నా రాజ్ లేడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నా: సంగీత దర్శకుడు కోటి
సంగీత దర్శకుడు రాజ్ మృతిపట్ల కోటి విచారం వ్యక్తం చేశారు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల తాము విడిపోయామని, తాను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ తన పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగానని చెప్పారు.
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన ప్రాణ స్నేహితుడు, సోదర సమానుడైన రాజ్ మరణించిన వార్త తెలుసుకున్న సంగీత దర్శకుడు కోటి కన్నీరు పెట్టుకున్నారు. సంగీత ప్రపంచంలో రాజ్-కోటి ద్వయం ఎన్నో అద్భుతమైన పాటలు ఇచ్చింది. ఇద్దరూ కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. రాజ్ మరణ వార్త తెలుసుకున్న కోటి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు.
‘‘నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నా. నా రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. మొన్నీ మధ్యే ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు. ఈ రోజు గుండెపోటుతో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధగా ఉంది. రాజ్ కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్-కోటి పాటలు అనేవారు. మేం ఇద్దరం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లం. చక్రవర్తి దగ్గర మేం ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం. ‘ముఠామేస్త్రి’, ‘హలోబ్రదర్’ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం. ఈ రోజు నా రాజ్ లేడంటూ ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ కలకాలం ఉంటాడు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోయాం.నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ నా పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగా. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటివాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. వద్దురా విడిపోవద్దు అని అన్నాడు. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయాం. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడు’’ అంటూ కోటి కన్నీరు పెట్టుకున్నారు.
చిరంజీవి సంతాపం
రాజ్ మృతి పట్ల ప్రముఖ హీరో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటిల్లో ‘రాజ్’ ఇక లేరు అని తెలవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ ఉన్న రాజ్.. నా కెరీర్ తొలి దశలో నా చిత్రాలకందించిన బాణీలు ఆయా సినిమాల విజయంలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. రాజ్ అకాల మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి!’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్
రాజ్ మృతి పట్ల ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ‘‘సినీ సంగీత దర్శకుడు రాజ్‌గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. అలనాటి సంగీత దర్శకుడు టి.వి.రాజు గారి వారసుడుగా రాజ్ తనదైన బాణీని చూపారు. తన మిత్రుడు కోటి గారితో కలసి రాజ్- కోటి ద్వయంగా చక్కని సంగీతం అందించారు. అన్నయ్య చిరంజీవి నటించిన ‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నెం. 786’, ‘త్రినేత్రుడు’ తదితర చిత్రాలకు మంచి సంగీతం అందించడంలో రాజ్ గారి భాగస్వామ్యం ఉంది’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
భార్య, అత్త, బావమరిదిని కోల్పోయాడు.. చివరి క్షణంలో ఆగడంతో బతికిపోయాడు!
-
India News
సిగ్నలింగ్ వ్యవస్థలో తీవ్ర లోపాలు.. 3 నెలల క్రితమే హెచ్చరించిన రైల్వే ఉన్నతాధికారి
-
Ap-top-news News
Tirumala: ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే బ్రేక్ దర్శనాలు
-
Crime News
Khammam: దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య!.. మంటల్లో కాలిపోతుండగా గుర్తింపు..
-
Sports News
Lionel Messi: చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
Ts-top-news News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమినరీకి.. 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత