోలేను. ‘మీకు వంద హగ్గులు, వంద ముద్దులు’ అంటూ ఆయన నన్ను పొగడ్తల్లో ముంచెత్తారు.

* కంపోజ్‌ విషయంలో మెలొడీ, ఐటెమ్‌ గీతాలకుండే తేడా వివరిస్తారా?

దేవిశ్రీ: మెలొడీ, ప్రత్యేక గీతాలకు సంబంధించి ఓ తేడా ఉంది. సన్నివేశం, కథ ఆధారంగా మెలొడీలు వస్తుంటాయి. ఐటెమ్‌ పాటలకు ఇలాంటివేం అవసరం లేదు. పాటను స్వరపరిచేటపుడు నేను ఓ కంపోజర్‌గా కాకుండా శ్రోతలానే ఉంటా. ట్యూన్ కంపోజ్ చేశాక దానికి నేను డ్యాన్స్ చేస్తానా, లేదా? అని చెక్‌ చేసుకుంటా. అలా నేను కట్టిన ట్యూన్‌కు నా కాలు కదిలిందంటే ఆ పాట హిట్టే అనుకుంటుంటా.

* సంగీత దర్శకుల మధ్య ఎలాంటి పోటీ ఉంటుంది?

దేవిశ్రీ: సంగీత దర్శకుల మధ్య పోటీ అనేదే ఉండదు. ఒకరి పాట ఒకరికి నచ్చితే దాని నుంచి ప్రేరణ పొందుతుంటాం. ఇలాంటివి మనమూ చేస్తే బావుంటుందనిపిస్తుంటుంది.

* ఒక్కోసారి పాటలు హిట్‌ అయినా సినిమాలు విజయం అందుకోవు. అప్పుడేమనిపిస్తుంది?

దేవిశ్రీ: ఇలాంటి జరగడం సహజమే. ఆల్బమ్స్‌ సూపర్‌హిట్‌ అవుతాయి కానీ సినిమాలు అంతగా ఆడకపోవచ్చు. ఈ విషయంలో పెద్దగా ఫీలవను. ఆ ప్రయాణాన్ని నెమరువేసుకుంటుంటా. ఒక్కోసారి మనం ఊహించినదానికంటే పెద్ద విజయం అందుకుంటాయి. ‘రంగస్థలం’ ఈ కోవలోకే వస్తుంది. ఈ చిత్రం తెలుగులో విడుదలైనా నాకు దేశవ్యాప్తంగా గుర్తింపొచ్చింది. పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’తో ఇంకా ఎక్కువమందిని అలరించగలిగా.

* నిర్మాత దిల్‌రాజుతో మీ ప్రయాణం గురించి?

దేవిశ్రీ: మేము నిర్మాత- సంగీత దర్శకుడిగా కాకుండా కుటుంబ సభ్యుల్లా ఉంటాం. ఆయనకు సినిమా అంటే విపరీతమైన ప్యాషన్‌. ఆయన చూడని విజయాలు లేవు. అయినా ఇంకా ఏదో చేయాలని తపన పడుతుంటారు. ఆయన నిర్మించే సినిమాల గురించి నాతో చర్చిస్తుంటారు. నా జడ్జిమెంట్‌పై ఆయనకు ఎంతో నమ్మకం. మేం ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకుంటాం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని